వరద బాధితుల సొమ్ము టీఆర్‌ఎస్ నాయకుల జేబుల్లోకి: టీపీసీసీ
ABN , First Publish Date - 2020-11-03T09:35:54+05:30 IST
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పేదలకు అందించాల్సిన ప్రభుత్వ సొమ్ము టీఆర్‌ఎస్ నాయకుల జేబుల్లోకి వెళ్లిందని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ఆరోపించారు. వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించాలని
కూకట్‌పల్లి/బాలానగర్: అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పేదలకు అందించాల్సిన ప్రభుత్వ సొమ్ము టీఆర్‌ఎస్ నాయకుల జేబుల్లోకి వెళ్లిందని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ఆరోపించారు. వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి జోనల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యక్రమంలో శ్రీరంగం మాట్లాడారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో రూ.35కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతుండగా.... సగం డబ్బుకూడా బాధితులకు అందలేదని ఆయన ఆరోపించారు.
కూకట్‌పల్లి : కూకట్‌పల్లి ప్రాంతంలోని వరద బాధితులందరికీ ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి విజిత్‌వర్మ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ వి.మమతకు వినతిపత్రం అందజేశారు.
అల్లాపూర్: భారీ వర్షాల కారణంగా పలు విధాలుగా నష్టపోయామంటూ, ఇటు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల ఆర్థిక సాయం తమకు అందలేదంటూ వారం రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. శ్రీ వివేకానంద నగర్‌లోని వార్డు కార్యలయం ఎదుట సోమవారం భారీ సంఖ్యలో మహిళలు ధర్నాకు దిగారు. వార్డు కార్యాలయం బయట గంటల తరబడి ధర్నా చేశారు. పోలీసులు రంగంలోకి దిగి మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సబీహా బేగం బాధితులందరికీ రిలీఫ్ ఫండ్ సాయం అందేలా కృషి చేస్తానన్నారు.
స్వచ్ఛంద సంస్థల సాయం
అల్లాపూర్: ప్రభుత్వం తరఫున రిలీఫ్ పండ సాయం అందని బాధితులకు స్వచ్ఛంద సంస్థలు బాసటగా నిలుస్తున్నాయి. లోక్ సత్తా ఎన్నారై ఆధ్వర్యంలో వరద భాధితులకు నిత్యావసర వస్తువులు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో లోక్ సత్తా కూకట్‌పల్లి అధ్యక్షుడు వంశీ ప్రశాద్, లైయన్‌స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్, చిల్కూర్ బాలాజీ వారు పాల్గొన్నారు.
సర్కిల్ అధికారులకు కాంగ్రెస్ నేతల వినతి
బాలానగర్/ఫతేనగర్: వరద ముప్పునకుగురైన బాధితులకు వెంటనే నష్ట పరిహారం అందజేసి ఆదుకోవాలని బాలానగర్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్, ప్రవీణ్, రాము, వాణి, రవికుమార్ నవీన్‌రెడ్డి కూకట్‌పల్లి సర్కిల్ ఉప కమిషనర్ ప్రశాంతికి వినతి పత్రం అందజేశారు. ఫతేనగర్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు రమేష్, రాజూముదిరాజ్, సూరజ్ తివారీ, వరాల స్వామి, క్రాంతి రాము, కిరణ్, శివ, రహీం మనోహర్‌లు మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ రవికుమార్‌గౌడ్‌కు వినతి పత్రం అంజేశారు.
కార్యాలయాలకు వరద బాధితుల క్యూ
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల కార్యాలయాలకు వరద బాధితుల తాకిడి తగ్గడం లేదు. ప్రతి రోజూ జంట సర్కిళ్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో ముంపునకు గురైన బాధితులు ప్రభుత్వం అందజేస్తున్న రూ.10వేలు తమకు అందలేని కార్యాలయాల వద్ద క్యూ కడుతున్నారు. వీరిలో మహిళలే అధికంగా ఉండడం విశేషం. నష్ట పరిహారం అందని వారు సదరు ప్రాంతంలోని బాధితులను కూడగట్టుకొని వారి ఆధార్‌కార్డులు, ముంపునకు గురైన ఫొటోలతో వచ్చి నిరసనలు, ధర్నాలతో అధికారులను నిలదీస్తున్నారు.
ఈ సందర్భంగా సోమవారం సర్కిల్ కార్యాలయానికి వచ్చిన శివాలయనగర్ మహిళలు మాట్లాడుతూ బస్తీలో నిజమైన బాధితులకు కాకుండా ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గల్లీ లీడర్లు చూపిన వారికే అధికారులు నగదు పంపిణీ చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అమ్మా...అయ్యా... అంటూ అభర్థించడానికి వచ్చిన నాయకులు ఇప్పుడు ఏమయ్యారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నష్టపోయిన వారికే సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.