‘పట్నం’ ఎన్నికల్లో ‘పల్లె’ సైన్యం.. బూత్‌ల వారీగా శివారు నేతలకు బాధ్యతలు
ABN , First Publish Date - 2020-11-26T20:34:10+05:30 IST
ప్రస్తుతం జరుగుతున్నవి పట్నం (గ్రేటర్ హైదరాబాద్) ఎన్నికలు.. కానీ అక్కడ ప్రచారం నిర్వహిస్తున్న వారిలో అత్యధికులు పల్లెల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హ. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్లలో ఎన్నికల ప్రచారం బాధ్యతలు భుజాన వేసుకున్న మంత్రి సబితారెడ్డి..

ఆర్కేపురం, సరూర్‌నగర్‌లలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల తిష్ట
సరూర్‌నగర్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం జరుగుతున్నవి పట్నం (గ్రేటర్ హైదరాబాద్) ఎన్నికలు.. కానీ అక్కడ ప్రచారం నిర్వహిస్తున్న వారిలో అత్యధికులు పల్లెల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హ. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్లలో ఎన్నికల ప్రచారం బాధ్యతలు భుజాన వేసుకున్న మంత్రి సబితారెడ్డి.. తన నియోజకవర్గంలోని మీర్పేట్, బడంగ్పేట్ కార్పొరేషన్లతో పాటు తుక్కుగూడ, జల్పల్లి మునిసిపాలిటీలకు చెందిన పార్టీ నాయకులను ఇక్కడే మోహరింపజేశారు. కార్పొరేటర్లు, పార్టీ అధ్యక్షులు, ఇతర ప్రతినిధులు, ముఖ్య నేతలు మొత్తం ఆయా డివిజన్లలో తిష్ట వేశారు. బూత్‌లవారీగా వారికి బాధ్యతలు అప్పగించి, ప్రతి ఓటరునూ క్రమం తప్పకుండా కలవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని మంత్రి వారికి సూచించారు. మధ్యాహ్నం లంచ్, సాయంత్రం టీ-స్నాక్స్, రాత్రి డిన్నర్ డివిజన్లలోనే చేస్తూ అక్కడే ఉంటున్నారు.
బీజేపీ నాయకులు సైతం..
ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్లలో మీర్పేట్, బడంగ్పేట్, జల్పల్లి, తుక్కుగూడలకు చెందిన బీజేపీ నాయకులు కూడా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి సహా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ముఖ్య నేతలు ఈ రెండు డివిజన్లలోనే మకాం వేశారు. ఆర్కేపురంలో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు అధికార పార్టీ చేతిలో ఉన్న సరూర్‌నగర్‌ను సైతం లాక్కోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా.. తమ సిట్టింగ్ స్థానం సరూర్‌నగర్‌ను తిరిగి కైవసం చేసుకోవడంతో పాటు బీజేపీ ఖాతాలో ఉన్న ఆర్కేపురంలోనూ గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ పావులు కదుపుతోంది.
కాంగ్రెస్ కూడా..
మరోపక్క కాంగ్రెస్ అభ్యర్థుల తరపున శివారు గ్రామాలకు చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీలు రెండూ మాటలతోనే మభ్య పెడుతున్నాయని, కాంగ్రె్‌సతోనే నిజమైన అభివృద్ధి జరుగుతుందని పేర్కొంటూ వారి ప్రచారం సాగుతోంది. మొత్తం మీద ‘పట్నం’లో జరుగుతున్న ఎన్నికల పర్వంలో ‘పల్లె సైన్యం’ చురుకుగా పాల్గొని, తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తోంది.