పదిలో వంద శాతం ఉత్తీర్ణత

ABN , First Publish Date - 2020-06-23T10:20:30+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గ్రేడ్లను విడుదల చేసింది.

పదిలో  వంద శాతం ఉత్తీర్ణత

3,523 మంది విద్యార్థులకు 10 జీపీఏ

హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు


పెద్దపల్లి కల్చరల్‌, జూన్‌ 22: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గ్రేడ్లను విడుదల చేసింది. ఆ మేరకు పెద్దపల్లి జిల్లాలో పరీక్షలు రాసిన అందరు విద్యార్థులు వందకు వంద శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 3,523 మంది విద్యార్థులు రికార్డు స్థాయిలో 10 జీపీఏ గ్రేడ్లు సాధించడం విశేషం. సంవత్సరం కాలంలో పదవ తరగతి విద్యార్థులకు నాలుగు దఫాలుగా నిర్వహించిన ఫార్మెటీవ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షల ఆధారంగా విద్యార్థులకు మార్కులు వేశారు. ఫార్మెటీవ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలను 20 మార్కులకు నిర్వహించారు.


ఈ మార్కులను 100 మార్కులకు లెక్కించి ఫలితాలను వెల్లడించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఈ ఫలితాలను విడుదల చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలో పదవ తరగతి చదివిన 9,207 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాసేందుకు గాను ఫీజులు చెల్లించగా, 9,204 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అనివార్య కారణాల వల్ల ముగ్గురు విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదు. పరీక్షలను మార్చి 18 నుంచి నిర్వహించారు. తెలుగు పేపర్‌-1, పేపర్‌-2, హిందీ పరీక్షలు పూర్తయిన తర్వాత కరోనా వైరస్‌ విజృంభించడంతో దానిని కట్టడి చేసేందుకు రాష్ట్రంలో 23వ తేదీ నుంచి లాక్‌ డౌన్‌ విధించారు. దీంతో పది పరీక్షలు వాయిదా పడ్డాయి. దాదాపు రెండు మాసాలకు పైగా లాక్‌ డౌన్‌ కొనసాగింది. ఈ తరుణంలో పరీక్షలు నిర్వహించాలా, వద్దా అనే డైలామా నెలకొన్నది. పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థుల భద్రత ఎట్లా అని కొందరు హైకోర్టును ఆశ్రయించారు.


భౌతిక దూరం పాటించే విధంగా మిగతా పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమయ్యింది. మొదట 45 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా. కరోనా నేపథ్యంలో కేంద్రాలను 77కు పెంచారు. ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత మరోసారి కోర్టు జోక్యం చేసుకోవడంతో పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం రెండు రోజులకే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షల ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తామని విద్యా శాఖ ప్రకటించింది. ఆ మేరకు ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలకు హాజరైన 9,207 మంది విద్యార్థులు వందకు వంద శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 4650 మంది, బాలికలు 4554 మంది ఉత్తీర్ణులయ్యారు. 3523 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించగా, ఇందులో బాలురు 1414 మంది. బాలికలు 2109 మంది ఉన్నారు. 875 మందికి 9.8 జీపీఏ, 658 మందికి 9.7 జీపీఏ, 533 మందికి 9.5 జీపీఏ, 437 మందికి 9.3 జీపీఏ, 416 మందికి 9.2 జీపీఏ, 385 మందికి 9 జీపీఏ వచ్చింది. మిగతా వారికి 9 కంటే తక్కువ గ్రేడ్లు వచ్చాయి.


జిల్లాలోని అన్ని పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్తీర్ణులు కావడంతో ఎవరు కూడా సప్లమెంటరీ పరీక్షలను రాయాల్సిన అవసరం లేకుండా పోయింది. మెమోలు త్వరలోనే జిల్లాకు చేరనున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. ఫలితాల్లో ఎక్కడైనా తప్పులు దొర్లినట్లయితే తమ దృష్టికి తీసుక రావాలని ఆయన తెలిపారు. పరీక్షలు లేకుండానే ఫలితాలను విడుదల చేయడంతో తొలిసారిగా జిల్లాలో గల అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఫలితాలు రావడం విశేషం. రికార్డు స్థాయిలో అనేక మంది విద్యార్థులకు 10 జీపీఏ రావడం విశేషం. భవిష్యత్తులో ఈ రికార్డును బ్రేక్‌ చేసే అవకాశాలు ఉండక పోవచ్చు. కరోనా లాంటి విపత్తులు వచ్చి పరీక్షలు నిర్వహించకుండా ఫలితాలు వెల్లడిస్తే తప్ప రికార్డును తిరగ రాయలేమని ఉపాధ్యాయులు అంటున్నారు. విద్యార్థులు అందరు ఉత్తీర్ణులు కావడంతో విద్యార్థుల తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


Read more