కొత్త ప్రాంతాల్లో కరోనా..!

ABN , First Publish Date - 2020-05-09T10:38:33+05:30 IST

కరోనా గ్రేటర్‌ హైదరాబాద్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. వైరస్‌ ఎలా సోకుతుందో.. ఎవరి నుంచి వస్తోందో తెలియని పరిస్థితి నెలకొంది.

కొత్త ప్రాంతాల్లో కరోనా..!

వేర్వేరు చోట్ల ఇద్దరి మృతి

పలువురికి పాజిటివ్‌ నిర్ధారణ

కుటుంబ సభ్యుల క్వారంటైన్‌ 

ఫీవర్‌, చెస్ట్‌ ఆస్పత్రుల్లో అనుమానితులు


అంబర్‌పేట/అఫ్జల్‌గంజ్‌/అల్లాపూర్‌/ముషీరాబాద్‌/బేగంపేట/మన్సూరాబాద్‌/బర్కత్‌పుర/ఎర్రగడ్డ/హైదరాబాద్‌ సిటీ, మే 8 (ఆంధ్రజ్యోతి): కరోనా గ్రేటర్‌ హైదరాబాద్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. వైరస్‌ ఎలా సోకుతుందో.. ఎవరి నుంచి వస్తోందో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా వెలుగు చూస్తున్న కేసుల్లో వైరస్‌ మూలాలు దొరకడం లేదు. శుక్రవారం గ్రేటర్‌లో ఇద్దరు  చనిపోయారు. కొత్త ప్రాంతాల్లో వైరస్‌ ప్రబలడంతో ఆందోళన నెలకొంది. 


కానిస్టేబుల్‌ తాత మృతి

అంబర్‌పేటలో ఓ కానిస్టేబుల్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. అతడి తాత(75) శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో చనిపోయాడు. కొన్ని రోజులుగా ఆయన చిక్సిత పొందుతున్నాడు. నిబంధనల ప్రకారం కరోనా మృతులకు నిర్వహించే పద్ధతిలోనే అంత్యక్రియలు నిర్వహించారు. తమ ఇంటి పెద్దను చూసేందుకు బంధువులు ప్రయత్నించినప్పటికీ అధికారులు అనుమతించలేదు. కడచూపునకు నోచుకోకుండానే అంత్యక్రియలు జరిగాయి. 


విశ్రాంత ఉద్యోగి..  

జియాగూడ వెంకటేశ్వర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన పోస్టల్‌ విభాగం విశ్రాంత ఉద్యోగి(75) కుమారుడికి టైఫాయిడ్‌ జ్వరం రావడంతో కిమ్స్‌ ఆస్పత్రిలో ఉంచి వారం రోజులుగా వైద్యం చేయిస్తున్నారు. కుమారుడిని చూసేందుకు తండ్రి ఆస్పత్రికి శుక్రవారం వెళ్లాడు. అక్కడ గుండెపోటు వచ్చి పడిపోయాడు. వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో అతడు చనిపోయాడు. అంతకు ముందు వృద్ధుడికి రక్త పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వైద్యులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు అతడి భార్య, కొడుకు, కోడళ్లు, ఇద్దరు మనవళ్లను క్వారంటైన్‌ చేశారు. వారి నమూనాలు సేకరించి పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి పంపించారు. 


50 ఏళ్ల మహిళకు వైరస్‌

జియాగూడ ఇందిరానగర్‌కు చెందిన 50 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను క్వారంటైన్‌ చేశారు. ఆమె ఎవరెవరిని కలిసిందనే వివరాలు సేకరిస్తున్నారు.  


రాజీవ్‌గాంధీనగర్‌లో ఒకరికి.. 

