పెళ్లయిన నాలుగురోజులకే నవవధువు ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-12-11T07:05:30+05:30 IST

వివాహం జరిగిన నాలుగు రోజులకే ఓ నవవధువు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది.

పెళ్లయిన నాలుగురోజులకే నవవధువు ఆత్మహత్యాయత్నం
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సౌజన్య

  • భర్తతో వివాదమే కారణమని..
  • కుటుంబ సభ్యుల ఫిర్యాదు

హైదరాబాద్ : వివాహం జరిగిన నాలుగు రోజులకే ఓ నవవధువు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. శోభనం రాత్రి జరిగిన గొడవ వల్లే ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు జగద్గిరిగుట్ట పోలీ‌సులకు ఫిర్యాదు చేశారు.  తూర్పుగోదావరి జిల్లా, కట్రేనకోనా మండలం, బొట్టుచెరువు గ్రామానికి చెందిన సాక స్వామి కుటుంబం బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి జగద్గిరిగుట్ట ప్రాంతంలోని ప్రగతినగర్‌ ఎస్‌వీఆర్‌ హైస్కూల్‌ సమీపంలో నివాసముంటున్నారు. మేస్ర్తీపని చేసే స్వామికి ఇద్దరు సంతానం. పెద్ద కుమార్తె సౌజన్య(24)ను ఈనెల 6నవెంకటేశ్వరరావుకు ఇచ్చి వారి స్వగ్రామంలో వివాహం జరిపించారు. 9వ తేదీ రాత్రి వారికి శోభనం ఏర్పాటు చేశారు.


10వ తేదీన అల్లుడు వెంకటేశ్వరరావు ఉదయాన్నే బయటకు వచ్చి ‘మీ అమ్మాయి సౌజన్య రాత్రి నామాట వినలేదు. ఈ విషయం పెద్దలతో చర్చిద్దాం’ అని అత్తతో చెప్పాడు. కుటుంబ సభ్యులంతా గురువారం హాల్‌లో ఉండగా సౌజన్య ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య యత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు సౌజన్యను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. జగద్గిరిగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-11T07:05:30+05:30 IST