‘బాబ్రీ’పై తీర్పు బాధించింది

ABN , First Publish Date - 2020-10-01T09:07:42+05:30 IST

బాబ్రీమసీదు కూల్చివేతకు సంబంధించి బుధవారం వెల్లడైన తీర్పుపై పలు సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘బాబ్రీ’పై తీర్పు బాధించింది

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): 

బాబ్రీమసీదు కూల్చివేతకు సంబంధించి బుధవారం వెల్లడైన తీర్పుపై పలు సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 28ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన విచారణానంతరం నిందితులను నిర్దోషులని కోర్టు ప్రకటించడాన్ని ప్రజాస్వామ్య దేశంలో జీర్ణించుకోలేక పోతున్నామని అభిప్రాయపడ్డారు. తీర్పు వెలువడగానే పాతబస్తీతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.


మొగల్‌పురాలో ఉన్న డీజేఎస్‌ కార్యాలయం వద్ద కూడా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. జనం గుంపులుగా నిలబడరాదని... సమావేశాలు నిర్వహించరాదని పోలీసులు సూచనలు జారీ చేశారు. 


సాక్షాలు లేవనడం విచారకరం   -మాజిదుల్లా ఖాన్‌ ఫర్హత్‌

బాబ్రీమసీదు విధ్వంస కాండలో ఉన్న 49మంది నిందితులను నిర్దోషులుగా కోర్టు ప్రకటించడాన్ని ఎంబీటీ పార్టీ అధ్యక్షుడు మాజిదుల్లా ఖాన్‌ ఫర్హత్‌ ఖండించారు. ఆధారాలన్నీ ఉన్నా... వరసగా వస్తున్న ఇలాంటి తీర్పులు చరిత్రలో నిలిచిపోతాయని ఆయన అన్నారు. 1992 డిసెంబర్‌ 6న జరిగిన ఈ దారుణానికి సాక్ష్యాలు లేవనడం విచారకరమని ఆయన అన్నారు. దర్యాప్తు శాఖలు, కోర్టులు, బ్యూరోక్రాట్లను తమ చేతుల్లో పెట్టుకుని ప్రభుత్వాలు ఆడుతున్న ఆటలు వారి నాశనానికే దారి తీస్తాయని చెప్పుకొచ్చారు.    


మసీదును కూల్చిందెవరు? - లతీఫ్‌ మహ్మద్‌ఖాన్‌

ఇక్కడా సెంటిమెంట్‌ ఆధారంగానే తీర్పునిచ్చారని సివిల్‌ లిబర్టీస్‌ జనరల్‌ సెక్రటరీ లతీఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ అన్నారు. ఒకవేళ ఆ 49మంది మసీదు కూల్చివేతలో నిందితులు కాకుంటే ఆ రోజు మసీదు కూల్చిందెవరని ప్రశ్నించారు. వీడియోలు, ఫొటోలు, ఆధారాలున్నా... ఆధారాల్లేవని కోర్టు ప్రకటించడం విచారకరమని ఆయన అన్నారు.


దూరదర్శన్‌ చానెల్‌లో చూపింది తప్పా?     - హామిద్‌ మహమ్మద్‌ ఖాన్‌

1992 డిసెంబర్‌ 6న జరిగిన విధ్వంస కాండ గురించి, అప్పట్లో మసీదు కూల్చివేతకు సంబంధించిన దృశ్యాలను దూరదర్శన్‌ చానెల్‌లో కూడా ప్రసారం చేశారు.  అందులో చూపిన దృశ్యాలు కోర్టులో చెల్లవని చెప్పడాన్ని జమాతే ఇస్లామీ హింద్‌ రాష్ట్ర అధ్యక్షుడు హామిద్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఖండించారు. 


Updated Date - 2020-10-01T09:07:42+05:30 IST