ఆయన ఓటమి వెనుక నా ప్రమేయం లేదు : టీఆర్ఎస్ ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-12-06T14:27:40+05:30 IST
5 వేల ఓట్లను ముషీరాబాద్ డివిజన్లో

హైదరాబాద్/రాంనగర్ : రాంనగర్ డివిజన్ పరిధిలోని ఐదు బూత్‌లను ముషీరాబాద్ డివిజన్లో కలిపిన విషయంలో తన ప్రమేయమేమీ లేదని, అది అధికారుల తప్పిదమని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. తన డివిజన్‌కు చెందిన మేదరబస్తీ, శాస్ర్తినగర్, జెమినీకాలనీ, హోలీట్రినిటీ స్కూల్ వీధి ప్రాంతాల్లోని ఐదు బూత్‌లకు చెందిన సుమారు 5 వేల ఓట్లను ముషీరాబాద్ డివిజన్లో కలిపి, తన ఓటమికి ఎమ్మెల్యే కుట్ర చేశారని రాంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి వి. శ్రీనివాస్‌రెడ్డి చేసిన ఆరోపణపై ఎమ్మెల్యే స్పందించారు. శనివారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు, డివిజన్ల సరిహద్దుల్లో ఎలాంటి మార్పు చేయకూడదని, అయితే, రాంనగర్ డివిజన్లోని ఐదు బూత్‌లను ముషీరాబాద్ డివిజన్లో ఎందుకు కలపాల్సి వచ్చిందో అధికారులు సమాధానం ఇవ్వాల్సి ఉందన్నారు.
ఈ విషయంలో తనకు ప్రమేయం ఉందని శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించడం సరైంది కాదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఎన్నికల అధికారులు డివిజన్లకు చెందిన ఓటరు లిస్ట్‌లు, పోలింగ్ బూత్‌ల వివరాలన్ని అభ్యర్థులకు పంపించారని, అప్పుడు శ్రీనివాస్‌రెడ్డి ఎందుకు గుర్తించలేకపోయారని, అప్పుడే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత తన ఓటమికి కుట్ర పన్నారని అనడం సరైంది కాదన్నారు. రాంనగర్ అభ్యర్థి విజయం కోసం తాను డివిజన్లో ప్రచారం చేయడంతోపాటు, తన వంతు సహకారం అందించానన్నారు. ప్రజాతీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.
