నిరుద్యోగ భృతి ఏదీ?

ABN , First Publish Date - 2020-11-23T05:30:00+05:30 IST

ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ భృతిని కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చి రెండేళ్లయినా ఇంతవరకు ఆ హామీ నెరవేరడం లేదు.

నిరుద్యోగ భృతి ఏదీ?

 రెండేళ్లయినా నెరవేరని హామీ

 ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువు

 ఉపాధి కోసం రుణాలైనా ఇవ్వరు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ భృతిని కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చి రెండేళ్లయినా ఇంతవరకు ఆ హామీ నెరవేరడం లేదు. దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. అటు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక, ఇటు.. నిరుద్యోగ భృతి లేక అల్లాడుతున్నారు. 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు నెలకు 3,016 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతిని కల్పిస్తామని కేసీఆర్‌ ప్రతి ఎన్నికల ప్రచార సభలో హామీ ఇచ్చారు. ఎన్నికలు జరిగి రెండోసారి గద్దెనెక్కిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరుద్యోగ భృతి హామీని అటకెక్కించింది. కనీసం దాని ఊసు కూడా ఎత్తడం లేదు. జిల్లాలో ప్రతి ఏటా అనేక మంది ఉన్నత చదవులు చదివినా ఉద్యోగాలు దొరకడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో ప్రైవేట్‌రంగంలో ఉద్యోగాల వేటలో ఉన్నారు. ప్రైవేట్‌లో కూడా పోటీ పెరగడంతో నామమాత్రంగా వేతనాలను ఇస్తున్నారు. ఎక్కువగా హైదరాబాద్‌ లాంటి నగరంలోనే ప్రైవేట్‌ ఉద్యోగాలు ఉన్నాయి. కానీ వాళ్లు ఇచ్చే వేతనాలు ఎంత మాత్రం సరిపోవడం లేదని నిరుద్యోగులు చెబుతున్నారు. 

 కరోనా ప్రభావంతో..


కరోనా వ్యాప్తి చెందడంతో లాక్‌డౌన్‌ కారణంగా అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా అనేక మంది హైదరాబాద్‌ విడిచి స్వగ్రామాలు, పట్టణాలకు చేరుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆయా రంగాలు కోలుకుంటున్నప్పటికీ గతంలో ఇచ్చిన వేతనాల కంటే తక్కువ వేతనాలు ఇస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నా కూడా ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. నలుగురు చేసే పనిని ఒక్కరే చేయాల్సి వస్తున్నది. పరిపాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేసిన విషయం తెలిసిందే. అలాగే కొత్తగా పలు రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేశారు. కానీ ఆ మేరకు ఏమాత్రం పోస్టులను పెంచలేదు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలే ఉండవని, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలే ఉంటాయని చెప్పిన సీఎం కొన్ని శాఖల్లో ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేస్తున్నారని నిరుద్యోగులు చెబుతున్నారు. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించాలనే లక్ష్యంతో ఆ పోస్టులను కూడా కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేశారు. ‘నీళ్లు, నిధులు, నియమాకాలు’ అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణలో యువకులు ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం పోస్టులను భర్తీ చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగాలు భర్తీ చేయక పోయినా ఇస్తామన్న నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వక పోవడంతో నిరుద్యోగులు ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్నారు. 

 అందని సబ్సిడీ రుణాలు..

గతంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గానూ బ్యాంకుల అనుసంధానంతో సబ్సిడీ రుణాలు అందించే వారు. ఒక్క ఎస్సీ, ఎస్టీలకు మినహా మిగతా వాళ్లకు అంతంత మాత్రంగానే రుణాలు ఇప్పిస్తున్నారు. బీసీలకైతే సబ్సిడీ రుణాలు అందని ద్రాక్షే. ఎన్నికలు వస్తేనే కొందరికి రుణాలు ఇస్తారు. ఉద్యోగాలు, సబ్సిడీ రుణాలు లేక, నిరుద్యోగ భృతి లేక నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే వృత్తి పనులు చేసుకుంటున్నప్పటికీ వచ్చే డబ్బులు సరిపోవడం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చాలని నిరుద్యోగ యువకులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2020-11-23T05:30:00+05:30 IST