మరో 20 కొత్త సబ్‌స్టేషన్లు

ABN , First Publish Date - 2020-12-26T06:49:22+05:30 IST

గ్రేటర్‌ జోన్‌లోని 9 సర్కిళ్ల పరిధిలో

మరో 20 కొత్త సబ్‌స్టేషన్లు

డిమాండ్‌కు  తగినట్లు  పెంపు 

ఇండోర్‌ సబ్‌స్టేషన్లకు ప్రాధాన్యం

9 సర్కిళ్లలో  54  లక్షలు దాటిన విద్యుత్‌ కనెక్షన్లు 


పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు విద్యుత్‌శాఖ అడుగులు వేస్తోంది.  గ్రేటర్‌లో 2021 వేసవి నాటికి మరో 20 కొత్త సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటిని చార్జింగ్‌ చేసే దిశగా తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) చర్యలు తీసుకుంటోంది. కొత్తగా మరో పది ఇండోర్‌ సబ్‌స్టేషన్లు ఏర్పాటుకు డిస్కం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. శివారు ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడుతున్న కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో పూర్తిగా అండర్‌గ్రౌండ్‌ కేబుల్‌ వ్యవస్థతో విద్యుత్‌ సరఫరా అందించే దిశగా టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 


హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 25  (ఆంధ్రజ్యోతి) : గ్రేటర్‌ జోన్‌లోని 9 సర్కిళ్ల పరిధిలో 54 లక్షలకు పైగా విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. సాధారణంగా గ్రేటర్‌లో రోజూ 45-50 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం నమోదవుతోంది. మరో రెండేళ్లలో శివారు ప్రాంతాల్లో మరో 5 లక్షల కనెక్షన్లు పెరిగే అవకాశాలున్నాయని డిస్కం అంచనా వేస్తోంది. బాచుపల్లి, మియాపూర్‌, కూకట్‌పల్లి, హయత్‌నగర్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి, మేడ్చల్‌, శామీర్‌పేట, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, రాజేంద్రనగర్‌, కొండాపూర్‌ వంటి ప్రాంతాల్లో  ప్రతినెలా వెయ్యికి పైగా కొత్త విద్యుత్‌ కనెక్షన్లు నమోదవుతున్నాయి. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో కొత్త సబ్‌స్టేషన్లు నిర్మించడంతో  పాటు అండర్‌ గ్రౌండ్‌  కేబుల్‌ వ్యవస్థ ఏర్పాటు చేసేదిశగా విద్యుత్‌శాఖ చర్యలు తీసుకుంటోంది.


ఏటా 5 శాతం పెరుగుదల...

ఏటా 5 నుంచి 8 శాతం వరకు కొత్త విద్యుత్‌ కనెక్షన్లు పెరుగుతుంటాయి. పది నెలల్లో శివారు ప్రాంతాల్లో 40 వేలకు పైగా కనెక్షన్లు పెరిగాయి. దీంతో వేసవినాటికి కొత్తసబ్‌స్టేషన్లు నిర్మించి వాటిని చార్జింగ్‌ చేస్తే మే నాటికి డిమాండ్‌ 75-80 మిలియన్‌ యూనిట్లకు చేరినా ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్‌సరఫరా చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 33/11 కేవీ, 400 కేవీ, 220 కేవీ సబ్‌స్టేషన్లు 520 ఉన్నాయి. సబ్‌స్టేషన్ల సంఖ్య పెంచితే విద్యుత్‌సరఫరా నష్టాలు తగ్గించుకునే అవకాశాలు పెరుగుతాయని  అధికారులు చెబుతున్నారు. 


ఇండోర్‌ సబ్‌స్టేషన్ల ఏర్పాటు

కోర్‌ సిటీలో కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు స్థలాల కొరత వేధిస్తోంది. నివాస ప్రాంతాల్లో తక్కువ స్థలంలో నిర్మించే అవకాశాలున్నా ఇండోర్‌ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని డిస్కం భావిస్తోంది. సాధారణ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి ఎకరం నుంచి ఎకరంన్నర స్థలం అవసరం కాగా, ఇండోర్‌ సబ్‌స్టేషన్‌కు 200-500 గజాల స్థలం సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. వ్యయం రెట్టింపు అయినా ఇండోర్‌ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు స్థానికుల నుంచి అభ్యంతరాలు లేకపోవడంతో ఇండోర్‌ గ్యాస్‌ ఇమ్యులేటెడ్‌ సబ్‌స్టేషన్‌లను ఏర్పాటు చేసేందుకు విద్యుత్‌శాఖ అధిక ప్రాధాన్యతనిస్తోంది. హైదరాబాద్‌ సెంట్రల్‌, సౌత్‌, బంజారాహిల్స్‌, సికింద్రాబాద్‌, మేడ్చల్‌, సైబర్‌సిటీ, సరూర్‌నగర్‌, హబ్చిగూడ, రాజేంద్రనగర్‌ సర్కిళ్ల పరిధిలో కొత్తగా ఇండోర్‌సబ్‌స్టేషన్లు అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 


డిమాండ్‌కు తగినట్లుగా ఏర్పాట్లు 

: రఘుమారెడ్డి, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ

గ్రేటర్‌లో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సబ్‌స్టేషన్లు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. కరోనా నేపథ్యంలో గ్రేటర్‌లో విద్యుత్‌ డిమాండ్‌ కొంత తగ్గింది. సినిమా థియేటర్లు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు ఉన్న హెచ్‌టీ వినియోగం తగ్గినా, గృహ వినియోగ డిమాండ్‌లో పెద్దగా మార్పులు కనిపించలేదు. వేసవిలో విద్యుత్‌ వినియోగం ఎంత పెరిగినా అంతరాయాలు లేకుండా సరఫరా అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఎస్‌ఈలతో వేసవి డిమాండ్‌, తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నాం. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రెండు ఫీడర్ల నుంచి విద్యుత్‌ సరఫరా అందించేలా చర్యలు తీసుకుంటాం. ఒక ఫీడర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినా నిమిషాల్లో మరో ఫీడర్‌నుంచి విద్యుత్‌ సరఫరా అందిస్తాం. 

Updated Date - 2020-12-26T06:49:22+05:30 IST