గరీబోళ్ల బతుకులు ఆగం..!

ABN , First Publish Date - 2020-04-08T09:35:32+05:30 IST

‘‘గల్లీ సిన్నదీ గరీబోల్ల కథ పెద్దది.. వాళ్లున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నవి..’’ అంటాడు ప్రముఖ కవి గోరటి వెంకన్న. భాగ్యనగరంలో కొన్ని వందల మురికివాడలున్నాయి. అన్‌ నోటిఫైడ్‌ స్లమ్స్‌ కూడా

గరీబోళ్ల బతుకులు ఆగం..!

దయనీయంగా పరిస్థితి

అవగాహనా కరువు.. ఆదుకునేదెవరు?


‘‘భాగ్యనగర ఒడిలో నిరుపేద వాడలెన్నో. ఈ విపత్తువేళ బస్తీ బతుకులు మరింత దయనీయంగా మారాయి. పరిశుభ్రత మాట దేవుడెరుగు, శుభ్రతకి నీళ్లు, సబ్బు లేని దుస్థితి. పిట్టగూడంత పరదా ఇళ్లలో భౌతిక దూరం సాధ్యమేనా.! లాక్‌డౌన్‌తో బడుగుజీవుల బతుకు భారంగా మారింది. ముడుచుకున్న డొక్కల్లోని పేగుల అరుపులతో వాళ్లకి ప్రతి పూటా పరిహాసమే. మహానగరంలోని ఒక మురికివాడ వాసులతో ‘ఆంధ్రజ్యోతి’ ముచ్చటించింది. 


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): 

 ‘‘గల్లీ సిన్నదీ గరీబోల్ల కథ పెద్దది.. వాళ్లున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నవి..’’ అంటాడు ప్రముఖ కవి గోరటి వెంకన్న. భాగ్యనగరంలో కొన్ని వందల మురికివాడలున్నాయి. అన్‌ నోటిఫైడ్‌ స్లమ్స్‌ కూడా  ఉన్నాయి. అందులో నివసించే వారి పరిస్థితి మరీ దయనీయం. విరిగిన చెక్కలే గోడలుగా, ప్లాస్టిక్‌ పరదాల కప్పుతో నిర్మించుకొన్న ఇల్లుకాని ఇంట్లో ఆవాసం. రోళ్లు పగిలే ఎండైనా, ఎముకలు కొరికే చలి అయినా అందులో ముడుచుకోవాల్సిందే. ‘‘ఇలాంటి మురికివాడలు నగరంలో ఎన్ని ఉంటాయో కచ్చితంగా చెప్పలేం. కానీ, సుమారు ఆరు లక్షల మంది వరకు ఉంటార’’ని హైదరాబాద్‌ అర్బన్‌ ల్యాబ్స్‌ వ్యవస్థాపకుడు డా. అనంత్‌ మరింగంటి చెబుతున్నారు. మోతీనగర్‌లోని ఒకపెద్ద డంపింగ్‌ యార్డు పరిసరాల్లో సుమారు 280 కుటుంబాలు ఉన్నాయి. వారందరి జీవనాధారం చెత్తకాగితాలు ఎరడం, జల్లెళ్లు, రోళ్లు, రాగి ఉంగరాలు, కడియాలు తయారు చేసి అమ్మడం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బస్తీదాటి బయటకు వెళ్లలేని పరిస్థితి. రోజూవారీ సంపాదనతో పొట్టపోసుకొనే వాళ్ల జీవితాల్లో కరోనా తీవ్ర కలవరం సృష్టించింది. నాలుగువేళ్లు నోట్లోకెళ్లేందుకు ప్రతీపూటా ఓ సమరమే. 


నీళ్లే లేవు.. చేతులు కడుక్కోవడం ఎలా..వెంకమ్మ.

కరోనాని నియంత్రించేందుకు సబ్బుతో చేతులు కడుక్కోవడం తప్పనిసరి. ‘‘రోజుకి ఎన్నిసార్లు చేతులు సబ్బుతో శుభ్రం చేసుకుంటున్నారు’’ అన్న ప్రశ్నకు బస్తీకి చెందిన వెంకమ్మ చెప్పిన సమాధానం...‘‘చేతులు కడుక్కోడానికి నీళ్లే లేవు. ఇక మాతాన స్నానం చేయనీకి కూడా చానామంది సబ్బులు వాడరు. రెండు రోజులకొకపాలి ట్యాంకర్‌ వస్తది. అప్పుడు దొరికినోళ్లకి రెండు బకెట్లు అట్లా వస్తయి.’’ అని చెప్పింది. 


సూలాలకీ అన్నం పెట్టలేకున్నా.. అనిత, తల్లి అంజమ్మ.

ఆపద వేళ ప్రభుత్వ పథకాలేవైనా అందుతాయా అని అడిగితే, ‘‘మా బస్తీలో అందరికీ ఓటరు కార్డులున్నాయి. ఒక పది కుటుంబాల దాంకా రేషనుకార్డులుంటాయి. తక్కినోళ్లకి ఆధార్‌కార్డులు కూడా లేవు. పదిరోజుల నుంచి ఇంటికాడనే ఉన్నం. మా రాజులెవరైనా వచ్చి బియ్యం, కూరగాయలు ఇస్తున్నరోజు ఇంటిల్లపాది తింటున్నాం. నా కూతురికి ఇప్పుడు తొమ్మిదవ నెల. నిండు సూలలకి కడుపునిండా బువ్వపెట్టలేకున్నా’’ అని అంజమ్మ ఆవేదన వెలిబుచ్చారు. 


