రోజుకొక కొత్తరకం వండుతున్నా..!

ABN , First Publish Date - 2020-06-22T09:44:54+05:30 IST

లాక్‌డౌన్‌కు ముందు, తర్వాత.. మధ్యతరగతి జీవితాల్లో పెద్ద మార్పులేమీ ఉండవనుకుంటున్నా.. అందులోనూ నా

రోజుకొక కొత్తరకం వండుతున్నా..!

ప్రఖ్యాత మహిళా ఉద్యమకారిణి వసంత కన్నబిరాన్‌


తొలితరం మహిళా సామాజిక ఉద్యమకారిణి వసంత  కన్నబిరాన్‌. తెలుగునేలపై మహిళా ఉద్యమానికి తొలి అడుగు ‘స్త్రీశక్తి సంఘటన’ నిర్మాతల్లో ఆమె ఒకరు. ‘మనకు తెలియని మనచరిత్ర’ను కళ్లముందుంచిన దార్శనికుల్లో ముఖ్యులు కూడా. వసంత కన్నబిరాన్‌ వయసు 81ఏళ్లు. లాక్‌డౌన్‌కి ముందు, తర్వాత ఆమె జీవితంలో వచ్చిన మార్పులను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. 


హైదరాబాద్‌ సిటీ, జూన్‌21 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌కు ముందు, తర్వాత.. మధ్యతరగతి జీవితాల్లో పెద్ద మార్పులేమీ ఉండవనుకుంటున్నా.. అందులోనూ నా వయసు వాళ్లకు అసలే ఉండవు. నాకు చెప్పుకోదగ్గ ఇబ్బందులు కూడా పెద్దగా ఏమీ లేవు. ఒక్కటేమంటే, ఎవర్నీ కలుసుకోలేకపోవడం, ఎక్కడికీ వెళ్లలేకపోవడంతో లైఫ్‌ కొంత డల్‌గా ఉంటుంది. అదే సమయంలో మన చుట్టూ జరిగేది చూస్తుంటే, బాధేస్తుంది. మరీ ముఖ్యంగా వలస కార్మికుల కష్టాలు వింటుంటే కడుపు తరుక్కుపోతోంది. ఆఖరికి చావుని కూడా లెక్కచేయకుండా కాలినడకన సొంతూర్లకి బయలుదేరిన వారి సాహసాలు చూసి ఏడుపొచ్చింది. ఈ సమస్యలకి ప్రధాన కారణం అంతా మనవాళ్లే కానీ, పొరుగు దేశాల వాళ్లు మాత్రం కారు. మిగతారోజుల్లో మానవ శ్రమని విపరీతంగా వాడుకొని, ఇలాంటి కష్టసమయంలో శ్రామికులను వెళ్లగొట్టిన క్రూరులకి ఎప్పుడోకప్పుడు శిక్ష పడదా అనే ఒక చిన్న ఆశ అయితే నాలో ఉంది. నాకిదంతా ఒక దుఃఖభరిత సందర్భంగా తోస్తోంది. అందుకే ఇప్పుడు న్యూస్‌ చూడడం కూడా దాదాపుగా తగ్గించా.


ఒక్క న్యూజిలాండ్‌ పరిస్థితి వింటుంటే మాత్రం సంతోషమేస్తోంది. జాసిండ అర్డర్న్‌ వంటి యువతులు (యంగ్‌ విమెన్‌) దేశాధినేతలుగా కొనసాగితే, అన్ని దేశాలూ బాగుపడతాయనే నమ్మకం కలుగుతోంది. మిగతా దేశాల వృద్ధనేతలంతా స్వార్థాన్ని వీడి ఆమె కాళ్ల కింద పడితే కాస్త బుద్ధి వస్తుందేమో.! ఇక ఇప్పుడు నా వయసు వాళ్లకి కరోనా వల్ల ప్రాణం పోతుందనే భయంకన్నా... ఒకవేళ చనిపోతే తీసుకెళ్లి తగలబెట్టడం కోసం పిల్లలు ఎంత కష్టపడతారో అనే బెంగ ఎక్కువుంటుందనిపిస్తోంది. 


చదవడం...

