రజాకార్లపై రగల్‌ జెండా

ABN , First Publish Date - 2020-09-17T10:40:22+05:30 IST

ఉద్యమాల ఖిల్లాగా ఎన్నో పోరాటాలు చేసిన ఈ ప్రాంతవాసులు తెలంగాణ సాయుధ పోరాటంలో పాలు పంచుకున్నారు

రజాకార్లపై రగల్‌ జెండా

సాయుధ పోరాటంలో జిల్లావాసులు

నేడు తెలంగాణ విమోచన దినోత్సవం


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: ఉద్యమాల ఖిల్లాగా ఎన్నో పోరాటాలు చేసిన ఈ ప్రాంతవాసులు తెలంగాణ సాయుధ పోరాటంలో పాలు పంచుకున్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి తమవంతుగా ఊపిరిలూదారు. రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో జగిత్యాలలో కూడా యువకులు జట్లుగా ఏర్పడి పోరాటం చేశారు. సెప్టెంబరు 17 సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రతి ఒక్కరూ గుర్తకు తెచ్చుకుంటున్నారు.   


జగిత్యాలలో తిరుగుబాటు

రజాకార్లపై జగిత్యాలలో తిరుగుబాటు చేశారు. యువకులంతా జట్టు కట్టి వారికి వ్యతిరేకంగా పోరాటం సలిపారు. నల్గొండకు చెందిన కేశవరావు ఆధ్వర్యంలో జగిత్యాలకు చెందిన వెంకటేశ్వర్‌రావు, ఏనుగు నారాయణరెడ్డి, జవ్వాజి మల్లేశం, సిద్ధంశెట్టి వీర సంఘయ్య, గంప లక్ష్మీరాజం గుప్తా, కాసం శివరాజా గుప్తాలాంటి వారు పోరాటాలు చేసి నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. 1935లో సిరిసిల్లలో జరిగిన 4వ ఆంధ్ర మహాసభ తర్వాత జగిత్యాలలో గ్రంథాలయం ఏర్పాటు చేసి ఈ ప్రాంతవాసుల్లో నిజాం పాలనకు వ్యతిరేకంగా చైతన్యం తీసుకువచ్చారు. 1946-47 ప్రాంతంలో రజాకర్ల దళం, మహ్మదీయులు జగిత్యాలలో మకాం వేసి హిందువులపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. అదే సమయంలో కేశవరావు ఆధ్వర్యంలో తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. వారిని ఎదుర్కొనేందుకు కమలాకర్‌ ఆధ్వర్యంలో తల్వార్‌(కత్తి)లు తయారు చేసుకుని పరోక్షంగా యుద్ధానికి సంకేతాలు పంపారు.


జగిత్యాల ప్రాంతంలో అప్పట్లో ఆర్థికంగా బలపడిన వైశ్యులతో పాటు ఇతర గృహాలపై దాడి చేసేందుకు రజాకార్లు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. సమాచారం అందడంతో అప్పటికే జట్టుగా ఏర్పడిన నారాయణ రెడ్డి, శివరాజా గుప్తా, జవ్వాజి పుల్లయ్య, జవ్వాజి మల్లేశం ఆధ్వర్యంలో రజాకార్లపై వీరు దాడికి ప్రయత్నించారు. నారాయణరెడ్డి ఆధ్వర్యంలో గోవాకు వెళ్లి తుపాకులు తెచ్చుకున్న వీరు నాగ్‌పూర్‌ సమీపంలోని చింతలబరిడి ఫోర్ట్‌లో శిక్షణ పొందారు. ఇందుకు కావాల్సిన డబ్బులను జువ్వాజి పుల్లయ్య తనవంతు సహకారాన్ని అందించాడని చెబుతుంటారు. ఆ తర్వాత జగిత్యాల ప్రాంతంలో రజాకార్లకు వ్యతిరేకంగా ర్యాలీ తీయడంతో పాటు వీరి వద్ద తుపాకులు ఉన్నాయనే సమాచారం మేరకు పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టారు.


రజాకర్లకు వ్యతిరేకంగా వీరు రాత్రిపూట ప్రజల్లో చైతన్యం తీసుకువస్తూ వారికి సహకరించకుండా ఎప్పటికప్పుడు ప్రజల్లో మార్పులు తీసుకురావడంతో ఈ ప్రాంతంలో రజాకార్ల ప్రభావం తగ్గుతూ వచ్చింది. ఈ ప్రాంతానికి చెందిన నాయకులు రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో పోలీసులు ఒత్తిడి పెంచారు. దీంతో కొందరు అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతానికి చెందిన నారాయణ రెడ్డితో పాటు మరికొందరు కలిసి జట్టుగా ఏర్పడి రజాకార్లపై తిరుగుబాటు చేశారు. ఆయుధాల ఉపయోగంలో శిక్షణ పొందిన వీరు నిజాం సైనికులపై తిరుగుబాటు చేశారు. ఇలా నైజాం పాలనకు వ్యతిరేకంగా జగిత్యాలలో రగల్‌ జెండా ఎగిరింది.

Updated Date - 2020-09-17T10:40:22+05:30 IST