కుటుంబాలను చుట్టేస్తున్న కరోనా
ABN , First Publish Date - 2020-05-13T07:53:36+05:30 IST
గ్రేటర్‌లో కరోనా వైరస్ చాపకింద నీరు లా విస్తరిస్తోంది. సుమారు 90 కుటుంబాలను వైరస్ చుట్టుముట్టింది. ఇంట్లో ఒకరికి వైరస్

ఒకరి నుంచి మరొకరికి వైరస్..
హైదరాబాద్ సిటీ, మే 12 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లో కరోనా వైరస్ చాపకింద నీరు లా విస్తరిస్తోంది. సుమారు 90 కుటుంబాలను వైరస్ చుట్టుముట్టింది. ఇంట్లో ఒకరికి వైరస్ సోకితే.. ఆ ఇంట్లోని వారూ బాధితులుగా మారుతున్నారు. వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, లక్డీకాపూల్, తలాబ్‌కట్ట, జియాగూడ, అల్లాపూర్, అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో పలు కుటుంబాలు కరోనా వైర్‌సతో ఆస్పత్రి పాలవుతున్నాయి.
పరీక్షల్లో ఆలస్యం..
కరోనా పాజిటివ్ నిర్ధారణ పరీక్షలు ఆలస్యం కావడం వల్లే బాధితుడి కుటుంబ సభ్యులు కూడా వైరస్ బారిన పడుతున్నట్లు భావిస్తున్నారు. అనుమానంతో ఆస్పత్రికి వచ్చిన వారిలో కొందరిని మాత్రమే చేర్చుకుంటుండగా, చాలా మంది వద్ద నమూనా లు సేకరించి ఇంటికి పంపిస్తున్నారు. వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయితే, ఫోన్ చేసి ఆస్పత్రిలో అడ్మిట్ కావాలని చెబుతున్నారు. సంజీవరెడ్డినగర్‌లో ఒకరు జ్వరం, దగ్గు, జలుబుతో ఓ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. అతని నమూనాలు తీసుకున్న తర్వాత ఇంటికి పంపించారు. తర్వాత అతనికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతనికి ఫోన్ చేసి గాంధీ ఆస్పత్రికి వెళ్లి అడ్మిట్ కావాలని సమాచారం ఇచ్చారు. ఇలాంటి సందర్భాలు కూడా ఆ కుటుంబాలు వైరస్ బారిన పడేందుకు దోహదం చేస్తున్నాయి.
ఒకరి నుంచి పలువురికి..
దిల్‌సుఖ్‌నగర్‌లోని తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి (75) వైరస్ బారిన పడ్డాడు. అతడి నుంచి కుటుంబంలోని తొమ్మిది మందికి వైరస్ సోకింది. అతడి భార్య వైర్‌సతో చనిపోయింది.
తలాబ్‌కట్ట ప్రాంతంలో ఓ వృద్ధురాలికి వైరస్ సోకింది. ఆమె ద్వారా సుమారు 34 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో ఆమె కుటుంబ సభ్యులే 28 మంది ఉండ గా, ఇద్దరు డాక్టర్లు, మరో ఇద్దరు నర్సులు, ఇతర సిబ్బంది ఇద్దరు ఉన్నారు.
వనస్థలిపురంలో ఓ వ్యాపారికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అతడి తొమ్మిదిమంది కుటుంబసభ్యులకూ వైరస్ సోకింది.
హుడా సాయినగర్‌లో వృద్ధురాలికి వైరస్ సోకవడంతో ఆమె కూతురు, అల్లుడు, మనమడు, మనుమరాలు, కొడుకు, అతని భార్య, ఇద్దరు పిల్లలకు విస్తరించింది.
జియాగూడ సబ్జిమండిలో కూరగాయల వ్యాపారికి కరోనా పాజిటివ్ తేలింది. కుటుంబసభ్యులు 12మంది వైరస్ బారినపడ్డారు. అతను వైర్‌సతో చనిపోయాడు.
వెంకటేశ్వరనగర్ బస్తీకి చెందిన వృద్ధురాలికి(75) ద్వారా ఆమె కుటుంబంలో 11 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఆమె కోడలు ఆస్పత్రిలో చనిపోయింది.
సాయిదుర్గానగర్‌కు చెందిన జీహెచ్‌ఎంసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి (26)తోపాటు భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో కలిపి మొత్తం ఏడుగురికి వైరస్ సోకింది.
దుర్గానగర్‌కు చెందిన బియ్యపు వ్యాపారి (38) కుటుంబంలోని నలుగురు ఆస్పత్రి పాలయ్యారు.
జియాగూడ బస్తీకి చెందిన ఎలక్ట్రీషిన్ (45) కుటుంబంలో ముగ్గురు వైరస్ బారిన పడ్డారు.
ఓల్డ్‌మలక్‌పేటకు చెందిన ఓ మహిళకు పాజిటివ్ నిర్ధారణ కాగా, భర్త, కుమార్తె, కోడలికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆమెకు జ్వరం వచ్చినప్పుడు వైద్యం చేసిన వైద్యుడికి, ఆమె కుమారుడు, ఇద్దరు మనవళ్లకు నెగటివ్ వచ్చింది.
డబీర్‌పురలోని బీబీకా ఆలంకు చెందిన ఒకరి ద్వారా అతడి తల్లి, ముగ్గురు కుమార్తెలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. భార్యకు మాత్రం నెగిటివ్‌గా నిర్ధారణ అయింది.
అల్లాపూర్ డివిజన్ రాజీవ్‌గాంధీనగర్‌లో ఓ వ్యక్తి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతడి నుంచి పది మందికి వైరస్ సోకింది.