కల్లాలుగా మారుతున్న రోడ్లు

ABN , First Publish Date - 2020-11-13T10:06:31+05:30 IST

అన్నదాతలు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రోడ్లనే కల్లాలుగా మార్చుకుంటున్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులను చూసిన ప్రభుత్వం ఉపాధిహామీ నిధులతో ధాన్యాన్ని ఆరబెట్టడం, ధాన్యం తూర్పారా బట్టడానికి అనువుగా వారి వ్యవసాయ

కల్లాలుగా మారుతున్న రోడ్లు

కదలిక లేని కల్లాల నిర్మాణం

జిల్లాలో 1,708 కల్లాలకు రూ 14.01 కోట్లతో అంచనాలు 

1,638 కల్లాలు మంజూరు... 52 పూర్తి 

నిర్మాణ దశలో 244

ఉపాధిహామీ నిధుల కేటాయింపు

రైతుల స్థోమతను బట్టి మూడు రకాల ప్లాట్‌ఫాంలు


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

అన్నదాతలు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రోడ్లనే కల్లాలుగా మార్చుకుంటున్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులను చూసిన ప్రభుత్వం ఉపాధిహామీ నిధులతో ధాన్యాన్ని ఆరబెట్టడం, ధాన్యం తూర్పారా బట్టడానికి అనువుగా వారి వ్యవసాయ భూముల వద్దే వ్యక్తిగతంగా పంట కల్లాలను నిర్మించుకునే వీలును కల్పించింది. ఇందుకు ప్రభుత్వం రైతు స్థోమతను బట్టి మూడు రకాల యూనిట్లను తయారు చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంతో ఆర్భాటంగా కల్లాల నిర్మాణాలు లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నా నిర్మాణాలు మాత్రం ముందుకు సాగడం లేదు.


జిల్లాలో ఇప్పటి వరకు 52 కల్లాల నిర్మాణం పూర్తయినా వాటికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. కల్లాల నిర్మాణాలను ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా నిర్మిస్తుండగా మిగతా వారికి 90 శాతం రాయితీ కల్పిస్తున్నారు.  జిల్లాలో 1,708 కల్లాల నిర్మాణాలను రూ. 14.01 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇందులో 1,638 కల్లాలకు రూ.13.45 కోట్లు మంజూరయ్యా యి. ఇందులో 244 నిర్మాణ దశలో ఉండగా 52 పూర్తి చేశారు. రైతులకు ధాన్యం తడిసి మట్టి కొట్టుకుపోవడం దిగుబడి తగ్గిపోవడం, సరైన ధరలు రాకపోవడం వంటి సమస్యలు తీరనుండడంతో పొలాల వద్దనే కల్లాల నిర్మాణానికి రైతులు అసక్తి చూపారు. 


మూడు రకాలుగా నిర్మాణాలు... 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,708 కల్లాల నిర్మాణం చేపట్టాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. 52 పూర్తి చేశారు. జిల్లాలో రూ. 1,638 కల్లాలకు మంజూరు లభించగా వీటిలో మూడు రకాలుగా మంజూరు ఉంది. 50 స్క్వేర్‌ మీటర్లతో నిర్మించే ఫ్లాట్‌ఫాంకు యూనిట్‌ విలువ రూ. 56 వేలు, 60 స్క్వేర్‌ మీటర్ల ప్లాట్‌ఫాంకు రూ. 68 వేలు, 75 స్క్వేర్‌ మీటర్ల ఫ్లాట్‌ఫాంకు రూ. 85 వేలతో నిర్మించనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా నిర్మిస్తుండగా మిగతా వారికి 90 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. మండలం, గ్రామాల వారీగా కోటాను కేటాయించి దరఖాస్తులను స్వీకరించారు.


మండలాల వారీగా కేటాయించిన కల్లాల నిర్మాణాల్లో మంజూరైన వాటిలో బోయినపల్లి 167, చందుర్తి 65, ఇల్లంతకుంట 250, గంభీరావుపేట 135, కోనరావుపేట 222, ముస్తాబాద్‌ 166, రుద్రంగి 40, తంగళ్లపల్లి 205, వీర్నపల్లి 61, వేములవాడ 11, వేములవాడ రూరల్‌ 120, ఎల్లారెడ్డిపేట 196 నిర్మించడానికి మంజూరు లభించింది ఇందుకు రూ 13.45 కోట్ల నిధులు కేటాయించారు. జిల్లాలో ఇప్పటి వరకు  బోయినపల్లిలో 2, చందుర్తిలో 3, ఇల్లంతకుంటలో 13, కోనరావుపేటలో 10, ముస్తాబాద్‌లో 5, తంగళ్లపల్లిలో 2, వీర్నపల్లిలో 2, వేములవాడ రూరల్‌లో 8, ఎల్లారెడ్డిపేటలో 7 కల్లాలను పూర్తి చేశారు. 

Updated Date - 2020-11-13T10:06:31+05:30 IST