చిరుతపులిని హతమార్చిన వేటగాళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2020-03-12T11:46:34+05:30 IST

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా మరుపల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులిని చంపి చర్మాన్ని మంచిర్యాల జిల్లాలో విక్రయించేందుకు వచ్చిన ముగ్గురు వేటగాళ్లను రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.

చిరుతపులిని హతమార్చిన వేటగాళ్ల అరెస్టు

చర్మాన్ని విక్రయించేందుకు ప్రయతాలు

వలపన్ని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

అటవీశాఖ సమన్వయంతో ప్రత్యేక టీమ్‌తో పర్యవేక్షణ

రామగుండం సీపీ సత్యనారాయణ


కోల్‌సిటీ, మార్చి 11: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా మరుపల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులిని చంపి చర్మాన్ని మంచిర్యాల జిల్లాలో విక్రయించేందుకు వచ్చిన ముగ్గురు వేటగాళ్లను రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మరుపల్లి గ్రామానికి చెందిన వేటగాళ్లు కొండగొర్ల తిరుపతి, సద్‌మిక్‌ గంగారాం, వెలది తులసీరాంను అరెస్టు చేసి వారి వద్ద నుంచి చిరుతపులి చర్మం, పులి గోర్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణ  అరెస్టు వివరాలను వెల్లడించారు. వన్యప్రాణుల వేటను నిరోధించేందుకు అటవీశాఖ సమన్వయంతో అటవీశాఖ అధికారులు, అడిషన్‌ డీసీపీ(అడ్మిన్‌), అడిషనల్‌ డీసీపీ(లాఅండ్‌ఆర్డర్‌) రవికుమార్‌, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షణ టాస్క్‌ఫోర్స్‌ సీఐ రాజ్‌కుమార్‌, కిరణ్‌, ఎస్‌ఐ మస్తాన్‌, సిబ్బందితో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు వివరించారు.


కొన్ని రోజులుగా ప్రాణహిత నది అవతల మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహెరి తాలుకా మరుపల్లి గ్రామంలో ఒక చిరుత పులిని చంపి, దాని చర్మం ఒలిచి, ఎండబెట్టి మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సిర్సా గ్రామంలో విక్రయించేందుకు తీసుకు వస్తున్నారనే నమ్మదగిన సమాచారంతో బుధవారం రామగుండం టాస్క్‌ఫోర్స్‌ సీఐలు రాజ్‌కుమార్‌, కిరణ్‌, ఎస్సై మస్తాన్‌ ఆధ్వర్యంలో బృందం దాడి జరిపింది. ముగ్గురు వేటగాళ్లను అరెస్టు చేసి చిరుతపులి చర్మం, గోర్లను స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజులుగా ప్రాణహిత నది అవతలి ఒడ్డున సర్వంచ శివారులోని అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్టు గ్రామాల్లో ప్రచారం జరిగింది. వేటగాళ్లు చిరుతపులిని ఎలాగైనా చంపి చర్మాన్ని విక్రయిస్తే పెద్ద మొత్తంలో సులువుగా డబ్బులు సంపాదించవచ్చునని పథకం వేసుకున్నారు. చిరుత పులి సంచరిస్తున్న ప్రాంతంలో వేటగాళ్లు కాలి ముద్రల ఆధారంగా విద్యుత్‌ వైర్లతో ఉచ్చు బిగించి చంపారు. చర్మాన్ని ఎండబెట్టి మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సిర్సా గ్రామంలో విక్రయించేందుకు తీసుకురాగా బుధవారం రామగుండం టాస్క్‌ఫోర్స్‌ సీఐలు రాజ్‌కుమార్‌, కిరణ్‌, ఎస్‌ఐ మస్తాన్‌ ఆధ్వర్యంలో బృందం దాడి జరిపింది. ముగ్గురు వేటగాళ్లను అరెస్టు చేసి చిరుతపులి చర్మం, గోర్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 


డ్రోన్‌ కెమెరాతో పర్యవేక్షణ

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని అడవులను నరకకుండా, వన్య ప్రాణులను వేటాడకుండా ఎళ్లప్పుడూ పోలీస్‌ నిఘా ఉంచారు. అటవీశాఖ, పోలీస్‌శాఖ సమన్వయంతో అటవీ ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాల సహాయం రెక్కి నిర్వహిస్తున్నారు. కమిషనరేట్‌ పరిధిలో 9కేసులలో 56మందిని బైండోవర్‌ చేశారు.


పర్యావరణ సమతుల్యం..

అడవులను స్మగ్లర్లు విచక్షణ రహితంగా నరికి వేయడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. అటవీ సంపదను, వన్య ప్రాణాలకు నష్టం కలిగించే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాలు ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు జారీ చేయడంతో పాటు పోలీస్‌శాఖకు కూడా ఈ బాధ్యతలు అప్పగించినట్టు సీపీ  సత్యనారాయణ తెలిపారు. స్మగ్లర్ల వివరాలు సేకరించేందుకు, అక్రమ రవాణా అరికట్టేందుకు కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్‌, సీసీఎస్‌ ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్టు సీపీ సత్యనారాయణ వివరించారు. 


అధికారులు, సిబ్బందిని అభినందనలు

పులిచర్మం కేసులో నిందితులను పట్టుకోవడంలో పాల్గొన్న టాస్క్‌ఫోర్స్‌ సీఐ రాజ్‌కుమార్‌, కిరణ్‌, ఎస్‌ఐ షేక్‌ మస్తాన్‌, కానిస్టేబుల్‌ రాజేందర్‌, సంజీవ్‌, శ్రీనివాస్‌, ప్రకాష్‌, మల్లేష్‌, చంద్రశేఖర్‌, సునీల్‌, హోమ్‌గార్డు హైదర్‌ ప్రత్యేక టీమును సీపీ సత్యనారాయణ అభినందించారు. విలేకరుల సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, అడిషనల్‌ డీసీపీలు అశోక్‌కుమార్‌, రవికుమార్‌, జైపూర్‌ ఏసీపీ నరేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-03-12T11:46:34+05:30 IST