డబ్బులిస్తేనే లగేజీ ఇస్తాం..!

ABN , First Publish Date - 2020-07-20T09:49:06+05:30 IST

దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ ప్రైవేటు హాస్టల్‌లో జనగామ జిల్లాకు చెందిన అనిష్‌ అనే విద్యార్థి ఉండేవాడు ఉండేది.

డబ్బులిస్తేనే లగేజీ ఇస్తాం..!

ప్రైవేటు హాస్టళ్ల తిరకాసు

పూర్తి ఫీజుల కోసం సతాయింపు

నాలుగు నెలల మెస్‌ బిల్లులివ్వం

తెగేసి చెబుతున్న విద్యార్థులు

పలు హాస్టళ్ల దగ్గర వాగ్వాదం


హైదరాబాద్‌ సిటీ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ ప్రైవేటు హాస్టల్‌లో జనగామ జిల్లాకు చెందిన అనిష్‌ అనే విద్యార్థి ఉండేవాడు ఉండేది. నగర శివారులోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుతూ ప్రైవేటు హాస్టల్‌కు నెలకు రూ. 5 వేలు చెల్లించేవాడు. కరోనా నేపథ్యంలో మార్చి 16 నుంచి విద్యాసంస్థలు మూతపడ్డాయి. జనతా కర్ఫ్యూ కంటే ముందే లగేజీని హాస్టల్‌లోని వదిలేసి సొంత ఊరికి వెళ్లాడు. ఇటీవల హాస్టల్‌కు వచ్చి, మార్చి నెలకు సంబంధించిన ఫీజు రూ. 5వేలు చెల్లించాడు. లగేజీ హాస్టల్‌లోనే ఉన్నందున మరో రూ. 5 వేలు చెల్లించాలనుకున్నాడు. కానీ, హాస్టల్‌ యజమాని నాలుగు నెలలకు సంబంధించి రూ. 20 వేలు ఇస్తేనే లగేజీ ఇస్తానంటున్నాడు. 


ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఉంటూ ఘట్‌కేసర్‌లో చదువుకుంటున్న మరో విద్యార్థికీ ఇలాంటి అనుభవమే ఎదురైంది. కరోనా నేపథ్యంలో మార్చి 16 తేదీన విద్యాసంస్థలు మూత పడిన మరుసటి రోజే హాస్టల్‌ ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ఇటీవల హాస్టల్‌లో ఉన్న లగేజీ కోసం ఫోన్‌ చేయగా, రూ. 25 వేలు చెల్లించి లగేజీ తీసుకెళ్లాలని నిర్వాహకులు చెప్పాడు. అయితే, హాస్టల్‌లో ఉండకుండా, తినకుండా పూర్తి ఫీజు ఎందుకు చెల్లించాలని ఆ విద్యార్థి ప్రశ్నించాడు. ఇటీవల తన స్నేహితులతో కలిసి వచ్చి ప్రైవేట్‌ హాస్టల్‌ యజమానితో గొడవకు దిగాడు. చివరకు పోలీ్‌సస్టేషన్‌ మెట్లు ఎక్కే వరకు పరిస్థితి వచ్చింది. 


నగరంలోని పలు ప్రైవేటు హాస్టళ్ల యజమాన్యాలు పూర్తి ఫీజు చెల్లిస్తేనే లగేజీ ఇస్తామని అంటున్నాయి. అయితే, పూర్తిఫీజు చెల్లించేది లేదని విద్యార్థులు తెగేసి చెబుతున్నారు. లేడీస్‌ హాస్టళ్ల వద్ద బంధువులు కూడా ఉంటుండటంతో వాగ్వాదం జరుగుతోంది. కొందరు పూర్తిస్థాయి ఫీజులు చెల్లించలేకప హాస్టళ్లలోనే లగేజీ వదిలేసుకుంటున్నారు. మరికొందరు స్థానిక నాయకులతో మాట్లాడించి కొంత మేరకు ఫీజులు చెల్లిస్తున్నారు. 


