ప్రమాద ఘంటికలు

ABN , First Publish Date - 2020-07-05T10:34:58+05:30 IST

కరోనా వ్యాధి కరీంనగర్‌ జిల్లాలో ప్రమాదఘంటికలు మోగిస్తున్నది. రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నది

ప్రమాద ఘంటికలు

జిల్లాలో కొత్తగా 16 మందికి కరోనా పాజిటివ్‌ 

కరీంనగర్‌లో 10 కేసులు 

వివిధ మండలాల్లో ఆరు కేసుల నమోదు 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరోనా వ్యాధి కరీంనగర్‌ జిల్లాలో ప్రమాదఘంటికలు మోగిస్తున్నది. రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నది. ఒకే రోజు 16 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో జిల్లాలో ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని చూపిస్తున్నది. శనివారం నాటి 16 కేసులతో కలుపుకొని జిల్లాలో 145 మంది ఈ వ్యాధిబారిన పడ్డారు. వీరిలో 10 మంది ఇండోనేషియన్లు కాగా 135 మంది జిల్లాకు చెందిన వారు ఉన్నారు. మార్చి 17న జిల్లాలో కరోనా తొలికేసు నమోదు కాగా నాలుగు విడతల లాక్‌డౌన్‌ ముగిసే సరికి 23 కేసులు నమోదయ్యాయి. మార్చి 17 నుంచి మే 31వ తేదీ వరకు 73 రోజుల్లో 23 మంది వ్యాధిబారిన పడగా లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత జూన్‌ 1 నుంచి 4వ తేదీ వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. 5వ తేదీ నుంచి మొదలైన కేసుల నమోదు పరంపర నెలరోజులుగా కొనసాగగుతూనే వస్తున్నది. ఈ నెల రోజుల్లో 122 మందికి కరోనా వ్యాధి సోకగా అందులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.


శనివారం కరీంనగర్‌లోని పద్మశాలీవీధి, గణేశ్‌నగర్‌, లక్ష్మినగర్‌, సరస్వతీనగర్‌, కట్టరాంపూర్‌, శ్రీనగర్‌కాలనీ, హౌసింగ్‌బోర్డుకాలనీ ప్రాంతాల్లో 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని హుజూరాబాద్‌, జమ్మికుంట మండలంలోని వావిలాల, చొప్పదండి మండలం కేంద్రం, అదే మండలంలోని ఆర్నకొండ, రామడుగు మండలంలోని గుండి, కొత్తపల్లి మున్సిపాలిటీలో ఒక్కొక్క కేసు నమోదు అయ్యాయి. కరోనా వ్యాధి ప్రారంభమైన నాటి నుంచి ఒకే రోజు 16 కేసులు నమోదు కావడంతో ఇదే ప్రథమం. దీంతో జిల్లా ప్రజల్లో తీవ్రభయాందోళనలు రేకెత్తుతున్నాయి. 


కందుగులలో..

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ మండలం కందుగుల గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి శనివారం రాత్రి కరోనా పాజిటివ్‌ వచ్చింది. సదరు వ్యక్తి హైద్రాబాద్‌లోని బోరబండలో నివాసముంటున్నాడు. మూడు రోజుల క్రితం కందుగులకు వచ్చాడు జ్వరం, జలుబు తీవ్రం కావడంతో ఆస్పత్రికి వెళ్లగా పరీక్షించిన వైద్యులు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారించారు.


వావిలాలలో.. 

జమ్మికుంట రూరల్‌: జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన ఓ యువకుడికి శనివారం కరోనా పాజిటివ్‌ వచ్చింది. సదరు యువకుడు హెల్త్‌ ఇన్స్‌రెన్స్‌ కంపెనీలో ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. కొద్ది రోజులుగా దగ్గు వస్తుండటంతో వైద్యులను సంప్రదించాడు. దగ్గు మందులు ఇచ్చిన తగ్గకపోవడంతో వైద్య పరీక్షల నిమిత్తం కరీంనగర్‌ ఆసుపత్రికి పంపించారు. కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. 


ఆరోగ్య కార్యక్రమాల అమలుపై వీడియో కాన్ఫరెన్సు

సుభాష్‌నగర్‌: జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరుపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ యోగితారాణా అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, ప్రోగ్రాం అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జి సుజాత మాట్లాడుతూ శనివారం జిల్లావ్యాప్తంగా మొత్తం 21వైద్యబృందాలు 1,066 ఇళ్లను సందర్శించి 4,075 మందికి స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.


మానకొండూర్‌లో 1,757 మందికి, హుజూరాబాద్‌లో 507మందికి, వావిలాలలోని ధర్మారంలో 403 మందికి స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించి ఐఎల్‌ఐ లక్షణాలు ఉన్న ఒకరిని గుర్తించినట్లు తెలిపారు. కరీంనగర్‌లో పద్మశాలి వీధి, కట్టరాంపూర్‌లో 519మందికి, కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మందులపల్లిలో 889మందికి స్ర్కీనింగ్‌ నిర్వహించామని చెప్పారు.

Updated Date - 2020-07-05T10:34:58+05:30 IST