రెండు రోజులు..205 ఫిర్యాదులు

ABN , First Publish Date - 2020-09-18T09:23:11+05:30 IST

భారీ వర్షంతో రెండు రోజుల్లో జీహెచ్‌ఎంసీకి 205 (గురువారం సాయంత్రం 6 గంటల వరకు) ఫిర్యాదులు అందాయి

రెండు రోజులు..205 ఫిర్యాదులు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 17 (ఆంధ్రజ్యోతి) : భారీ వర్షంతో రెండు రోజుల్లో జీహెచ్‌ఎంసీకి 205 (గురువారం సాయంత్రం 6 గంటల వరకు) ఫిర్యాదులు అందాయి. మొత్తంగా వచ్చిన ఫిర్యాదుల్లో 126 (61 శాతానికిపైగా) వరద నీరు నిలిచినవే కావడం గమనార్హం. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని 45 ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. కాల్‌ సెంటర్‌కు 85, మై జీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారా 84, డయల్‌ 100కు 36 ఫిర్యాదులు వచ్చాయి. 


ఫిర్యాదుల వివరాలివి...

కేటగిరీ మొత్తం ఫిర్యాదులు

వరద నీరు నిలిచినవి 126

భవనాలు/గోడ కూలినవి 6

చెట్ల కొమ్మలు విరిగినవి 14

చెట్లు కూలినవి 14

రోడ్లు పాడయ్యాయని 45

మొత్తం 205


నీట మునిగిన జల్‌పల్లిలోని బస్తీ

పహాడీషరీఫ్‌ : జల్‌పల్లిలోని హరిజన బస్తీ బుధవారం రాత్రి కురిసిన వర్షానికి నీటి మునిగింది. ఎగువన ఉన్న తాళ్లకుంట తూమును తెరవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో గురువారం బస్తీ ప్రజలు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. 


శివరాంపల్లి ఊరచెరువు వద్ద...

రాజేంద్రనగర్‌ : నాలా, చెరువు స్థలాలు కబ్జా కావడంతో వర్షం పడినప్పుడల్లా శివరాంపల్లి ఊర చెరువు కింది భాగంలో ఉన్న ప్రభాకర్‌జీ కాలనీ, ఎన్‌పీఏ కాలనీ, అనన్య కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శివరాంపల్లి నుంచి ఎన్‌పీఏ వెళ్లే దారిలో నీరు పారుతుండటంతో స్థానిక ప్రజలు కార్పొరేటర్‌ కోరని శ్రీలతా మహాత్మా దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. దీంతో ఆమె ప్రభాకర్‌జీ కాలనీలో పర్యటించి మోటార్లు పెట్టించి లోతట్టు ప్రాంతాలలో నిల్వ ఉన్న నీటిని తోడించారు.


ఎమ్మెల్యే, జోనల్‌ కమిషనర్‌ పరిశీలన

లంగర్‌హౌజ్‌ : లంగర్‌హౌజ్‌, టోలీచౌకి, బాల్‌రెడ్డి నగర్‌ , హకీంపేట్‌ లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్యరెడ్డి, ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌ ఆయా ప్రాంతాలను పరిశీలించారు.

Updated Date - 2020-09-18T09:23:11+05:30 IST