రెవెన్యూ శాఖలో కొత్త శకం

ABN , First Publish Date - 2020-09-12T11:02:00+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకవచ్చిన రెవెన్యూ చట్టానికి, వీఆర్‌ఓల వ్యవస్థను రద్దు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలపడంతో ..

రెవెన్యూ శాఖలో కొత్త శకం

నూతన రెవెన్యూ చట్టానికి అసెంబ్లీలో ఆమోదం

తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు

నాలుగైదు రోజుల్లోనే మ్యూటేషన్‌, పట్టాదారు పాసు బుక్‌ జారీ

మూడేళ్లుగా ప్రయోగాత్మకంగా అంతర్గాంలో రిజిస్ట్రేషన్లు

వ్యవసాయ భూములకు ఆకుపచ్చ రంగు పాసుబుక్‌లు

వ్యవసాయేతర భూములకు ముదురు ఎరుపురంగు పాసుబుక్‌లు


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి): తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకవచ్చిన రెవెన్యూ చట్టానికి, వీఆర్‌ఓల వ్యవస్థను రద్దు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలపడంతో రెవెన్యూ శాఖలో ఇక నూతన శకం ప్రారంభం కానున్నది. నూతనంగా తీసుకవచ్చిన రెవెన్యూ చట్టం ద్వారా వ్యవసాయ భూములను కొనుగోలు చేసే రైతులు ఇక నుంచి తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. 


తహసీల్దార్‌ కార్యాలయంలోనే..

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గాకుండా తహసీల్దార్‌ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్‌ చేసే విధంగా ధరణి వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసిన తర్వాత మ్యూటేషన్‌ చేసి రెండు, మూడురోజుల్లో సంబంధిత రైతులకు పట్టాదారు పాసుపుస్తకాన్ని అందజేయనున్నారు. గతంలో భూమి హక్కు పుస్తకాలు కేవలం వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు ఒకే పాసు బుక్కును ఇచ్చేవాళ్లు. నూతన చట్టం ప్రకారం వ్యవసాయ భూములకు ఆకుపచ్చ రంగులోగల పాసుపుస్తకాలు, వ్యవసాయేతర భూములకు ముదురు ఎరుపురంగు పాసుపుస్తకాలను అందజేయనున్నారు. ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టంలో ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా శుక్రవారం శాసనసభ యథాతథంగా ఆమోదించింది.


గతంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన తర్వాత ముందుగా రిజిష్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి చలానా కట్టి రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వాళ్లు. రెండు, మూడురోజుల తర్వాత చేతికి వచ్చిన డాక్యుమెంట్‌ను రెవెన్యూ కార్యాలయానికి తీసుకవెళ్లి మ్యూటేషన్‌ చేయించుకునే వాళ్లు. ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ భూమిపై ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని సంబంధిత గ్రామపంచాయతీలో నోటీసులు అంటించేవాళ్లు. మొదట ఇది 40 రోజులు, ఆ తర్వాత 15 రోజులకు, 7 రోజులకు కుదించారు. ఎలాంటి అభ్యంతరాలు రాకుంటే మ్యూటేషన్‌ చేసి 1బీ రికార్డు, పహాణి పుస్తకంలో నమోదు చేసి కొద్దిరోజుల తర్వాత పట్టాదారు పాసుపుస్తకాన్ని జారీ చేసేవాళ్లు. ఈ తంతు ముగిసేవరకు కనీసం ఏడాది సమయమైనా పట్టేది. ఈ క్రమంలోనే రెవెన్యూ అధికారులు చేతివాటాన్ని ప్రదర్శించేవాళ్లు. ఎవరు డబ్బులు ఇస్తే వారి పనులను త్వరితగతిన చేసేవాళ్లు. డబ్బులు ఇవ్వని వారి పనులకు కొర్రీలు విధించి తాత్సారం చేసేవాళ్లు. అలాగే కొన్ని నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలను అందజేసి ఇరువర్గాల మధ్య వివాదాలను సృష్టించారు. 


మ్యూటేషన్‌లో ఇబ్బందులకు చెక్‌..

మ్యూటేషన్‌ చేయడంలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు ముడుపులు తీసుకుంటుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వీటిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం 2015లో భూప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. పాత పట్టాదారు పాసుపుస్తకాలను, టైటిల్‌ డీడ్‌ పుస్తకాలను రద్దు చేసి ట్యాంపరింగ్‌ చేయకుండా ఉండేందుకు వీలుగా హైసెక్యూరిటీ గల పట్టాదారు పాసుపుస్తకాలను ప్రభుత్వం జారీ చేసింది. ఇదే తరుణంలో ధరణి వెబ్‌సైట్‌ను రూపొందించింది. మండల తహసీల్దార్‌ కార్యాలయంలోనే భూముల రిజిస్ట్రేషన్లు చేసేందుకు గాను ప్రభుత్వం ప్రయోగాత్మకంగా జిల్లాకు ఒక మండలాన్ని ఎంపిక చేసింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లాలో అంతర్గాం మండలాన్ని ఎంపిక చేసింది. 2018 మేనెల నుంచి ఈ కార్యాలయంలోనే వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, భవనాలు,. ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను చేయడం ఆరంభించారు. 2018లో 218 డాక్యుమెంట్లు, 2019లో 428 డాక్యుమెంట్లు, ఈ ఏడాది ఇప్పటి వరకు 220 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. మ్యూటేషన్లు, పాసు పుస్తకాల జారీకి పాత విధానాన్నే అనుసరించారు. ఈ విధానం విజయవంతం కావడంతో నూతన రెవెన్యూ చట్టం ద్వారా అన్ని మండల తహసిల్దార్‌ కార్యాలయాల్లోనే భూముల రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించారు. అయితే వ్యవసాయ భూములను మాత్రమే ఇక్కడ రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. 


వ్యవసాయేతర భూములు, భవనాలు, ఇతర ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లోనే రిజిష్టర్‌ చేయనున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేయాలంటే ముందుగా నాలా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందులో ఏమైనా ప్లాట్లు చేసినట్లయితే డీటీసీపీ అనుమతులు ఉండాలి. అలా ఉన్న వాటినే రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. భూముల లిటిగేషన్లు లేకుండా ఉండేందుకే ఈ విధానాన్ని ప్రభుత్వం తీసుకవచ్చింది. దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలోనే విడుదల కానున్నాయి. వీఆర్‌ఓల పోస్టులను రద్దు చేయడంతో జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో సంబరాలు నిర్వహించారు. వీఆర్‌ఓలను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయనున్నారు. నూతన రెవెన్యూ చట్టంలో పొందుపర్చిన విధానాలు రైతులకు ఏ మేరకు ఉపయోగపడతాయో వేచిచూడాల్సిందే. 

Updated Date - 2020-09-12T11:02:00+05:30 IST