అప్పు తీసుకుని ఇవ్వడంలేదని కత్తితో దాడి

ABN , First Publish Date - 2020-10-04T09:55:01+05:30 IST

అప్పు తీసుకుని ఇవ్వడంలేదని కత్తితో దాడి

అప్పు తీసుకుని ఇవ్వడంలేదని కత్తితో దాడి

బాలానగర్‌, అక్టోబర్‌ 3(ఆంధ్రజ్యోతి): తీసుకున్న అప్పును చెల్లించడంలో ఆలస్యం చేస్తున్నాడని  ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన బాలానగర్‌  పోలీ్‌సస్టేషన్‌  పరిధి రంగారెడ్డినగర్‌లో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బేగంపేట్‌ బీఎస్‌ మక్తాకు చెందిన ఎం.డి.ఫజియొద్దీన్‌(37) కూకట్‌పల్లి పయోనీర్‌ బ్రాడ్‌ బ్యాండ్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి రంగారెడ్డినగర్‌కు చెందిన గణేష్‌ పాండేతో నెల రోజుల క్రితం పరిచయం ఏర్పడింది. తాను పని చేస్తున్న బ్రాడ్‌ బ్యాండ్‌ కంపెనీలో గణేష్‌ పాండేకు ఉద్యోగం కూడా ఇప్పించాడు. ఈ చనువుతో ఫజియొద్దీన్‌ 20 రోజుల క్రితం రూ.5000 గణేష్‌ వద్ద అప్పుగా తీసుకుని 3వ తారీఖున జీతం వచ్చాక ఇస్తానని చెప్పాడు. 3వ తేదీన మాట్లాడుకుందామని రంగారెడ్డినగర్‌లోని ఓ హోటల్‌ వద్దకు ఫజియొద్దీన్‌ను గణేష్‌ పాండే పిలిపించాడు. అతడు రాగానే కత్తితో కడుపు, ఛాతిలో పొడిచి గణేష్‌ పారిపోయాడు. ఇది గమనించి స్థానికులు ఫజియొద్దీన్‌ను స్థానికంగా ఉన్న బీబీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు అతడి ప్రాణానికి ఎలాంటి ప్రమాదమూ లేదని తెలిపారు. బాలానగర్‌ పోలీసులు ఫజియొద్దీన్‌ అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-10-04T09:55:01+05:30 IST