గ్రేటర్‌ ఎన్నికల్లో విశిష్ట తీర్పు.. వీరికే ఎందుకు పట్టం!

ABN , First Publish Date - 2020-12-06T12:49:35+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రేటర్‌ ఓటర్లు మరోసారి విశిష్ట తీర్పునిచ్చారు.

గ్రేటర్‌ ఎన్నికల్లో విశిష్ట తీర్పు.. వీరికే ఎందుకు పట్టం!

హైదరాబాద్‌ : స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రేటర్‌ ఓటర్లు మరోసారి విశిష్ట తీర్పునిచ్చారు. పార్టీతో పాటు అభ్యర్థుల వైఖరి, వారి విద్యార్హతలనూ పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపిస్తోంది. స్థానికంగా తమకు అందుబాటులో ఉంటూ.. సమస్యలపై అవగాహన ఉన్న, వాటి పరిష్కారానికి కృషి చేసే వారికి మద్దతు పలికారు. ఈ క్రమంలో మెజార్టీ కొత్త వారు ఎన్నికవగా.. బాగా పని చేశారనుకున్న సిట్టింగ్‌లనూ ఆదరించారు. సమస్యలపై గళం విప్పేందుకు తమ ప్రతినిధులుగా వారిని కౌన్సిల్‌కు పంపారు. ఈ సారి కార్పొరేటర్లుగా ఎంపికైన వారిలో చాలా మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు. మెడిసిన్‌, ఇంజనీరింగ్‌, న్యాయ శాస్త్రం చదివిన వారితోపాటు పట్టభద్రులు ఉన్నారు.


60శాతానికి పైగా ఇంటర్‌, అంతకంటే ఎక్కువ చదువుకున్న వారు ఉండడం గమనార్హం. 150డివిజన్లకు ఎన్నికైన కార్పొరేటర్లలో మెజార్టీ 40-50 యేళ్ల మధ్య వయస్కులు ఉన్నారు. 40యేళ్లలోపు దాదాపు 37 శాతం  మంది వరకు ఉన్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగం వదులుకొని 2016లో పోటీ చేసి గెలిచిన సీతాఫల్‌మండి కార్పొరేటర్‌ సామల హేమ మరోసారి విజయం సాధించారు. కొన్ని డివిజన్లలో పదిలోపు చదివిన వారున్నారు. 55యేళ్లు దాటిన వారు ఏడు శాతం వరకు ఉన్నారు.


సీనియర్లకు పట్టం.. 

ప్రజా సమస్యలపై ఎప్పుడూ ముందుండే స్థానిక నేతలకు ఈ ఎన్నికల్లో ఓటేశారు. గతంలో రెండు, మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సీనియర్లకు సైతం ఈ సారి పలు డివిజన్లలో అవకాశం కల్పించారు. శివారు డివిజన్లలో ప్రధాన పార్టీల నుంచి విద్యావంతులు అధికంగా పోటీచేసినా స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న నేతలకు ఓట్లు వేశారు. కౌన్సిల్‌ సమావేశాల్లో మాట్లాడుతూ తమ డివిజన్లకు అధిక నిధులు తీసుకొచ్చిన పాత కార్పొరేటర్లను సైతం గెలిపించుకున్నారు.

Read more