కరోనా గురించి తెలియదు..నర్సమ్మ

‘కరోనా గురించి తెలుసా? ’ అని బస్తీవాసులను అడిగినప్పుడు...అందులో  కొందరు  తెలియదని సమాధానమిచ్చారు. మరికొందరు ‘టీవీల్లో చెబుతున్నరు, ఆ జబ్బువస్తే మనుషులు సచ్చిపోతరంట’ అని చెబుతున్నారు. స్థానిక మహిళ నర్సమ్మ మాట్లాడుతూ..‘‘మాకేమి తెల్వదు. కరోన వల్ల జనం మస్తుమంది సచ్చిపోతుండ్రు. మూతికి బట్ట కట్టుకోవాలె. చేతులు మంచిగ కడుక్కోవలె అని ఒకసారు వచ్చి చెప్పిండు. ముసలోళ్లకి ఒక్కొక్కరికి మాస్కులు, సబ్బులు ఇచ్చిండ్రు. గానీ అవేమీ మేం చేయలేకున్నం. యాడ చేస్తం.! పనులు బంద్‌ అయిన నాటినుంచి, ఇల్లు గడిసేదెట్ల అనే దిగులే ఎక్కవైంది. స్కూలుంటే పిల్లలకు అక్కడే మంచిగ అన్నం పెట్టేటోళ్లు. రేషన్‌ బియ్యం మాకూ ఇప్పిస్తే పిల్లలకన్నా కడుపునిండా పెట్టుకుంటాం’’ అన్నారు. 


మావోళ్లకి మంచిగ చెబుతారా.!..విజేత

బస్తీలోని పెద్దలకు కరోనా ప్రమాదంపై అవగాహనలేదు. కానీ. అదే వాడకి చెందిన చిన్నారి విజేత మాత్రం కాస్త ఆందోళనపడుతోంది. ఆమె ఇప్పుడు ఆరో తరగతి. ‘‘మా వాళ్లకేమీ తెల్వదు. చాలామంది రోజూ స్నానం కూడా చేయడం లేదు. ఒకరికొకరు దూరంగా కూర్చోరు. చెప్పినా వినరు. అదేమంటే ఏమైతది అంటారు. దగ్గేటప్పుడు, తమ్మేటప్పుడు చేతులు అడ్డుపెట్టుకోవడం కూడా చేయట్లేదు. పెద్దవాళ్లు ఎవరైనా మా బస్తీలోని వారందరినీ కూర్చోబెట్టి, అర్థమయ్యేటట్లు మంచిగ చెబితే బావుంటుంది’’ అని  కోరుతోంది. 


 వృద్ధుల పరిస్థితి దయనీయం..!

 మురికివాడలో చాలామంది వృద్ధులు ఉన్నారు. వారిలో కొంతమంది యాచకవృత్తిపై ఆఽధారపడ్డవారే. అయితే, డెభ్భై ఏళ్లు నిండిన వారి పరిస్థితి మరీ దయనీయం. వారికి వృద్ధాప్య పింఛను కూడా రాదు. ఓటరు కార్డు తప్ప, మరేమీ లేనివాళ్లకి ప్రభుత్వ పథకాలు అందుతాయా.? ‘‘ఎలక్షన్లప్పుడు మాత్రం ఓట్లేయమని అందరూ తిరిగిపోతరు. మాకు రేషన్‌కార్డులు మాత్రం ఇప్పియ్యరు’’ అని ఎల్లమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


జాగ్రత్తలు చెబితే కోపం...!..రాజు, అంబాజీ, పప్పు 

‘‘ఇదివరకు రోజూ ఆరు, ఏడు జల్లెళ్లు అమ్మేటోడిని. దాంతో ఇంటి ఖర్చులెల్లేవి. పదిరోజుల నుంచి పనిలేదు. చిన్నపిల్లలున్నరు. మేమంతా బతికేదెట్టా అని  గుబులైతాంది. బీమారొచ్చినా దావఖానాకి పోలేకున్నం. సర్ది అయినోళ్లు జర జాగ్రత్తగ ఉండుర్రి. ఎక్కడపడితే అక్కడ ఉమ్మకుండ్రి. చీదకుండ్రి అని చెబుతుంటే, చానా మంది పెద్దోళ్లు కోపం చేస్తున్నరు. అలా చెబుతుంటే, వాళ్లని అవమానించినట్టుగా ఫీలవుతుండ్రు’’ అని బస్తీ యువకులు రాజు, అంబాజీ చెబుతున్నారు.


అవగాహన కల్పించాలి

‘ప్రస్తుత పరిస్థితుల్లో నగరంలోని ఇలాంటి మురికివాడలను గుర్తించాలి. అక్కడివారందరికీ నిత్యవసరాలతోపాటూ నీళ్లు, సబ్బులు అందాలి. కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పించడం అత్యవసరం’ అని బస్తీలపై పరిశోధన చేస్తున్న ఇండీవర్‌ జొన్నలగడ్డ సూచిస్తున్నారు. 

Updated Date - 2020-04-08T09:35:32+05:30 IST