ఇళ్లలోనే కార్ఖానాలు

ABN , First Publish Date - 2020-03-19T09:50:16+05:30 IST

కరోనాపై మూడు నెలలుగా ప్రజల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ప్రభుత్వం, ఆరోగ్య సంస్థలు ప్రచారం చేస్తున్నాయి.

ఇళ్లలోనే కార్ఖానాలు

నకిలీ శానిటైజర్ల తయారీ

పెద్ద కంపెనీల్లోనూ అనుమతి లేకుండా...

డిమాండ్‌ పెరగడంతో అక్రమ సంపాదన కోసం వ్యాపారుల అడ్డదారులు


హైదరాబాద్‌ సిటీ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): కరోనాపై మూడు నెలలుగా ప్రజల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ప్రభుత్వం, ఆరోగ్య సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. మీడియా, స్వచ్ఛంద సంస్థలు, సోషల్‌ మీడియాలో అవగాహనపై ప్రచారం జరుగుతోంది. మాస్కులు ధరించడం, కరచాలనాలకు స్వస్తి పలకడం, దగ్గు, తుమ్ము రాగానే వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అలాంటి లక్షణాలతో బాధపడుతున్న వారు కనిపించగానే సమాచారం ఇవ్వాలని, శాటిటైజర్లు, సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ నేపథ్యంలో శానిటైజర్లకు డిమాండ్‌ పెరగడంతో నకిలీవి తయారు చేస్తూ అక్రమార్కులు దందా ప్రారంభించారు.  


కొరతతో...

చిన్న మెడికల్‌ స్టోర్‌ నుంచి పెద్ద పెద్ద సూపర్‌ మార్కెట్లలో శానిటైజర్లు విపరీతంగా అమ్ముడయ్యాయి. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఆయా కంపెనీలు త్వరితగతిన శానిటైజర్లు సరఫరా చేయకపోవడంతో షార్టేజ్‌ ఏర్పడింది. మార్కెట్‌లో శానిటైజర్లు లభించడం లేదని గుర్తించిన నకిలీగాళ్లు రెచ్చిపోయారు. నకిలీ శానిటైజర్‌ తయారు చేసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. చిరు వ్యాపారులు ఇళ్లల్లో తయారు చేసుకోగా... పెద్ద వ్యాపారులు  తమ సంస్థల్లోనే సైడ్‌ బిజినెస్‌ ప్రారంభించేశారు. సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు అబ్దుల్లాపూర్‌మెట్‌తోపాటు కుషాయిగూడ పీఎస్‌ పరిధిలో దాడులు నిర్వహించి నకిలీ శానిటైజర్‌ కేంద్రాలను గుర్తించి సీజ్‌ చేశారు. ఇళ్లలోనే తయారుచేసి చిన్న బాటిళ్లలో నింపి ఎక్కువ ధరకు విక్రయిస్తున్న వారికీ కొదవ లేదు. 


కుటీర పరిశ్రమగా...

కొంతమంది ఒకడుగు ముందుకేసి శానిటైజర్ల తయారీని కుటీర పరిశ్రమగా మార్చుకున్నారు. రసాయన మిశ్రమాలతో కూడిన శానిటైజర్లను ఇళ్లల్లో తయారు చేసి విక్రయించడం ప్రమాదకరమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. తక్కువ ధరకు తయారు చేసి చిన్న బాటిళ్లలో నింపి ఎక్కువ ధర వేసి స్టిక్కర్లను బాటిళ్లపై అతికిస్తున్నారు. 


లాభం వస్తుందని భావిస్తున్న షాపుల యజమానులు బ్రాండ్‌, కంపెనీ అని చూడకుండా విక్రయిస్తున్నారు. శానిటైజర్‌ దొరికింది కదా అని వినియోగదారులు కొనుక్కొని వెళ్లిపోతున్నారు. వాస్తవానికి వారు కొన్నది నాణ్యమైన శానిటైజరేనా అనేది పరిశీలించడం లేదు. నకిలీలపై పోలీసులు నిఘా పెడితే నాణ్యమైన శానిటైజర్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 


Updated Date - 2020-03-19T09:50:16+05:30 IST