మోండా మార్కెట్‌లో హోల్‌సేల్ ధరలు నిర్ణయించండి
ABN , First Publish Date - 2020-03-27T08:41:30+05:30 IST
మోండా మార్కెట్‌లో హోల్‌సేల్ ధరలు నిర్ణయించాలని, అక్కడ నిర్ణయించకుండా మాపై కేసులు ఎలా పెడతారని కూరగాయల వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అక్కడ నిర్ణయించకుండా మాపై కేసులా
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కూరగాయల వ్యాపారులు
నార్సింగ్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మోండా మార్కెట్‌లో హోల్‌సేల్ ధరలు నిర్ణయించాలని, అక్కడ నిర్ణయించకుండా మాపై కేసులు ఎలా పెడతారని కూరగాయల వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పలు దుకాణాల్లో కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రభుత్వం చలానాలు విధించడంతో పాటు పోలీసుకేసులు నమోదు చేస్తోంది. నగర శివారుల్లోని మణికొండ మున్సిపాలిటీలో గురువారం కొంతమందికి చలానాలు విధించడంతోపాటు ఓ సూపర్ మార్కెట్‌పై కేసు కూడా నమోదు చేసింది. ప్రభుత్వం సూచించిన ధరలకు కాకుండా అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారని, ఇది చట్టరీత్యా నేరమని వారు చలానాలు విధించారు. అయితే పలానా కూరగాయలు పలానా రేటుకు అమ్మమని తమకు ముందస్తుగా ఎవరూ సమాచారం ఇవ్వలేదని, నోటీసులు ఇవ్వలేదని, కనీసం మోండా మార్కెట్‌లో కూరగాయలు కొనేటప్పుడు అక్కడ కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఈ ప్రాంతంలోని సూపర్‌మార్కెట్‌లు, కూరగాయల వ్యాపారులు వాపోతున్నారు.
‘మోండా మార్కెంట్‌లో కిలో రూ.50 అమ్మితే మేము ఇక్కడ రూ.30కి ఎలా అమ్ముతాం. తెచ్చిన వాటిలో ట్రాన్స్‌పోర్టు, డామేజీ 20 శాతం ఉంటుంది’అని ఆరోపించారు. ఇక ఉద్యోగులకు కూడా డబుల్ పేమెంట్‌పెట్టి విక్రయాలుసాగిస్తూ క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజలకు సాయంగా ఉంటే తమపై కేసులు నమోదు చేయడం, చలానాలు విధించడం ఎంత వరకు సమంజసమన్నారు. తాము కిలో ఇంత అమ్మాలని చెబుతున్న ప్రభుత్వం హోల్‌సేల్‌మార్కెట్‌లో ఎంతకు అమ్మాలో ముందస్తుగా చెప్పాలన్నారు. హోల్‌సేల్ వ్యాపారులు కారణంగా అటు రైతు, ఇటు వినియోగదారుడు ఎవరూ బాగుపడడం లేదని వారు వాపోయారు. ఈ డిమాండ్‌తో కూడిన విజ్ఞప్తి పత్రాన్ని పలువురు వ్యాపారులు ప్రభుత్వానికి అందించారు.