రాచకొండలో మహిళా వారోత్సవాలు

ABN , First Publish Date - 2020-03-04T08:16:26+05:30 IST

ఈనెల 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాచకొండ పోలీసులు, సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాలను నిర్వహిస్తున్నారు.

రాచకొండలో మహిళా వారోత్సవాలు

ఈనెల 7వ తేదీ వరకు

వివరాలు వెల్లడించిన సీపీ మహేష్‌ భగవత్‌


హైదరాబాద్‌ సిటీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఈనెల 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాచకొండ పోలీసులు, సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈనెల 2 నుంచి 7వ తేదీ వరకు మహిళా భద్రత, సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ, సమానత్వం వంటి అంశాలపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.  


సేఫ్‌ స్టే

రాచకొండ పరిధిలోని అన్ని మహిళా హాస్టళ్లు, పీజీ అకామిడేషన్లలో మహిళల సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీపై ప్రాజెక్టు సేఫ్‌ స్టే కార్యక్రమాన్ని ఈనెల 2వ తేదీన నిర్వహించారు. ఇందులో భాగంగా కమిషనరేట్‌ పరిఽధిలోగల 180  మహిళా హాస్టళ్లను మహిళా పోలీసు అఽధికారుల ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వాహకులతో సమావేశం నిర్వహించి నిబంధనల ప్రకారం హాస్టళ్లు నిర్వహిస్తున్నారా..? అనే అంశాలపై ఆరా తీశారు. జీహెచ్‌ఎంసీ ఎల్‌బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌ రెడ్డి మౌలిక వసతులు, హాస్టల్స్‌ రిజిస్ట్రేషన్స్‌, కమర్షియల్‌ రిజిస్ట్రేషన్‌, ఫుడ్‌ సేఫ్టీ, శానిటేషన్‌ సర్టిఫికేషన్‌, ఫైర్‌ సేఫ్టీ నిబంధనలను పరిశీలించారు. మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి మహిళల సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీపై పలు సూచనలు చేశారు. 


షీ ఫర్‌ హర్‌

ఇంటర్‌ నుంచి ఇంజనీరింగ్‌ వరకు అన్ని మహిళా కళాశాలల్లో యువతులపై జరుగుతున్న లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్‌లను అరికట్టడానికి, షీ ఫర్‌ హర్‌ పేరుతో ప్రతి కళాశాలలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొంతమంది యువతులను ఎంపిక చేసి షీటీమ్స్‌కు, కళాశాల అమ్మాయిలకు మధ్య వారధిగా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు రాచకొండ పరిధిలోని అన్ని కళాశాలల్లో 600 మంది విద్యార్థినులను ఎంపిక చేసి ‘ఆమెకు ఆమె అండ’గా ఉండేలా చేశారు. 


గురునానక్‌ ఇంజనీరింగ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మంగళవారం షీ ఫర్‌ హర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మహేష్‌ భగవత్‌ మాట్లాడుతూ... మహిళలకు ఇబ్బందులు ఎదురైతే షీ ఫర్‌ హర్‌ టీమ్‌కు తెలియజేయాలని, డయల్‌-100, వాట్సాప్‌ నంబర్‌ 9490617111కు సమాచారం ఇవ్వాలని సూచించారు. 


సైబర్‌ సేఫ్టీపై అవగాహన

ఈనెల 4వ తేదీన సైబర్‌ సేఫ్టీపై అవగాహన కల్పించనున్నట్లు సీపీ తెలిపారు. మహిళలు, కళాశాల యువత ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియాలో అపరిచిత వ్యక్తుల బారినపడి లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అలాంటి వారిని అప్రమత్తం చేసి, సైబర్‌ నేరాల బారినపడకుండా అవగాహన కల్పించనున్నారు. ఈ మేరకు ఆదిభట్ల టీసీఎ్‌సలో సైబర్‌ సేఫ్టీపై కార్యక్రమం నిర్వహించనున్నారు.


సెల్ఫ్‌హెల్ప్‌ సభ్యులతో సమీక్ష

భువనగిరిలో సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపు మహిళా సంఘాలతో ఈనెల 5వ తేదీన సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మహిళా సాధికారత, సమానత్వంపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పాల్గొననున్నారు. 


ఐసీసీలు..

పని ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్‌ బారినపడకుండా ఐటీ కంపెనీలు, ఇతర పని ప్రదేశాల్లో ఐసీసీ (ఇంటర్నల్‌ కంప్లైంట్‌ కమిటీ)లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు నాచారంలోని ఐఐసీటీ కంపెనీలో ఈనెల 6న సమావేశం నిర్వహించనున్నట్లు సీపీ తెలిపారు. ముఖ్యఅతిథిగా ఉమెన్‌ సేఫ్టీ ఐజీ స్వాతిలక్రా పాల్గొననున్నారు. 


సరూర్‌నగర్‌ స్టేడియంలో ముగింపు కార్యక్రమం

మహిళా వారోత్సవాల ముగింపు సందర్భగా ఈనెల 7వ తేదీన సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో మెగా కార్యక్రమం నిర్వహించనున్నారు. సుమారు మూడువేలమంది విద్యార్థినీ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, మహిళా ప్రతినిధులు హాజరవుతారని, హోంమంత్రి మహమూద్‌ అలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొంటారని సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు.

Updated Date - 2020-03-04T08:16:26+05:30 IST