జరపైలం

ABN , First Publish Date - 2020-06-11T10:50:01+05:30 IST

నైరుతి రుతు పవనాలు రాష్ర్టాన్ని ముందుగానే పలకరించాయి. గత రెండు రోజులుగా మోస్తరు వర్షాలు కురవగా..

జరపైలం

ముసురులో వైరస్‌  మరింత యాక్టివ్‌

వాతావరణాన్ని బట్టి కొవిడ్‌-19 రూపాంతరం


ఒక పక్క లాక్‌డౌన్‌.. మరో పక్క ఎండలు.. అయినా కరోనా కట్టడి ఎవరి తరమూ కాలేదు. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ ఉష్ణోగ్రత.. తరచూ వాన, రోజుల తరబడి ముసురు కురిసే మాన్‌సూన్‌లో మరింత అప్రమత్తంగా     ఉండాల్సిందే. వర్షాకాలంలో సాధారణంగా ఏ వైరస్‌ అయినా శక్తివంతమవుతుంది. కరోనా కూడా తీవ్రమయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్‌కు వచ్చిన కేంద్ర బృందం కూడా.. పరిస్థితి ఇలానే ఉంటే.. జూలై చివరి నాటికి పరిస్థితి తీవ్రరూపం దాలుస్తుందని అభిప్రాయపడింది. 


భౌతిక దూరం పాటించకుంటే  ప్రమాదమే

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతు పవనాలు రాష్ర్టాన్ని ముందుగానే పలకరించాయి. గత రెండు రోజులుగా మోస్తరు వర్షాలు కురవగా.. బుధవారం ముసురు మొదలైంది. దీంతో వైరస్‌ విజృంభించే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. మార్చిలో 72 కేసులు నమోదు కాగా.. లాక్‌డౌన్‌ అమలు కొనసాగినన్ని రోజులు కేసుల నమోదు సాధారణ స్థాయిలోనే ఉంది. మేలో లాక్‌డౌన్‌ నిబంధనల్లో స్వల్ప సడలింపులను ఇవ్వగా... క్రమేణా ఆంక్షలు తొలగాయి. ప్రస్తుతం రెడ్‌, గ్రీన్‌  జోన్‌ అన్న తేడా లేకుండా అంతటా లాక్‌ ఎత్తేశారు. ఈ క్రమంలో మే రెండో వారం నుంచి కేసుల నమోదు గణనీయంగా పెరిగింది. 45 అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైనా.. వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోకి రాకపోగా.. క్రమేణా అధికమైంది. ఇది ప్రమాద ఘంటికలు మోగించడమే అని ఫీవర్‌ ఆస్పత్రికి చెందిన వైద్యుడొకరు తెలిపారు.


ముసురులో...

సాధారణంగా వాన, చలి కాలంలో ఏ వైరస్‌ అయినా యాక్టివ్‌ అవుతుంది. చలికాలంలో స్వైన్‌ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదయ్యేందుకు ఇదే కారణం. వర్షాకాలం మొదలైన నేపథ్యంలో కొవిడ్‌-19 వైరస్‌ కూడా మరింత ఉత్తేజితమవుతుందని వైద్యులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కరోనా వైరస్‌ రూపు మార్చుకుంటుంది. వేసవిలో కేసుల తీవ్రత అందుకే అని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు పేర్కొన్నారు.


జనం రద్దీగా ఉన్న ప్రాంతాల్లో వైరస్‌ ఆటోమేటిక్‌గా యాక్టివ్‌ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మాన్‌సూన్‌లో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, వైరల్‌ ఫీవర్‌ ఇతరత్రా వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. ఆయా వ్యాధులు సోకినప్పుడు  సహజంగానే మనిషిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అలాంటి వారిపై కరోనా వైరస్‌ మరింత ప్రభావం చూపుతుందని కేర్‌ ఆస్పత్రి వైద్యురాలు నవోదయ చెప్పారు. వచ్చే రెండు సీజన్లలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని హెచ్చరిస్తున్నారు. మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడంతోపాటు వాన పడ్డప్పుడు బయటకు రాకుండా ఉండడమే మంచిదని సూచిస్తున్నారు. 

Updated Date - 2020-06-11T10:50:01+05:30 IST