పిల్లలను తీసుకెళ్తున్నారా.. జాగ్రత్త

ABN , First Publish Date - 2020-06-11T10:43:33+05:30 IST

దేశంలో, రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ పెరిగిపోతున్న పాజిటివ్‌ కేసులతో ప్రజలందరూ గజగజ వణికిపోతున్నారు.

పిల్లలను తీసుకెళ్తున్నారా.. జాగ్రత్త

రైలు ప్రయాణంలో అప్రమత్తత అవసరం

శానిటైజర్‌, మాస్కులను మరిచిపోవద్దు

బయటి నీరు తాగొద్దు 

దూర ప్రాంతాలకు రిజర్వేషన్‌ తప్పనిసరి

తల్లిదండ్రులకు డాక్టర్ల సూచన


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): దేశంలో, రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ పెరిగిపోతున్న పాజిటివ్‌ కేసులతో ప్రజలందరూ గజగజ వణికిపోతున్నారు. అత్యవసర పనులకు మాత్రమే ఇంటినుంచి బయటకు రావాలని, వ్యాపారాలు, ఉద్యోగాలకు వెళ్లే వారు మాస్కులు, గ్లౌజులు వేసుకుని కనీస జాగ్రత్తలు పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రెండున్నర నెలలుగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌లో కేంద్ర ప్రభుత్వం వరుస సడలింపులు చేస్తూ వస్తోంది. రవాణా మార్గాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తుండడంతో నగరం నుంచి వివిధ ప్రాంతాలకు నిత్యం వేలాది మంది మళ్లీ ప్రయాణాలు చేస్తున్నారు.


అంతర్రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులు లేకపోవడంతో చాలామంది రైలు ప్రయాణాలు ఎంచుకుంటున్నారు. దేశంలో జడలు విప్పిన కరోనా నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో రైళ్లలో వెళ్తున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధానంగా పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే వైరస్‌ బారిన పడాల్సి వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం, ఏమరుపాటుతో ముందుకుసాగితే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడుతోందని వారు పేర్కొంటున్నారు. నాలుగో విడత లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా జూన్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలు ప్రారంభమైన విషయం తెలిసిందే. దక్షిణ మధ్య రైల్వే నుంచి రోజుకు సగటున 8 నుంచి 10 రైళ్లు వివిధ రాష్ర్టాలకు నడుస్తున్నాయి. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల నుంచి వారం నుంచి రోజుకు 6 నుంచి 7 వేల మంది వివిధ ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. 


స్టేషన్లలో థర్మల్‌ స్ర్కీనింగ్‌

దేశ వ్యాప్తంగా రైళ్ల రాకపోకలు ప్రారంభమవడంతో దక్షిణ మధ్య రైల్వేలోని ప్రధాన స్టేషన్లలో కొద్ది రోజులుగా థర్మల్‌ స్ర్కీనింగ్‌ నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు రిజర్వేషన్‌ చేసుకుని వందలాదిగా వెళ్తున్న ప్రయాణికులను ముందస్తుగా థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తున్నారు. జ్వరం ఉన్నట్లు తేలితే ఇంటికి పంపిస్తున్నారు. రైళ్లు ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటి వరకు దాదాపు 600 మందిని థర్మల్‌ స్ర్కీనింగ్‌తో పరీక్షించి వెనక్కి పంపించినట్లు తెలిసింది. గతంలో 5 నుంచి ఏడేళ్ల పిల్లలను సైతం తల్లిదండ్రులు టికెట్‌ లేకుండానే తమ వెంట తీసుకెళ్లేవారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐదేళ్లు దాటిన పిల్లలకు రిజర్వేషన్‌ చేయించాలని, లేకపోతే రైళ్లలోకి అనుమతించేది లేదని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. 


జాగ్రత్తలు

దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పిల్లలను తమవెంట తీసుకెళ్లకపోవడం ఉత్తమం.

ఐదేళ్ల పైబడిన పిల్లలను తీసుకెళ్తుంటే ఎన్‌-95 లాంటి మాస్కులు తప్పకుండా వాడాలి. పలుచటి వస్త్రంతో తయారు చేసిన మాస్కులతో వైర్‌సను ఆపే పరిస్థితి ఉండదు. టికెట్‌ రిజర్వేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లో మరవద్దు.

ప్రయాణంలో ప్రతి అరగంటకోసారి తల్లిదండ్రులు తమతోపాటు పిల్లల చేతులను శానిటైజ్‌ చేయించాలి. బోగీల్లోని కిటికీలు, అద్దాలు, వాష్‌బేసిన్లను చేతులతో ముట్టుకోకుండా చూడాలి. లేకపోతే అప్పటికే వాటిపై చేరిన వైరస్‌ చేతులకు అంటుకుని సులువుగా శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.

దూర ప్రాంతానికి వెళ్తున్న ప్రయాణికులు ఇంటినుంచి కాచి చల్లార్చిన నీటిని తమవెంట తప్పకుండా తీసుకెళ్లాలి. బయటి నీరు తాగితే అనారోగ్యానికి గురవుతారు.

పిల్లలు అలసటగా ఉంటే వారిని ఇంటివద్దే ఉంచాలి. ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలి. 0-5 ఏళ్లలోపు పిల్లలతో ప్రయాణం చేయకపోవడం శ్రేయస్కరం.

ఆరోగ్యంగా ఉంటేనే, అత్యవసర పనులకే ప్రయాణాలు చేయడం ఉత్తమం.

బోగీల్లో ఎవరైనా తుమ్మినా, దగ్గినా వారి సమాచారాన్ని రైల్వే అధికారులకు అందజేయాలి.

Updated Date - 2020-06-11T10:43:33+05:30 IST