జా...రుతున్న వాహనాలు.. క్యాపింగ్‌ చేసినా.. కథ మారలే

ABN , First Publish Date - 2020-12-30T06:36:30+05:30 IST

జవహర్‌నగర్‌లోని

జా...రుతున్న వాహనాలు.. క్యాపింగ్‌ చేసినా.. కథ మారలే
ప్ర‌మాదానికి గురైన వాహ‌నం

రోడ్డుపైకి లీచెట్‌.. అదుపు తప్పిన వాహనాలు

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు వద్ద పరిస్థితి

నెమ్మదిగా వెళ్లినా.. కింద పడ్డ 20కిపైగా వాహనదారులు

కార్లు రోడ్డు కిందకు వెళ్లిన వైనం

ఆయిల్‌ లాంటి రసాయనాల వల్లే

తాత్కాలిక మరమ్మతు చేసిన కార్పొరేషన్‌ అధికారులు

లీచెట్‌ కాదు.. బురద, మంచు వల్లే : జీహెచ్‌ఎంసీ


హైదరాబాద్‌ సిటీ/జవహర్‌నగర్‌, డిసెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి) : మంగళవారం ఉదయం జవహర్‌నగర్‌లోని ప్రధాన రహదారిపై వాహనదారులు అదుపుతప్పి పడిపోయారు. ద్విచక్ర వాహనాలే కాదు.. కార్లు కూడా ఉన్న పళంగా రోడ్డు దిగువకు వెళ్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఒకరు, ఇద్దరు కాదు.. 15 మందికిపైగా కింద పడ్డారు. సాధారణ వేగంతో వెళ్తున్నా ఎందుకిలా..? అంటే పక్కనే ఉన్న డంపింగ్‌ యార్డు కారణం. 


క్యాపింగ్‌ చేసినా జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు నుంచి హానికర ద్రవ్య వ్యర్థాల (లీచెట్‌) విడుదల ఆగలేదు. రూ.144 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులు దాదాపుగా పూర్తయ్యాయని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతుండగా.. ఇప్పటికీ యార్డు నుంచి లీచెట్‌ బయటకు వస్తోంది. రోడ్డుపై వాహనాలు అదుపు తప్పి పడేందుకు అదే కారణమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 



డంపింగ్‌ యార్డు నుంచి వస్తున్న ద్రవ్య వ్యర్థాలు పక్కనే ఉన్న కుంటలోకి వెళ్లి... నీటితో కలిసి రోడ్డుపైకి వస్తున్నాయి. సాధారణంగా రహదారులపై బురద ఉన్నప్పుడు జాగ్రత్తగా ప్రయాణిస్తే వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉండదు. ఇక్కడ మాత్రం నెమ్మదిగా వెళ్లినా వాహనాలు కింద పడుతున్నాయి. కారణం.. నీటిలో ఆయిల్‌ లాంటి రసాయనాలు కలవడం వల్లే ఈ దుస్థితి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యార్డు నుంచే రసాయనాలు వెలువడుతున్నాయని ప్రమాదానికి గురైన పలువురు వాహనదారులు పేర్కొన్నారు. రోడ్డుపై గుంతలు, ఎగువ నుంచి వస్తున్న నీటికితోడు తెల్లవారుజామున మంచు కురుస్తుండడంతో ఆ మార్గంలో వస్తున్న ద్విచక్ర వాహనాలు, కార్లు అదుపు తప్పుతున్నాయి. 


క్యాపింగ్‌ చేసినా...

జవహర్‌నగర్‌లోని 339 ఎకరాల స్థలంలో 15 యేళ్ల క్రితం డంపింగ్‌యార్డ్‌ ఏర్పాటుచేశారు. గ్రేటర్‌లోని చెత్తను అక్కడే వేస్తున్నారు. 110 ఎకరాల్లో సుమారు 12 మిలియన్‌ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. వాటి నుంచి లీచెట్‌ బయటకు వచ్చి సమీపంలోని జల వనరులు, భూగర్భ జలాలు కలుషితమవుతుండడంతో క్యాపింగ్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు. రూ.144 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. వర్షపు నీరూ డంపింగ్‌ యార్డులోకి వెళ్లకుండా దాదాపు ఐదు పొరలుగా క్యాపింగ్‌ చేస్తున్నారు. వాటిపై మొక్కలూ నాటాల్సి ఉంది. క్యాపింగ్‌ చేసినా డంపింగ్‌ యార్డు నుంచి లీచెట్‌ బయటకు వస్తోంది. ఈ యేడాది భారీ వర్షాలు కురవడం.. పనులు పూర్తికాకపోవడం వల్ల అత్యల్పంగా లీచెట్‌ వెలువడవచ్చని, చాలా వరకు అరికట్టామని ఉన్నతాధికారొకరు తెలిపారు. ఇటీవల చెత్త నుంచి విద్యుదుత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించారు. ప్లాంట్‌ పనిచేసే క్రమంలో భారీ శబ్దాలు వెలువడుతున్నాయని, రాత్రిళ్లు నిద్రపోయే పరిస్థితి లేదని పరిసర నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


తాత్కాలిక మరమ్మతులు...

రోడ్డుపై వాహనాలు అదుపు తప్పి పడుతున్న విషయం తెలిసిన జవహర్‌నగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు స్పందించారు. రహదారి వద్దకు వెళ్లిన కమిషనర్‌ మంగమ్మ.. పరిస్థితిని పరిశీలించారు. బురద తొలగించి కంకర, మట్టి వేసి.. తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టారు. ఆ తర్వాత రాకపోకలు కొంతమేర సాఫీగా సాగాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరముందని వాహనదారులు కోరుతున్నారు. ప్రమాదాలు జరిగిన చోట రోడ్డు ఎత్తు పెంచాలని, ఈ విషయంపై హెచ్‌ఎండీఏ అధికారులతో మాట్లాడినట్టు జీహెచ్‌ఎంసీ వర్గాలు తెలిపాయి. డంపింగ్‌ యార్డు నుంచి లీచెట్‌ బయటకు రావడం లేదని, ఎగువన ఉన్న కుంట నుంచి వచ్చిన నీటితో రోడ్డు బురదమయంగా మారిందని దానికి తోడు మంచు కురవడంతో వాహనాలు అదుపు తప్పి ఉండవచ్చని ఇంజనీరింగ్‌ విభాగం ఉన్నతాధికారొకరు తెలిపారు. 

Updated Date - 2020-12-30T06:36:30+05:30 IST