రోజూ చేసే పనులు నాకంటూ కొన్నుంటాయి. ఏదో చదవడం, రాయడంతో సమయం గడిచిపోతుంది. నాకు వంటలంటే చాలా ఇష్టం. కనుక రోజూ ఏవో వండుతుంటాను. వ్యాయామం చేద్దామంటే ఓపిక లేదు. పోనీ రోడ్డు మీద నడుద్దామన్నా ఇబ్బందిగానే ఉంది. ఇంట్లోనే రోజూ ఒక అరగంట వామప్‌, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ చేస్తుంటా. సంగీతం వినడమంటే నాకు చాలా ఇష్టం. అలాంటిది ఈ రెండు నెలల్లో ఒక్కసారి కూడా దాని జోలికి పోలేదు. ఎందుకో వినాలనిపించడం లేదు. బహుశా! నా గుండె, చెవులు మొద్దుబారిపోయినాయేమో. ఇక నా స్వీయరచన ‘టేకెన్‌ యట్‌ ది ఫ్లడ్‌’’ చదివిన వాళ్ల నుంచి రోజూ ఫోన్లు వస్తుంటాయి. వాళ్లతో మాట్లాడుతుంటా. వీటితో పాటు మురైల్‌ బార్బెరీ రచన ‘‘ఎలిజన్స్‌ ఆఫ్‌ ది హెడ్జ్‌హొగ్‌’’ చదివాను. ఇవిగాక రోజూ కొన్ని పత్రికల్లోని సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యాసాలు, సోషల్‌మీడియాలో వ చ్చే ఇతర ఆర్టికల్స్‌ చదువుతుంటా. 


రాయడం...

నా జీవితంలోని మరికొన్ని జ్ఞాపకాలను పుస్తకంగా తీసుకొద్దామని ఆలోచిస్తున్నా. నా స్వీయరచనలో రాజకీయానుభవాలకు సంబంధించిన విషయాలే రాశా. వాస్తవానికి నాకు నాన్‌-పొలిటికల్‌ ఫ్రెండ్స్‌ చాలామంది ఉన్నారు. వాళ్లతో నా స్మృతులన్నింటినీ ఇప్పుడు అక్షరబద్దం చేసే పనిలో ఉన్నా. నాకు భోజనమంటే చాలా ప్రియం. నా 81ఏళ్ల జీవితంలో నేనెక్కడెక్కడికి వెళ్లి, ఏమేమి తిన్నానో ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నా. అవన్నీ కలిపి ఒక ట్రావెల్‌ లాగ్‌లా రాయాలనుకుంటున్నా. తద్వారా నా స్నేహితులు, నా ప్రియమైన వంటల గురించీ రాసినట్లుంది కదా!. దాంతో నాకు కొంత రిలీ్‌ఫగానూ ఉంటుంది. లాక్‌డౌన్‌లోనే కుటుంబరావు నవల ‘కొల్లేటి జాడలు’ ఇంగ్లిషులోకి అనువదించాను. ఇప్పుడు రోజుకొకరి చొప్పున నా చిన్ననాటి స్నేహితులందరికీ ఫోను చేసి పలకరిస్తున్నా. వాళ్లతో ఆనాటి తీపి గుర్తులను నెమరేసుకోవడం, ముచ్చటించడం బావుంది. 


అమానవీయం...

ఇంత వరకు సఫాయి కర్మచారీలతో చాకిరీ చేయించుకొని, తర్వాత వాళ్లను పట్టించుకోవడం మానేశాం. అదే రీతిగా ఇప్పుడు వైద్యులపట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నాం. ఇదెంత అన్యాయం.! డాక్టర్లతోసేవలు చేయించుకొని, తర్వాత వాళ్ల మీద దాడి చేయడం చాలా అమానవీయం. ఇప్పుడు రోడ్లపై రద్దీ చూస్తుంటే, మనుషులుగా మనమంతా కామన్‌సెన్స్‌ సంపాదించుకోలేదా అనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పిచ్చిపట్టినట్టు జనం బయటకెళ్లడం ఏమిటి? కరోనా సీరియ్‌సనె్‌సని సాధారణ ప్రజలు గ్రహించలేకపోతున్నారు. 


 కొత్త ఆశ...

