ఈ నలుగురూ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి..
ABN , First Publish Date - 2020-12-10T16:20:03+05:30 IST
ప్రజాప్రతినిధిగా కావడం అందరికీ సాధ్యం కాదు. ఎన్నో ఏళ్లు కష్టపడితే

- నిన్న కార్యకర్త.. నేడు కార్పొరేటర్..
- మొదటి ప్రయత్నంలోనే విజయం
హైదరాబాద్/బంజారాహిల్స్ : ప్రజాప్రతినిధిగా కావడం అందరికీ సాధ్యం కాదు. ఎన్నో ఏళ్లు కష్టపడితే తప్ప విజయం దరిచేరదు. కానీ, కొందరికి అనుకోకుండా అవకాశం వస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అధికార పార్టీతోపాటు బీజేపీ నుంచి కార్పొరేటర్లుగా ఎన్నికైన నలుగురు అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
చిన్నవయస్సులోనే..
కృష్ణానగర్‌కు చెందిన రాజ్‌కుమార్ పటేల్ చిన్న వయస్సులోనే రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యాడు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను చూస్తూ ఎదిగిన రాజ్‌కుమార్ మూడేళ్ల క్రితం టీఆర్‌ఎస్ క్రీయాశీలక సభ్యుడిగా చేరాడు. యూసుఫ్‌గూడ డివిజన్ యువకులతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఏడాది క్రితం టీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. సిట్టింగ్ కార్పొరేటర్ ఉన్నప్పటికీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ వైపు మొగ్గు చూపించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజ్‌కుమార్ పటేల్ మూడు వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.
రెండేళ్ల క్రితం పార్టీలోకి..
రహ్మత్‌నగర్‌కు చెందిన సీఎన్ రెడ్డి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే పనులు పర్యవేక్షిస్తుంటారు. రెండేళ్ల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో వినూత్నంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను ఆకట్టుకున్నారు. అనంతరం లాక్‌డౌన్ సమయంలో కూడా పలు కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు. తాజా ఎన్నికల్లో రహ్మత్‌నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి రికార్డుస్థాయి మెజారిటీతో విజయం సాధించారు.
గృహిణి నుంచి..
వెంగళరావునగర్ డివిజన్‌కు చెందిన దేదీప్యరావు కొద్ది కాలం క్రితం టీఆర్‌ఎస్ నాయకుడు విజయ్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కొద్దికాలం సాంస్కృతిక కార్యక్రమాలు పర్యవేక్షించారు. వెంగళరావునగర్ డివిజన్‌లో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ డివిజన్ అధ్యక్ష పదవి దక్కింది. అలాగే, గ్రేటర్ ఎన్నికల్లో సిట్టింగ్ కార్పొరేటర్ పార్టీ మారడంతో దేదీప్యరావుకు టికెట్ ఖరారైంది. ఆమె మూడు వేల మెజారిటీతో విజయం సాధించారు.
సేవతో బల్దియాకు..
ఫిలింనగర్ వినాయకరావునగర్‌కు చెందిన వెల్దండ వెంకటేష్ కాంట్రాక్టర్. కరోనా, లాక్‌డౌన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. మురికివాడల్లోని కుటుంబాలకు దగ్గరయ్యారు. దీంతో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆయనను బీజేపీలోకి ఆహ్వానించారు. పార్టీ తరఫున జూబ్లీహిల్స్ డివిజన్ నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో విజయం సాధించారు.