నగరానికి ఉన్నత విద్య కోసం, పోటీ పరీక్షల కోసం వచ్చే విద్యార్థులు ప్రైవేటు హాస్టళ్లలో ఉండి చదువుకున్నారు. గదులు అద్దెకు తీసుకుని ఉండటం కంటే హాస్టళ్లలో ఉండేందుకే అధిక పాధాన్యం ఇచ్చారు. దీంతో గ్రేటర్‌ పరిధిలో వేల సంఖ్యలో ప్రైవేటు హాస్టళ్లు వెలిశాయి. గతంలో కళాశాలలు, విద్యాసంస్థలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకే హాస్టళ్లు పరిమితం కాగా, ప్రస్తుతం రద్దీ ప్రాంతాల్లో... అన్ని రకాల సదుపాయాలు ఉండే హాస్టళ్లకు అధిక డిమాండ్‌ ఉంటుంది. వేడినీళ్లతో పాటు ప్రీ వైఫై, ఇంటర్నెట్‌ ఇలా పలు సౌకర్యాలను ప్రైవేటు హాస్టళ్లలో కల్పిస్తున్నారు.


ఉండకున్నా.. తినకున్నా.. 

కరోనా నేపథ్యంలో ప్రైవేటు హాస్టళ్లలో ఉండే విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లిపోయారు. కొద్ది రోజుల్లోనే తిగిరి విద్యాసంస్థలు ప్రారంభమవుతాయన్న భావనతో చాలా మంది లగేజీని హాస్టళ్లలోనే వదిలి వెళ్లారు. దాదాపు నాలుగు నెలలుగా ఇళ్లకే పరిమితమైన విద్యార్థులు ఇక విద్యాసంస్థలు ప్రారంభమవ్వని భావించి ఇటీవల లగేజీల కోసం హాస్టళ్లకు వస్తున్నారు. అయితే, హాస్టళ్లు ఖాళీ చేయడంతో ఆయా ప్రైవేటు హాస్టళ్ల యజమాన్యాలూ విద్యార్థుల లగేజీని ఒకే గదిలో ఉంచారు. ఈ క్రమంలో మార్చి ఫీజుతో పాటు ఏప్రి ల్‌, మే, జూన్‌లకు సంబంధించిన పూర్తి ఫీజులను చెల్లించాలని యజమానులు అంటున్నారు. అయితే, తాము హాస్టళల్లో ఉండకున్నా, భోజనం చేయకున్నా ఫీజు ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తుండటంతో వాగ్వాదాలు జరుగుతున్నాయి. 


నెలకు ఫీజు రూ. 5 వేల నుంచి రూ. 8 వేల వరకు

నగరంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ప్రైవేటు హాస్టళ్ల ఫీజులు వసూలు చేస్తున్నారు. వసతులకు అనుగుణంగా ఫీజులు ఉంటాయి.  ప్రస్తుతం నగరంలో హాస్టల్స్‌ ఫీజులు రూ.5వేల నుంచి రూ.8వేల వరకు ఉన్నాయి. అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, అశోక్‌నగర్‌ ప్రాంతాల్లో పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులు ప్రత్యేక గదులు కావాలంటే కల్పిస్తున్నారు. కొందరు షేరింగ్‌ రూంలు, ఒక్కరే ఉండటం లాంటివీ ఉన్నాయి. 


లగేజీ ఇచ్చేయాలి

కరోనాతో బతకడమే కష్టంగా మారింది. ఉపాధి లేక విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో ప్రైవేటు హాస్టళ్ల యజమానులు పూర్తి ఫీజు వసూలు చేయడం సరికాదు. హాస్టళ్లలో ఉండకున్నా, భోజనం ఇతరాత్ర చేయకున్నా పూర్తి ఫీజు చెల్లించాలనడం అన్యాయం. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. పోలీసులకు తగిన ఆదేశాలివ్వాలి. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల లగేజీని ఇచ్చేయాలి. 

- గడ్డం శ్యాం, పీడీఎ్‌సయూ జిల్లా ప్రధాన కార్యదర్శి 


విద్యార్థులను వేధిస్తే ఊర్కోం.. 

ప్రైవేటు హాస్టళ్ల యజమానులు విద్యార్థులను వేధింపులకు గురి  చేస్తే ఊరుకునేది లేదు. అనుకోకుండా వచ్చి పడిన కరోనా, లాక్‌డౌన్‌తో విద్యార్థులు  ఆలోచించుకోలేని పరిస్థితుల్లో ఇళ్లకు వెళ్లిపోయారు.  ఈ పరిస్థితుల్లో విద్యార్థులను పూర్తిస్థాయిలో హాస్టల్స్‌ ఫీజులు  చెల్లిస్తేనే లగేజీ ఇస్తామనడం దారుణం. కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో మానవతా దృక్ఫథంతో  ఆలోచించాలి.  

- ఎస్‌డీ జావేద్‌, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా ప్రధాన కార్యదర్శి

Updated Date - 2020-07-20T09:49:06+05:30 IST