రజాకార్‌ ఉద్యమం అప్పుడు నేను చిన్నపిల్లను. ఆ వయలెన్స్‌ నాకు తెలుసు. ఎమర్జెన్సీ టైంలో చాలా కష్టపడ్డాం. తర్వాత మేము అభిమానించే వాళ్లందరినీ అర్బన్‌ నక్సలైట్లంటూ జైళ్లలో పెట్టినా భరించాం. మరి ఇప్పుడు.. ఒకరికి కాదు, ఒక సమూహానికి కాదు, ప్రపంచమంతటా సమస్యే. దీన్ని తట్టుకోవడం కాస్త కష్టమే. అయితే, ఇలాంటి ఎన్నో ఉపద్రవాలను మానవాళి ఒక్కొక్కటిగా జయిస్తూ వచ్చినట్టు, ఎప్పుడో అప్పుడు కరోనా కూడా చరిత్రగా మారకపోదా అని నాలో ఒక చిన్న ఆశ కలుగుతోంది. 


జ్ఞాపకాలు...

నేను పుట్టి, పెరిగిందంతా మారేడ్‌పల్లిలోనే. నా చిన్నతనంలో... మా ఇంటి పక్కన పటాలీ అని మరాఠీలు ఉండేవారు. వాళ్ల ఇంటి ఆవరణలో పెద్ద వేపచెట్టు, బాదం చెట్టు కింద రోజూ పిల్లలమంతా కలిసి ఆడుకునేవాళ్లం. భోజనం సమయమైతే, పటాలీ వాళ్ల నాయనమ్మ పిల్లలందరినీ తన చుట్టూ కూర్చోబెట్టుకొని... వేడివేడి అన్నం, వరన్‌ (పప్పు), వెల్లుల్లి ఆవకాయ, నెయ్యితో కలిపిన ముద్దలు పెట్టేది. నా జీవితంలో అదొక మధురానుభూతి. ఇప్పటికీ నా కళ్లలో ఆ పాత మారేడ్‌పల్లే మెదులుతోంది. బెంగాలీలు, పార్శీలు, మరాఠాలు, మలయాళీలతో అదొక మల్టీకర్చలర్‌ సెంటర్‌ని తలపించేది. మారేడ్‌పల్లిలో ఆంగ్లో ఇండియన్‌ కుటుంబాలు చాలా ఉండేవి.


మా వీధిలో నడిచెళ్లే ప్రతినలుగురిలో ఒకరు ఆంగ్లో ఇండియన్‌ ఉండేవారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు వారంతా ఏమయ్యారో తెలియదు. ఇప్పటి మారేడ్‌పల్లి పూర్తిగా మారింది. నేను పుట్టి, పెరిగిన నేల భౌగోళిక, సాంస్కృతిక స్వరూపమంతా మాయమైపోయిందని బాధేస్తుంటుంది. నా జీవితం ఒక జ్ఞాపకాల పూదోట. అందులో ఎన్ని మధుర స్మృతులో చెప్పలేను. కన్నబిరాన్‌తో కలిసి ప్రయాణించడం, ఆయనతో ఉండడం నాకు దక్కిన అదృష్టమని పదేపదే అనిపిస్తుంటుంది. 


కీమా పలావ్‌...

రోజూ ఏదో ఒక కొత్త వంట ట్రై చేస్తూనే ఉంటా. ఇప్పుడు యూట్యూబ్‌లో చూసి కొన్ని వెరైటీలు చేస్తున్నా. బాగా వండుతాను కూడా. ప్రతిరోజూ బిర్యానీలో, పిండివంటలో వండుతానని కాదు కానీ... పప్పుచారు, పచ్చిపులుసు చేసినా శ్రద్ధతో వండుతాను. వంటపని నాకు అతిపెద్ద రిలాక్సేషన్‌. అందులోనూ నాన్‌వెజ్‌ వండటమంటే చాలా ఇష్టం. నేను చేసిన కీమా పలావ్‌కి బోలెడంత మంది అభిమానులున్నారు (నవ్వుతూ...). నా చిన్నతనంలో నాన్‌వెజ్‌ బాగా తినేదాన్ని. ఆరోగ్యరీత్యా ఇప్పుడు తినడం తగ్గించా. రోజూ సాధారణ శాకాహార భోజనమే తీసుకుంటా. వెజిటెబుల్‌ సలాడ్‌ అంటే ఇష్టం. 

Updated Date - 2020-06-22T09:44:54+05:30 IST