వింగ్స్ షో...
ABN , First Publish Date - 2020-03-13T09:35:36+05:30 IST
పౌర విమానయాన శాఖ, ఫిక్కీ తదితర సంస్థలు కలిసి నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా షో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ప్రారంభమైంది.

ప్రత్యేక ఆకర్షణగా సారంగ్, గ్లోబల్‌స్టార్స్ అక్రోబాట్ షోస్
సామాన్యులకు నో ఎంట్రీ
తగ్గిన సందర్శకులు
30ుకు పైగా స్టాల్స్ ఖాళీ
ప్రదర్శనకు వచ్చిన విమానాలూ తక్కువే !
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సారంగ్, గ్లోబల్‌స్టార్స్ అక్రోబాట్ షోస్
పౌర విమానయాన శాఖ, ఫిక్కీ తదితర సంస్థలు కలిసి నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా షో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ప్రారంభమైంది. కొవిడ్ -19 భయాలతో అసలు షో జరుగుతుందా లేదా అనే సందేహాల నడుమ ప్రారంభమైన ఈ షోపై ఆ వైరస్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ప్రదర్శన ప్రాంగణంలో చాలా వరకూ స్టాల్స్ ఖాళీగా కనిపిస్తే.. విదేశీ పర్యాటకుల సందడి నామమాత్రమనే చెప్పాలి.
మెరుపులు లేవు..
వింగ్స్ ఫర్ ఆల్ .. ఈ సంవత్సర షో నేపథ్యం. భారత పౌర విమానయాన శాఖ దాదాపు 290 బిలియన్ డాలర్లను ఖర్చుచేసి 2వేల ఎయిర్‌క్రాఫ్ట్‌లను 2040 నాటికి ఆకాశంలో తిప్పాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలను విమానయాన రంగం అభివృద్ధికి పెట్టుబడిగా పెట్టాలని కూడా నిర్ధేశించుకుంది. ఇంత భారీ లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఏవియేషన్ షోలో ఎంబ్రారర్ సంస్థ తమ ఈ2 ప్రాఫిట్ హంటర్‌ను తొలిసారిగా ఇండియాలో అందునా హైదరాబాద్‌లో ప్రదర్శించడం తప్పితే చెప్పుకోతగ్గ విమానాలేవీ లేవు.
వ్యాపార కార్యకలాపాల కోసం హోండా వారి చార్టర్డ్ ఫ్లయిట్‌తో పాటుగా శిక్షణలోని విద్యార్థుల కోసం మరికొన్ని విమానాలు కొలువుదీరాయి. గతంలో ఈ ఏవియేషన్ షోలలో వరుసగా కొలువుదీరే విమానాలేవీ ఈ సారి పెద్దగా కనిపించలేదు. 150కి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొనడానికి ఆసక్తి చూపారని నిర్వాహకులు చెప్పారు కానీ దాదాపు 30ు స్టాల్స్ ఖాళీగానే కనిపించాయి. ఇదే విషయమై ఎగ్జిబిటర్లలో ఒకరు మాట్లాడుతూ ‘కొవిడ్ -19 ప్రభావం ఈసారి బాగా కనిపించింది. కరోనా కారణంగా మేం కూడా వద్దామా లేదా అని సంశయించాం కానీ చివరి నిమిషంలో వచ్చాం. వర్కవుట్ అయ్యే సూచనలేవీ కనిపించడం లేదు’ అన్నారు.
సందర్శకులకు అనుమతి లేదు..
తొలి రెండు రోజులూ వ్యాపార సందర్శకులకు 2500 రూపాయల టికెట్‌తో అనుమతిస్తున్నామన్నారు కానీ కొవిడ్ భయాలతో అనుమతి నిలిపి వేశారు. ఆన్‌లైన్‌లో టికెట్లను కొనుగోలు చేసిన వారికి సైతం రీఫండ్ ఇస్తామని ట్విటర్ వేదికగా బుధవారం రాత్రి అధికారికంగా వెల్లడించారు నిర్వాహకులు. ఆహ్వానితులకు తప్ప మిగిలిన వారికి అనుమతి లేకపోవడంపై పలు స్టాల్స్ నిర్వాహకులు, ఏవియేషన్ ప్రియులు అసహనం వ్యక్తం చేశారు. వింగ్స్ ఫర్ ఆల్ అని కొంతమందికి మాత్రమే ప్రవేశం కల్పించడం ఎంత మేరకు సమంజసమని తొలి రోజు ఈ ప్రదర్శనకు వచ్చిన కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా అక్రోబాట్ షోస్..!
గతంలోలాగానే ఈ సారి కూడా అక్రోబాట్ షోస్ సాధారణ సందర్శకులతో పాటుగా వ్యాపార సందర్శకులకు కూడా ఊరట కలిగించే రీతిలో ఉన్నాయి. మార్క్ జెఫ్రీ బృందం బుల్లి విమానాలతో విన్యాసాలు చేస్తే సారంగ్ బృందం హెలికాఫ్టర్లతో ఆకాశంలో విన్యాసాలు చేసి అబ్బురపరిచింది.
- హైదరాబాద్ సిటీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి)