‘అమ్మ’చీరలతో...నేతన్నలకు భరోసా

ABN , First Publish Date - 2020-12-20T05:38:00+05:30 IST

బతుకమ్మ చీరల ఉత్పత్తి ముగియడంతోనే నేత కార్మికులకు తమిళనాడు ‘అమ్మ’చీరలతో ఉపాధి భరోసా లభించింది. బతుకమ్మ చీరలతో తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ సిరిసిల్ల నేత కార్మికులు ప్రత్యేక గుర్తింపు పొందారు.

‘అమ్మ’చీరలతో...నేతన్నలకు భరోసా
సిరిసిల్ల మరమగ్గాలపై తమిళనాడు చీరల ఉత్పత్తి

 - సిరిసిల్ల మరమగ్గాలపై 10 లక్షల తమిళనాడు చీరలు

- సంక్రాంతి ఆర్డర్‌తో నేతన్నలకు ఉపాధి

- సిరిసిల్లలో 2,500 మరమగ్గాలపై ఐదు రంగుల్లో ఉత్పత్తి

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

బతుకమ్మ చీరల ఉత్పత్తి ముగియడంతోనే నేత కార్మికులకు తమిళనాడు ‘అమ్మ’చీరలతో ఉపాధి భరోసా లభించింది. బతుకమ్మ చీరలతో తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ సిరిసిల్ల నేత కార్మికులు ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలంగాణ ఆడపడుచులకు  నాలుగు సంవత్సరాలుగా ఏటా రూ.300 కోట్లకు పైగా వ్యయంతో కోటి చీరల ఉత్పత్తి నిరాటంకంగా జరుగుతోంది. రంగు రంగుల చీరలతో ప్రత్యేకతను సంతరించుకున్న  సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు తమిళనాడులో ప్రతీ సంవత్సరం అందించే పొంగల్‌ చీరల ఆర్డర్లు కూడా లభిస్తున్నాయి. బతుకమ్మ చీరల ఉత్పత్తి పూర్తి కావడంతోనే మరో రెండు నెలలు తమిళనాడు చీరలతో సిరిసిల్ల కార్మికులకు ఉపాధి లభిస్తోంది. తమిళనాడులో ప్రభుత్వం  పొంగల్‌  (సంక్రాంతి) పండుగ సందర్భంగా  ఆడపడుచులకు ‘అమ్మ’ చీరలను అందించే సంప్రదాయాన్ని చాలా కాలంగా కొనసాగిస్తోంది. దాదాపు 3 కోట్ల చీరలు, పంచెలు పంపిణీ చేస్తోంది. ఇందులో ఎక్కువగా ఈరోడ్‌, సేలం, కొయంబత్తూర్‌, తిర్పూర్‌ మరమగ్గాల పరిశ్రమకు ఆర్డర్లు వెళ్తే సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు 10 లక్షల చీరల ఉత్పత్తి ఆర్డర్లు వస్తున్నాయి. బతుకమ్మ చీరల తయారీ అక్టోబరుతో ముగిసిపోగా కార్మికులకు మళ్లీ చేతినిండా పనికలిగే విధంగా పొంగల్‌ చీరల తయారీ మొదలైంది. సిరిసిల్ల నుంచి 2014 నుంచి ఏటా 10 లక్షల మేరకు చీరలు తమిళనాడుకు ఎగుమతి అవుతున్నాయి.  సిరిసిల్లలో 2500 మరమగ్గాలపై 5.50 మీటర్ల చీరలు ఐదు రంగుల్లో తయారవుతున్నాయి. ఒక్కో పవర్‌లూంపై దాదాపు 80 మీటర్ల వరకు ఉత్పత్తి జరుగుతోంది. ప్రతీ రోజు రెండు లక్షల మీటర్ల వరకు బట్ట ఉత్పత్తి అవుతోంది. కార్మికుడికి నిరంతరం పనిదొరుకుతోంది. సాధారణ పాలిస్టర్‌ బట్ట ఉత్పత్తితో పోల్చుకుంటే రెండింతల కూలి లభిస్తోంది.  తమిళనాడు చీరల ఉత్పత్తిలో మీటరుకు రూ.2.25 పైసల వరకు కూలి వస్తోంది. దీంతో కార్మికుడు ప్రతీనెల రూ.12 వేల వరకు వేతనం పొందుతున్నాడు.  డిసెంబరు చివరి వరకు తమిళనాడు చీరల ఉత్పత్తి జరుగుతుంది. దీని తర్వాత కార్మికులకు మళ్లీ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆర్డర్‌లు రానున్నాయి. 


బతుకమ్మ చీరలకు బీజం

తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా అందిస్తున్న చీరల ఉత్పత్తికి తమిళనాడులో అమ్మచీరల పంపిణీతోనే బీజం పడిందని చెప్పుకోవచ్చు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పడుగు, పేకలు ఉరితాళ్లు పేనుతున్న క్రమంలో కార్మికులకు ఉపాధిని అందిస్తూ తమిళనాడులో పంపిణీ చేసే చీరల ఉత్పత్తి సిరిసిల్లలో మొదలైంది. 2014 నుంచి సిరిసిల్ల మరమగ్గాలపై నిరంతరంగా తమిళనాడు చీరలు ఉత్పత్తి అవుతున్నాయి. ఆంధ్రాలోని గుంటూరుకు చెందిన వస్త్రవ్యాపారి ఎస్‌.రామారావు 2012లో మొదట కాటన్‌ చీరలను సిరిసిల్లమరమగ్గాలపై తయారీకి ఊతం ఇచ్చారు. కాటన్‌ సైజింగ్‌లు లేకపోవడంతో మానుకున్నారు. 2014లో తమిళనాడులో అమ్మచీరల పంపిణీలో ఉపయోగించే పాలిస్టర్‌చీరల తయారీ ఆర్డర్‌ను తీసుకొచ్చారు. సిరిసిల్ల మరమగ్గాలపై ఉత్పత్తికి అవకాశం కల్పించారు. ఆత్మహత్యలు సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమలో కార్మికులకు కొంత ఉపాధి లభించింది. అదే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, చేనేత జౌళీశాఖ మంత్రిగా ఉన్న కే తారకరామారావు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మంచిరోజులు తేవాలని కార్మికులకు చేతినిండా పనికల్పించడానికి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా తమిళనాడులో అమ్మ చీరలు పంపిణీ చేసినట్లు తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడానికి పరిశీలించారు. 2017లో సిరిసిల్లలో తయారవుతున్న చీరలను చేనేతజౌళిశాఖ అధికారులు పరిశీలించి  అమ్మ చీరల కంటే మెరుగ్గా బతుకమ్మ చీరల తయారీని చేపట్టారు. నాలుగు సంవత్సరాలుగా నిర్విఘ్నంగా చీరల పంపిణీ కొనసాగుతోంది. ఈ సారి కూడా బతుకమ్మ పండుగకు రూ .316 కోట్లతో 287 రంగుల్లో బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసి పంపిణీ చేశారు.

Updated Date - 2020-12-20T05:38:00+05:30 IST