దాతల సాయం సొంత ఖాతాలోకి.. స్వచ్ఛంద సంస్థపై కేసు నమోదు
ABN , First Publish Date - 2020-07-27T15:46:57+05:30 IST
దాతృత్వాన్ని దోచేస్తున్నారు. ఓ బాధితురాలికి సాయం చేయండంటూ ఆమె ధీనస్థితిని వీడియోలు తీసి సోషల్‌మీడియాలో పెట్టారు. దయగల వారు దానం చేస్తే వాటిని తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఈ ఘటనపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మహిళ
సాయం చేయాలని స్వచ్ఛంద సంస్థ వసూళ్లు
మృతి చెందిన బాధితురాలు... రూ. 45 లక్షల వరకు జమ
మదీన, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): దాతృత్వాన్ని దోచేస్తున్నారు. ఓ బాధితురాలికి సాయం చేయండంటూ ఆమె ధీనస్థితిని వీడియోలు తీసి సోషల్‌మీడియాలో పెట్టారు. దయగల వారు దానం చేస్తే వాటిని తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఈ ఘటనపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను ఆదుకోవాలని కోరుతూ విరాళాలు సేకరించి, వచ్చిన సొమ్మును తమ సొంత ఖాతాలోకి మళ్లించిన ఓ స్వచ్చంద సంస్థ నిర్వాహకులపై చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పాతబస్తీ నర్కీపూల్‌బాగ్‌కు చెందిన యాస్మీన్ సుల్తానా అనే మహిళ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. భర్త వదిలేయడంతో నలుగురు కూతుళ్లతో ఉంటోందని, చావుబతుకుల మధ్య పోరాడుతున్న ఆమెకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలంటూ హైదరాబాద్ యూత్ కరేజ్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన సల్మాన్‌ఖాన్ అనే యువకుడు వీడియో రూపొందించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అస్రాబేగం అనే మహిళకు చెందిన బ్యాంకు ఖాతా నంబర్, గూగుల్ పే, ఫోన్ నంబర్లను కూడా ఆ వీడియోలో పొందుపరిచాడు.
వీడియో చూసిన సలాల బార్కస్ కు చెందిన మహ్మద్ ఇమ్రాన్ అనే యువకుడు రూ.59,700 వీడియోలో చూపిన అకౌంట్ నంబర్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాడు. నిర్ధారించుకోవడానికి వీడియోలో పేర్కొన్న నంబర్‌కు ఫోన్ చేయగా, పనిచేయలేదు. అనుమానం వచ్చి ఈదీ బజార్ బ్రాంచ్ బ్యాంకుకు వెళ్లి అకౌంట్ వివరాలు ఆరా తీయగా, దాతల నుంచి రూ.45 లక్షలకు పైగా డబ్బు జమ అయినట్లు తెలిసింది. ఆ డబ్బును ఇతర ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించాడు. అయితే, యాస్మి న్ బేగం ఆస్పత్రిలో మరణించింది. అప్పటికే బ్యాంకు ఖాతాలో సుమారు రూ.45 లక్షలు జమ కాగా, అందులో రూ.30 లక్షలు సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారని ఫిర్యాదుదారుడు ఆరోపిస్తున్నాడు. ఈ మేరకు మహ్మద్ ఇమ్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.