మంచోడెవరు.. ముంచేదెవరు?.. కోవర్టులపై పార్టీల్లో అంతర్గత మథనం
ABN , First Publish Date - 2020-11-27T21:01:25+05:30 IST
మనవాళ్లెవరు? కోవర్టులెవరు? మంచోడెవరు.. ముంచేదెవరు? ఎవరిని నమ్మేది? గ్రేటర్ ఎన్నికల ముంగిట, అన్ని పార్టీలను ఈ ప్రశ్న లు వేధిస్తున్నాయి. అందుకే.. ముఖ్యనేతలు ఈ అంశంపై తరచుగా భేటీ అయి చర్చలు సాగిస్తున్నారు. కీలక కార్యకర్తలను వెంటబెట్టుకునే ఉంటున్నారు.

నేతల్లో జోరుగా చర్చలు, భేటీలు
నార్సింగ్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): మనవాళ్లెవరు? కోవర్టులెవరు? మంచోడెవరు.. ముంచేదెవరు? ఎవరిని నమ్మేది? గ్రేటర్ ఎన్నికల ముంగిట, అన్ని పార్టీలను ఈ ప్రశ్న లు వేధిస్తున్నాయి. అందుకే.. ముఖ్యనేతలు ఈ అంశంపై తరచుగా భేటీ అయి చర్చలు సాగిస్తున్నారు. కీలక కార్యకర్తలను వెంటబెట్టుకునే ఉంటున్నారు. పోలింగ్‌కు ఇక రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో తమ దెబ్బకొట్టే వారెవరో గుర్తించే పనిలో పార్టీలు పడ్డాయి. అధికారంలో ఉన్న టీఆర్‌ఎ్‌సను ఢీకొట్టాలంటే బలంగా ఉండాలని, వెళ్లాలనుకునేవారు ముందుగానే వెళ్లిపోవచ్చని విపక్షాలకు చెందిన నేతలు తమ దిగువస్థాయి నాయకులకు చెబుతున్నారు. అవసరమైతే, మళ్లీ కొత్తవారిని తయారుచేసుకుంటామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. టీఆర్‌ఎస్ సైతం, ఇతర పార్టీల నేతలకోసం తలుపులు తెరిచే ఉంచినట్లు సమాచారం.
ఎన్నికలు ముగిసిన తర్వాత పలు పార్టీల కార్పొరేటర్లు గులాబీ గూటికి చేరే అవకాశం లేకపోలేదని పరిశీలకుల అంచనా. ఇప్పటికైతే మాత్రం.. ఎవరు డబుల్ గేమ్ ఆడుతున్నారో, ఎవరు కోవర్టులో నేతలు గుర్తించలేకపోతున్నారు. అభ్యర్థుల గత చరిత్ర ఆధారంగా ఒక అంచనాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండి తమ పార్టీలో కొనసాగుతున్న వారి జాబితాను కూడా కొన్ని పార్టీలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రతిసారీ ఎన్నికల అనంతరం ‘ఆకర్ష్’కు నష్టపోతున్న పార్టీలు, ఈసారి పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తున్నాయ ని అంటున్నారు. అయితే.. విపక్షాలకే కాక, అధికార టీఆర్‌ఎ్‌సలోనూ ఈ సమస్య ఉండటం గమనార్హం. మీతోనే ఉన్నామంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సొంతపనులు చేయించుకుంటున్న టీఆర్‌ఎస్ నాయకులు కొంతమంది కలిసి ఓ గ్రూపుగా ఏర్పడినట్లు సమాచారం. మరికొంతమంది నేతలు విపక్షాల్లోని బడా నాయకులతో చనువుగా ఉండటం, గులాబీ అధినాయకత్వంలో గుబులు రేపుతోంది. తమది ఆ వర్గం.. తమది ఈ వర్గమంటూ కొందరు.. ఇలా వివిధ వర్గాలు టీఆర్‌ఎ్‌సలో ఉండటంతో, ఎవరిని నమ్మాలో తెలియని అనిశ్చిత స్థితి నెలకొందని పార్టీ నేతలు అంటున్నారు. పార్టీ అధిష్ఠానం సైతం ఈ విషయంలో ఆలోచనలో పడిందని తెలుస్తోంది.