వార్డుకో అధికారి..అతనే జవాబుదారీ

ABN , First Publish Date - 2020-09-03T09:55:28+05:30 IST

పచ్చదనం, పరిశుభ్రతతోపాటు ప్రణాళికాబద్ధమైన పట్టణాలను తీర్చిదిద్దే లక్ష్యంతో మునిసిపాలిటీల్లో ‘వార్డు ఆఫీసర్ల‘ను నియమిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ఇటీవల ప్రకటించారు.

వార్డుకో అధికారి..అతనే జవాబుదారీ

శివారు మునిసిపాలిటీల్లో 

నియామకానికి ప్రభుత్వం కసరత్తు

అధికారుల రాకతో తీరు మారేనా?

ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ సాధ్యమేనా?


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): పచ్చదనం, పరిశుభ్రతతోపాటు ప్రణాళికాబద్ధమైన పట్టణాలను తీర్చిదిద్దే లక్ష్యంతో మునిసిపాలిటీల్లో ‘వార్డు ఆఫీసర్ల‘ను నియమిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ఇటీవల ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ కాకుండా ఓఆర్‌ఆర్‌ లోపల 20 వరకు మునిసిపాలిటీలు ఉన్నాయి. ఇవన్నీ గ్రేటర్‌ చుట్టూ నలుమూలలా విస్తరించి ఉన్నాయి. ఇప్పటి నుంచే ఆయా మునిసిపాలిటీల్లో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ జరిగేలా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో పరిపాలన పటిష్ఠంగా ఉండాలనే లక్ష్యంతో వార్డుకో అధికారిని నియమిస్తామని కేటీఆర్‌ ప్రకటించారు. దానికి అనుగుణంగా శాఖ చర్యలు చేపడుతోంది. స్థానికంగా జరిగే అన్ని కార్యకలాపాలకు అతనే జవాబుదారిగా ఉంటారని ప్రభుత్వం చెబుతోంది. 


దేశంలోనే తొలిసారి 

ప్రతీ వార్డుకు ఒక అధికారిని నియమించడం దేశంలోనే తొలిసారి కానుంది. పారిశుధ్యం, హరితహారంతోపాటు ఇతర కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడం వార్డు ఆఫీసర్ల నియామకంతో సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పురపాలక శాఖ, ప్రజలకు మధ్య వారధిలా వార్డు అధికారులు పనిచేస్తారని వెల్లడిస్తోంది. 


పటిష్ఠంగా ఇంజనీరింగ్‌ విభాగం 

మునిసిపాలిటీల్లో పారిశుధ్య విభాగంతోపాటు టౌన్‌ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌ విభాగాలు ఎంతో కీలకం. పారిశుధ్యానికి అవసరమైన సిబ్బందిని కాంట్రాక్టు విధానంలో సమకూర్చుకుంటున్నా, టౌన్‌ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌ విభాగాల్లో శాశ్వత ఉద్యోగులైతేనే పనితీరు మెరుగ్గా ఉంటుంది. మునిసిపాలిటీల్లోని ఇంజనీరింగ్‌ పనుల్లో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని నివారించేందుకు ఇద్దరు చీఫ్‌ ఇంజనీర్లు ఉండేలా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. వీరికి సహాయకులుగా ఇద్దరు లేదా ముగ్గురు ఎస్‌ఈలు కూడా ఉండాలనే ప్రతిపాదనను ఆమోదించామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. మునిసిపాలిటీల్లో ప్రస్తుతం గుర్తించిన ఖాళీలను సాధ్యమైనంత త్వరగా పారదర్శక విధానంలో భర్తీ చేయడంతోపాటు పౌర సేవలను ప్రజలకు చేరువగా తీసుకెళ్లేందుకు మునిసిపల్‌ పోస్టులతోపాటు, కేబినెట్‌ ఆమోదించిన నూతన పోస్టులను కూడా భర్తీ చేస్తామని ప్రకటించారు. 


ప్రస్తుతం వారిదే రాజ్యం 

మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లదే రాజ్యంగా అన్నట్లుగా ఉంటోంది. అది కొన్నిచోట్ల అవినీతి, అక్రమాలకు అనుకూలంగా మారుతోంది. వార్డులో తాము చెప్పిందే వేదం అన్నట్లుగా ఆయా శాఖల అధికారులతో వ్యవహరిస్తుంటారు. అధికారులు సైతం ప్రజాప్రతినిధులకు తలొగ్గి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా నియమించే వార్డు అధికారులకు పూర్తిస్థాయిలో అధికారాలు ఉంటేనే ప్రభుత్వం ఆశించిన ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ సాధ్యమవుతుంది. ప్రస్తుత పరిస్థితే కొనసాగితే ఆశించిన ఫలితం ఉండదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


గ్రేటర్‌ చుట్టూ ఉన్న పురపాలికలు

మునిసిపల్‌ కార్పొరేషన్లు వార్డులు

1. బడంగ్‌పేట 32

2. బండ్లగూడ జాగీర్‌ 22

3. బోడుప్పల్‌ 28

4. మీర్‌పేట 46

5. పీర్జాదిగూడ 26

6. జవహర్‌నగర్‌ 28

7. నిజాంపేట 33


మునిసిపాలిటీలు వార్డులు

1. కొంపల్లి 18

2. దుండిగల్‌ 28

3. నార్సింగ్‌ 18

4. మణికొండ 20

5. జల్‌పల్లి 28

6. పెద్ద అంబర్‌పేట 24

7. తుర్కయంజాల్‌ 24

Updated Date - 2020-09-03T09:55:28+05:30 IST