నాలాలో పసిపాప మృతదేహం... గోడ కూలి మరో చిన్నారి మృతి

ABN , First Publish Date - 2020-10-13T08:15:16+05:30 IST

పాత ఇల్లు కూల్చివేత పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. గోడ కూలి కుటుంబంలోని ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, చిన్నారి మృతి చెందింది.

నాలాలో పసిపాప మృతదేహం... గోడ కూలి మరో చిన్నారి మృతి
చిన్నారి జయశ్రీ (ఫైల్ ఫొటో)

 గోడ కూలి చిన్నారి మృతి

 పాత ఇల్లు కూల్చివేత పనుల్లో అపశృతి

 మరో బాలిక, వృద్ధురాలికి తీవ్రగాయాలు 

సంజయ్‌నగర్‌లో విషాదఛాయలు

కవాడిగూడ/రాంనగర్‌, అక్టోబర్‌ 12(ఆంధ్రజ్యోతి): పాత ఇల్లు కూల్చివేత పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. గోడ కూలి కుటుంబంలోని ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, చిన్నారి మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన చిక్కడపల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని బాగ్‌లింగంపల్లి సంజయ్‌నగర్‌లో జరిగింది. సంజయ్‌నగర్‌లో నివాసం ఉండే కాంగ్రెస్‌ బస్తీ నాయకుడు జయకృష్ణ (బబ్లూ), బేబి భార్యాభర్తలు. వీరికి ఐదుగురు కుమార్తెలు. అనారోగ్యంతో భార్య ఐదేళ్ల క్రితమే చనిపోయింది.


జయకృష్ణ బస్తీలోని తన పాత ఇంటిని కూల్చివేసి కొత్త ఇల్లు నిర్మించే పనులు చేయిస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటి రేకులను తొలగించారు. వర్షాలతో రెండు రోజులుగా కూల్చి వేత పనులను నిలిపివేశారు. సోమవారం ఇల్లు కూల్చివేత పనులు మళ్లీ చేపట్టారు. దారికి అడ్డంగా ఉన్న ఇటుకలు, మట్టికుప్పలను జయకృష్ణ తల్లి విజయలక్ష్మి (63), ఆయన నాలుగో కూతురు దివ్యశ్రీ(8), ఐదవ కూతురు జయశ్రీ (7) తొలగిస్తుండగా 11 గంటల ప్రాంతంలో గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో జయశ్రీ అక్కడికక్కడే మృతి చెందింది. విజయలక్ష్మి తలకు గాయాలుకాగా, దివ్యశ్రీకి నడుము విరిగిపోయి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న బస్తీవాసులు గాయపడ్డ వారిని విద్యానగర్‌లోని ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రికి తరలించారు. చిక్కడపల్లి పోలీసులు జయశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ కోటేష్‌ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


నాలాలో పసిపాప మృతదేహం...


కుషాయిగూడ, అక్టోబర్‌ 12 (ఆంధ్రజ్యోతి) : ఇంకా బొడ్డు కూడా కత్తిరించలేదు... కళ్లు పూర్తిగా తెరవలేదు. ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు కానీ ఓ పసిబిడ్డ మృతదేహం నాలాలో కొట్టుకు వచ్చింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో కుషాయిగూడ శుభోదయ కాలనీలోని నాలా వద్ద జనాలు గుమిగూడారు. నీటిలో రబ్బరు బొమ్మలా కనిపిస్తున్న శిశువు మృతదేహాన్ని కొంత సేపు అనుమానంగా చూశారు. ఎవరో ధైర్యం చేసి నాలాలోని నీళ్లల్లో తేలియాడుతున్న దానిని పైకి తీశారు. అది బొమ్మ కాదు, పసిపాప మృతదేహం అని తెలిసి ఆవేదన చెందారు.

రోజుల వయసున్న పాప చనిపోతే నాలాలో పడేశారా.. లేక మృత శిశువుగా పుడితే పడేశారా.. ఆడపిల్ల అని ఇలా చేశారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాప్రా చెరువు నుంచి కాలనీల మీదుగా ఈ నాలా నాగారం అన్నంరాయి చెరువుకు చేరుకుంటుంది. ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌ ఆదేశాల మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ అనంతాచారి, ఏఎ్‌సఐ సాయన్న మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-10-13T08:15:16+05:30 IST