అనుమతి లేని ఇంజక్షన్లను విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
ABN , First Publish Date - 2020-09-20T09:49:43+05:30 IST
ఆపరేషన్ సమయంలో వినియోగించే మెఫెంట్రమైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు...

రూ. 1.50 లక్షల విలువైన 150 ఇంజక్షన్లు స్వాధీనం
చాదర్‌ఘాట్/హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్19 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సమయంలో వినియోగించే మెఫెంట్రమైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్, చార్మినార్ డ్రగ్ ఇన్స్పెక్టర్, చాదర్‌ఘాట్ పోలీసులు కలిసి వలపన్ని అరెస్టు చేశారు. చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ షా ఫహద్(28) ప్రైవేట్ ఉద్యోగి. గతంలో ఓ ఫార్మా సంస్థలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేశాడు. దాంతో అతడికి కొన్ని మందుల వినియోగంపై అవగాహన వ చ్చింది. హృద్రోగులకు మందులాగా, ఆపరేషన్ సమయంలో వినియోగించే మెఫెంట్రమైన్ సల్ఫేట్ ఇంజక్షన్ ద్వారా కండరాల పెరుగుదల కూడా ఉంటుంది. దీనిని త్వరగా కండలు పెంచాలనుకునే బాడీబిల్డర్లు, క్రీడాకారులు వినియోగిస్తారు. మా ర్కెట్లో ఈ ఇంజక్షన్ అందరికీ అందుబాటులో ఉండదు. సహజంగా కాకుండా త్వరగా కండలు, సత్తువ పెంచుకునేందుకు క్రీడాకారులు దీన్ని అక్రమంగా కొనుగోలు చేసి వినియోగిస్తుంటారు. ఈ విషయం గ్రహించిన ఫహద్ ఈ ఇంజక్షన్లను విక్రయించి లాభాలుగడించాలని పథకం వేశాడు. చంచల్‌గూడ ప్రాంతానికి చెంది న షేక్‌అబ్దుల్ ఒవైస్ సహకారం తీసుకున్నాడు. వీరిద్దరూ ఢిల్లీలో అక్షయ్ ఎంటర్ప్రైజెస్ మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు విక్రమ్‌తో పరిచయం పెంచుకున్నాడు. విక్రమ్ ఈ ఇంజక్షన్లను ఢిల్లీ నుంచి హైదరాబాద్కుకొరియర్ ద్వారా పంపేవాడు. ఇక్కడ వీరిద్దరూ ఈ ఇంజక్షన్లును అవసరమున్న వారికి అధిక ధరలకు విక్రయించేవారు. ఈ దందాపై పక్కా సమాచారంతో సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, చార్మినార్ డ్రగ్ ఇన్స్పెక్టర్, చాదర్‌ఘాట్ పోలీసులు కలిసి నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.50లక్షల విలువైన 150 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.