అల్లాపూర్‌ డివిజన్‌, రాజీవ్‌ గాంధీనగర్‌లో ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు జీహెచ్‌ఎంసీ మూసాపేట్‌ సర్కిల్‌ అధికారులు నిర్ధారించారు. ఓ వ్యక్తి(46)కి కడుపునొప్పి రావడంతో గురువారం ఛాతీ ఆస్పత్రికి వెళ్లాడు. అనుమానించిన ఆస్పత్రి సిబ్బంది నమూనాలు సేకరించి గాంధీ ఆస్పత్రికి పంపించారు. అక్కడ పరీక్షలు చేసి పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారించారు. బాధితుడు నివసిస్తున్న ఇంటికి తాళం వేసి కట్టడి ప్రాంతంగా ప్రకటించారు. కుటుంబ సభ్యులనూ ఆస్పత్రికి తరలించారు. 


ముషీరాబాద్‌లో వృద్ధుడికి... 

ముషీరాబాద్‌ డివిజన్‌ దయారా కమాన్‌ వద్ద వృద్ధుడి(65)కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో గాంధీ ఆస్పత్రికి శుక్రవారం తరలించారు. భోలక్‌పూర్‌ ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ కృష్ణమోహన్‌, సర్కిల్‌ 15 డీఎంసీ ఉమాప్రకాష్‌, ఏఎంఓహెచ్‌ డాక్టర్‌ హేమలత తదితరులు అతడి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. పది రోజులుగా అనారోగ్యంగా ఉన్న వృద్ధుడికి స్థానికంగా ఉన్న ఓ క్లినిక్‌లో వైద్య పరీక్షలు చేయించారు. నిమోనియా ఉందని తేలడంతో కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. వృద్ధుడి ఇంట్లోనే 12 మందిని హోం క్వారంటైన్‌ చేశారు. అతడి ఇంటి నుంచి చెత్త సేకరించే వారికి సైతం వైద్య పరీక్షలు నిర్వహించారు. 


ఎస్సార్‌నగర్‌లోనూ.. 

ఎస్సార్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ వెనుక ప్రాంతంలో తాజాగా మరో పాజిటివ్‌ కేసు నమోదైంది. ఈ ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఒక కేసు నమోదు కాగా, అధికారులు కట్టడి ప్రాంతంగా ప్రకటించారు. సదరు ఇంటి వెనుక నివసించే ఓ వ్యాపారికి శుక్రవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సదరు వ్యక్తి కుటుంబాన్ని క్వారంటైన్‌ చేయడంతోపాటు అతడు ఎవరెవరిని కలిశారనే వివరాలు సేకరిస్తున్నారు.  


పరీక్షలకు కుటుంబసభ్యుల తరలింపు

నాగోల్‌ డివిజన్‌ సాయినగర్‌లో ఓ అపార్టుమెంట్‌లో నివసిస్తున్న డయాలసిస్‌ రోగి అయిన యువకుడికి ఇటీవల పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం అతడి కుటుంబ సభ్యులు ఆరుగురితోపాటు పని మనిషిని కూడా వైద్య పరీక్షల కోసం తరలించినట్లు హయత్‌నగర్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ మారుతీదివాకర్‌ తెలిపారు. 


‘ఫీవర్‌’లో ఏడుగురు అనుమానితులు

నల్లకుంట ఫీవర్‌ ఆస్పతిలో శుక్రవారం ఏడు కరోనా వైరస్‌ అనుమానిత కేసులు నమోదయ్యాయి. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో వారిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. వారి రక్తనమూనాలను ల్యాబ్‌కు పంపించారు.  


చెస్ట్‌ ఆస్పత్రిలో పెరిగిన  అనుమానిత కేసులు

ఎర్రగడ్డ ఛాతీ వ్యాధుల ఆస్పత్రిలో శుక్రవారం అనుమానిత కేసులు పెరిగాయి. ఆస్పత్రిలోని కరోనా ఓపీకి 25 మంది రాగా, 11 మందిని చేర్చుకున్నారు. చికిత్స పొందుతున్న ఇద్దరికి నెగెటివ్‌ రావడంతో డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో మొత్తం 15 అనుమానిత కేసులకు చికిత్స అందిస్తున్నారు. అందులో గతంలో చికిత్స పొందుతున్న నలుగురితోపాటు తాజాగా నమోదైన 11 మంది ఉన్నారని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌ తెలిపారు.


Updated Date - 2020-05-09T10:38:33+05:30 IST