నేడే బక్రీద్‌

ABN , First Publish Date - 2020-08-01T10:25:53+05:30 IST

త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ పండగను పురస్కరించుకుని మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు

నేడే బక్రీద్‌

మసీదుల్లో ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు


ముషీరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ పండగను పురస్కరించుకుని మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. 400 సంవత్సరాల చరిత్ర గల భోలక్‌పూర్‌లోని బడీ మసీదులో శనివారం ఉదయం 7 గంటలకు ప్రార్థనలు జరుగుతాయని ముతావలి నజీర్‌ఆలీ తెలిపారు. స్థానికులతోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రార్థనలు చేసేందుకు తరలివచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. నియోజకవర్గంలో ప్రసిద్ది గాంచిన బిలాల్‌ మసీదు, మజీదో కో, ఫీర్జోద్‌, గుల్షన్‌నగర్‌ మసీదుల వద్ద జీహెచ్‌ఎంసీ, జలమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముషీరాబాద్‌ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


తగ్గిన మేకల అమ్మకాలు

బక్రీద్‌ పండగకు మేకలను వధించి మూడు భాగాలుగా చేసి మాంసాన్ని బంధువులు, పేదలు, స్నేహితులకు పంపిణీ చేస్తారు. ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్‌ వల్ల మేకల అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. కరోనా భయం, ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో మేకలను కొనుగోలు చేసేందుకు ముస్లింలు ఆసక్తి చూపలేదు. దీనికి తోడు మేకల దిగుమతి కూడా తగ్గిపోవడంతో నియోజకవర్గంలో నాలుగైదు చోట్ల మాత్రమే మేకలను విక్రయించారు.


కొంతమంది మేకలను కొనుగోలు చేసినప్పటికీ వాటి ధరలు గతంతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయని స్థానికుడు షాహేద్‌ అన్నాడు. పది కిలోల నుంచి పన్నెండు కిలోల మాంసం ఉన్న మేకలు రూ. 7 వేల నుంచి రూ. 8 వేలకు విక్రయించారు. 12 నుంచి 15 కిలోలు ఉన్న మేకలను రూ. 15 నుంచి రూ. 18 వేలకు విక్రయించారు. ఇతర రాష్ట్రాల నుంచి మేకల దిగుమతి లేకపోవడం వల్ల ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. 


భౌతికదూరం పాటించకుండా పొట్టేళ్ల అమ్మకాలు 

ఓల్డ్‌బోయిన్‌పల్లి: ఓల్డ్‌బోయిన్‌పల్లిలో పొట్టేళ్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో వ్యాపారులు, కొనుగోలు దారులు భౌతికదూరం పాటించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2020-08-01T10:25:53+05:30 IST