‘జవహర్‌నగర్ డంప్ యార్డు’పై పూర్తి వివరాలు ఎందుకివ్వడం లేదు?
ABN , First Publish Date - 2020-03-08T11:03:12+05:30 IST
హైదరాబాద్ నగర శివారులో ఉన్న జవహర్‌నగర్ డంప్‌యార్డు వ్యవహారంలో పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని ఆదేశించినా

- జీహెచ్‌ఎంసీ కమిషనర్ తీరుపై హైకోర్టు అసంతృప్తి
- తదుపరి విచారణ ఈనెల 31కి వాయిదా
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగర శివారులో ఉన్న జవహర్‌నగర్ డంప్‌యార్డు వ్యవహారంలో పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని ఆదేశించినా ఎందుకు ఇవ్వడంలేదని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను హైకోర్టు నిలదీసింది. దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని ఆక్షేపించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం కమిషనర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ 24/7 పనిచేస్తున్నదని, ఆ సంస్థ ఇచ్చిన నివేదికల ఆధారంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారని.. అయితే ఆ సంస్థ ఇచ్చిన నివేదికల్లోనూ పూర్తి వివరాలు లేవని, ఉన్నవి అర్థకావడం లేదని ధర్మాసనం పేర్కొంది.
3 ప్రాంతాలను గుర్తించినా స్పష్టత లేదు
‘జవహర్‌నగర్ డంప్‌యార్డుకు ప్రత్యామ్నాయంగా గుమ్మడిదల మండలం ప్యారానగర్‌లో 152 ఎకరాలను గుర్తించామని, అయితే అప్రోచ్ రోడ్డు నిర్మించాల్సి ఉందని, ఇందుకోసం 2.12 ఎకరాల భూమి కేటాయించాలని 2019 సెప్టెంబర్‌లో అటవీశాఖ అధికారులకు లేఖ రాసినట్లు తెలిపారు. లేఖ రాసి 6 నెలలు గడుస్తున్నా ఎప్పటిలోగా అటవీశాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకుని రోడ్డు నిర్మిస్తారో స్పష్టత లేదు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్ వద్ద 42.22 ఎకరాలు ఉందని చెప్పారు.. కానీ జీహెచ్‌ఎంసీకి స్వాధీనపర్చలేదని పేర్కొన్నారు. ఆ భూమి స్వాధీనపర్చడానికి ఇంకెంత కాలం పడుతుందో స్పష్టత లేదు. అదేవిధంగా పటాన్‌చెరు మండలం లక్డారం వద్ద సర్వే నెం.747లో 150 ఎకరాలు కేటాయించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరగా.. ఆ భూమి రాజీవ్ గృహకల్పకు కేటాయించరాని బదులిచ్చినట్లు చెప్పారు. కొత్తగా ఆ మేర భూమి గుర్తించడానికి ఎంత కాలం పడుతుందో ఎందుకు చెప్పలేదు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రత్యామ్నాయంగా 3 ప్రాంతాలు గుర్తించామని చెప్పడంవల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, అలాంటి ప్రయత్నం అర్థంలేనిదిగా కొట్టిపారేసింది.
సలహా మండలి ఉన్నా.. సమావేశాలు ఏవి?
2017 జూలైలో రాష్ట్రస్థాయి సలహా మండలి ఏర్పాటు చేయగా.. అది చివరిసారిగా 2018 మార్చిలో సమావేశం అయ్యిందని, ఆ తర్వాత 2 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్కసారికూడా సమావేశం కాలేదని, ఇది నిజంగా క్షమించరానిదని వ్యాఖ్యానించింది. ఘనవ్యర్థాల నిర్వహణకు రూపొందించిన నిబంధనలు అసంబద్ధంగా ఉన్నాయని ఎత్తిచూపింది. ‘జీహెచ్‌ఎంసీ పరిధిలో చెత్త ఏరేవారిని గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇచ్చామని చెప్పారు. ఎంత మందిని గుర్తించారు? వారికున్న సామర్థ్యం ఎంత? వారికి 2,500 స్వచ్ఛ ఆటో టిప్పర్లు అందజేసినట్లు తెలిపారు. ఎంతమంది వాటిని చెత్త తరలించడానికి వినియోగిస్తున్నారు? ఏయే ప్రాంతాల్లో తిప్పుతున్నారో చెప్పలేదు. చెత్త ఏరుకునే వారిని సంఘటితపర్చి వారి జీవనశైలి మెరుగుపడేలా ప్రతిపాదనలు రూపొందించామని చెబుతున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్.. వాటిని ఎవరికి పంపారు? అసంఘటితంగా ఉన్న వారిని సంఘటిత రంగంలోకి తేడానికి ఎంతకాలం పడుతుందో ఎక్కడా వివరించలేదు. కమిషనర్ ఇచ్చిన నివేదికలో ఏ పేజీలో చూసినా పొంతనలేని వివరణలే ఉన్నాయి’ అని ధర్మాసనం ఆక్షేపించింది. సమగ్ర వివరాలతో మార్చి 29 లోగా మరో నివేదిక ఇవ్వాలన్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్న చెత్తవల్ల సైనిక్‌పురి, కాప్రా, యాప్రాల్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తుండటంతో స్థానికులు అవస్థలు పడుతున్నారంటూ ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని జతచేస్తూ.. జె.జె. కాలనీ, సాకేత్ ఫేజ్-1లో నివాసం ఉంటున్న కల్నల్ సీతారామరాజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే.