ఉప్పల్‌లో కారు జోరు కొనసాగేనా..!
ABN , First Publish Date - 2020-11-26T20:43:03+05:30 IST
ఉప్పల్ నియోజకవర్గంలో పది డివిజన్లలోనూ గెలుపు బావుటా ఎగువేయాలని టీఆర్ఎస్ ఆశిస్తోంది. 2016 గ్రేటర్ ఎన్నికల్లో ఉప్పల్, కాప్రా సర్కిళ్ళలో ఉన్న పది డివిజన్లలో తొమ్మిది డివిజన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకోగా కేవలం నాచారం డివిజన్‌ను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది.

పది డివిజన్లలో గెలుపు కోసం చూపు
పట్టు కోసం ఎమ్మెల్యే భేతి ప్రయత్నాలు
అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడంలో విజయం
ఐదు డివిజన్లలో గట్టి పోటీ
ఉప్పల్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఉప్పల్ నియోజకవర్గంలో పది డివిజన్లలోనూ గెలుపు బావుటా ఎగువేయాలని టీఆర్ఎస్ ఆశిస్తోంది. 2016 గ్రేటర్ ఎన్నికల్లో ఉప్పల్, కాప్రా సర్కిళ్ళలో ఉన్న పది డివిజన్లలో తొమ్మిది డివిజన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకోగా కేవలం నాచారం డివిజన్‌ను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. అక్కడి నుంచి గెలిచిన కార్పొరేటర్ సాయిజన్ శాంతిశేఖర్ ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకొన్నారు. ఈసారి ఆ పది సీట్లను క్లీన్ స్వీప్ చేయాలని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. మేయర్ బొంతు రామ్మోహన్ ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో.. పదికి ఒక్కటి తక్కువైనా కుదిరేది లేదన్న పట్టుదలతో టీఆర్ఎస్ కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే అధిష్ఠానం అచితూచీ టికెట్లు కేటాయించింది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిటింగులను తొలగించి వారి స్థానంలో కొత్తవారికి చోటు ఇచ్చింది.
నియోజకవర్గంపై బేతి పట్టు
ఈ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా గెలిచిన బేతి సుభా్‌షరెడ్డి, పార్టీపై స్థానికంగా పట్టు సాధించేందుకు గాను కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించారు. కార్పొరేటర్లను కాదని, ప్రతి డివిజన్‌లోనూ తనకుంటూ కొందరు నమ్మకస్థులు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. డివిజన్లవారీగా పార్టీపై పట్టు సాధించిన ఆయన ప్రస్తుత గ్రేటర్ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడంలో విజయం సాధించారు. ఉప్పల్, చిలుకానగర్ డివిజన్ల విషయంలో తన అనుచరులకే టిక్కెట్ కేటాయించాలని కేటీఆర్ వద్ద బేతి పట్టుబట్టినట్లు సమాచారం. ఈ రెండు డివిజన్ల సిటింగ్ కార్పొరేటర్లపై సర్వే ప్రతికూలంగా రావడం బేతి సుభా్‌షకు కలిసి వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేను కాదని టికెట్ కేటాయిస్తే గెలుపుపై ప్రభావం పడుతుందన్న ఆలోచనతో.. ఆయన అనుచరులైన అరటికాయల భాస్కర్ సతీమణి శాలినికి ఉప్పల్, మరో అనుచరుడైన బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ సతీమణికి చిలుకానగర్ టికెట్‌ను పార్టీ కేటాయించిందని అంటున్నారు. రామంతాపూర్, నాచారం డివిజన్లలో మాత్రం బేతి అనుచరులకు టికెట్‌ను ఇప్పించుకోలేకపోయారు. మరోవైపు.. ఆయన తన అనుచరులుగా భావించిన తవిడబోయిన గిరిబాబు, మేడల మల్లికార్జున్ గౌడ్లు తమ కుటుంబీకులను కాంగ్రెస్ నుంచి బరిలోకి దించడం సుభా్‌షరెడ్డికి మైనస్ అయింది. హెచ్‌బీ కాలనీ విషయంలో గొల్లూరి అంజయ్యపై సర్వే ప్రతికూలంగా రావడంతో ఆయన స్థానంలో ప్రభుదా్‌సకు టిక్కెట్ కేటాయించారు.
ఐదు డివిజన్లలో పోటాపోటీ
నియోజకవర్గంలోని పది డివిజన్లకు గాను ఐదింటిలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ముగ్గురు సిటింగ్‌లకు టికెట్ నిరాకరించిన టీఆర్ఎస్, మిగిలిన స్థానాల్లో సిటింగులకే టికెట్లు కేటాయించింది. చర్లపల్లి డివిజన్లో మేయర్ బొంతు రామ్మోహన్‌కు బదులు ఆయన సతీమణి శ్రీదేవికి టిక్కెట్ ఇచ్చారు. ఉప్పల్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి అరటికాయల భాస్కర్ సతీమణి శాలినికి కాంగ్రెస్ అభ్యర్థి మాజీ కార్పొరేటర్ మందుముళ్ల పరమేశ్వర్‌రెడ్డి సతీమణి రజితారెడ్డికి మధ్య పోటీ తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. చిలుకానగర్ డివిజన్లో టీఆర్ఎస్ విజయం తమదే అన్న ధీమాతో ఉంది. అయితే, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మేకల బీనారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ మేకల శివారెడ్డి కోడలు కావడం, ఆయనకు బస్తీలతో పాటు కాలనీల్లో గట్టి పట్టు ఉండడం గమనార్హం. ఇక బీజేపీ సంప్రదాయ ఓట్లు, యువత తనను గెలిపిస్తాయని బీజేపీ అభ్యర్థి గోనె శైలజాశ్రీకాంత్ ధీమాగా ఉన్నారు. నాచారంలో డివిజన్లో టీఆర్ఎస్ సిటింగ్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్‌కు, కాంగ్రెస్ అభ్యర్థి మేడల జ్యోతి మల్లికార్జున్‌గౌడ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. రామాంతపూర్ డివిజన్లో టీఆర్ఎస్ సిటింగ్ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వర్రావుకు, కాంగ్రెస్ అభ్యర్థి తవిడబోయిన సౌమ్య గిరిబాబు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక ఏఎ్‌సరావునగర్ డివిజన్లో టీఆర్ఎస్ సిటింగ్ కార్పొరేటర్ పావని రెడ్డికి, కాంగ్రెస్ అభ్యర్థి శిరీషా సోమశేఖర్‌రెడ్డికి మధ్య గట్టి పోటీ నెలకొంది. మిగతా ఐదింటిలో హబ్సిగూడ టీఆర్ఎస్ అభ్యర్థి బేతి స్వప్నారెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థి ఉమాసుధాకర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి చేతన హరీ్షలు గట్టి పోటీనిస్తున్నారు. మల్లాపూర్, హెచ్‌బీకాలనీ, చర్లపల్లి, కాప్రా డివిజన్లలో టీఆర్ఎస్ గెలుపు అంత కష్టమేమి కాదని పార్టీలు భావిస్తున్నాయి.
చెమటోడుస్తున్నమేయర్
చర్లపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచి మేయర్ పీఠమెక్కిన బొంతు రామ్మోహన్, ఈసారి ఎన్నికల్లో తన సతీమణి శ్రీదేవిని రంగంలోకి దించారు. రెబల్స్‌ను బుజ్జగించడంతో పాటు అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన స్థానికేతరులు అనే వాదనను సద్దుమణిగేలా చేయడంలో ఆయన విజయం సాధించారు. డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికి స్థానికుడు కాదనే ప్రచారాన్ని ఎదు ర్కొని తన సతీమణిని గెలిపించేందుకు ఆయన చెమటోడుస్తున్నారు. గెలిస్తే బొంతు శ్రీదేవికి మేయర్ పీఠం దక్కే అవకాశం లేకపోలేదని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.