హాఫెజ్‌లకు ఈసారి పారితోషికాలు లేనట్టే..

ABN , First Publish Date - 2020-04-24T11:13:27+05:30 IST

రంజాన్‌ మాసం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలకు ప్రార్థనలకూ ఎంతో ప్రాధాన్యం

హాఫెజ్‌లకు ఈసారి పారితోషికాలు లేనట్టే..

మసీదుల్లో తరావీ నమాజులు లేకపోవడంతో ఇళ్లకే పరిమితం


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): రంజాన్‌ మాసం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలకు ప్రార్థనలకూ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి రోజూ 5పూటల చేసే నమాజులతో పాటు రాత్రిపూట జరిపే ప్రత్యేక ప్రార్థనల(తరావీ నమాజు)కు ప్రాధాన్యమిస్తారు. ప్రతి మసీదుతో పాటు... కొన్ని ఫంక్షన్‌హాళ్లు, ఇతర ప్రదేశాల్లోనూ తరావీ ప్రార్థనలు జరుగుతుంటాయి. కరోనా కట్టడిలో భాగంగా ఈ ఏడాది తరావీ నమాజులు ఇళ్లల్లోనే చేసుకోవాలని పలు ముస్లిం మత ప్రాతినిధ్య కమిటీలు ఆదేశాలు జారీ చేశాయి.


ముస్లింలు కూడా దీనికి సమ్మతించడంతో ఈ ఏడాది మసీదుల్లో తరావీ నమాజు జరగదు. ఆయా నమాజులకు హాఫెజ్‌లు (ఖురాన్‌ కంఠస్థంగా చదివే వారు) ముందుండి నాయకత్వం వహిస్తారు. ఒక్కో మసీదులో నిర్ణయించిన రోజుల ఆధారంగా హాఫెజ్‌లు తరావీలో ఖురాన్‌ చదువుతుంటారు. దానికోసం ప్రతి మసీదులో వారికి ప్రత్యేకంగా డబ్బులు, కానుకలు, దుస్తులను అక్కడికి హాజరయ్యే వారు ఇస్తారు.  మసీదు కమిటీ తరఫున కూడా వారికి ప్రత్యేకంగా పారితోషికం అందజేస్తారు.


చాలా చోట్ల హాఫెజ్‌లు డిమాండ్‌ చేయకున్నా.. రంజాన్‌ చివరికల్లా వారికి వేల నుంచి లక్షల రూపాయల వరకు అందుతుంటాయి. నగరంలో హాఫెజ్‌ల సంఖ్య భారీగానే ఉన్నప్పటికీ... వారిలో సుమారు 10వేల మంది రంజాన్‌ తరావీలో ఖురాన్‌ వినిపించడంలో బిజీగా ఉంటారు. తరావీ అవకాశాలు లేనందున ఈ ఏడాది వారందరికీ ఉపాధి లేనట్టే. 

Updated Date - 2020-04-24T11:13:27+05:30 IST