గాంధీలో సాధారణ ఓపీలు బంద్‌

ABN , First Publish Date - 2020-03-24T09:43:02+05:30 IST

కొద్దిపాటి జలుబు చేసినా సరే కరోనా భయంతో ప్రజలంతా నేరుగా గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రులకే వెళ్తున్నారు.

గాంధీలో సాధారణ ఓపీలు బంద్‌

ఫీవర్‌, చెస్ట్‌ ఆస్పత్రుల్లో కూడా

కరోనా సేవలకే అధిక ప్రాధాన్యం

గాంధీ ఆస్పత్రికి రోజూ 250 మంది

మరో 100 పడకల పెంపునకు ఏర్పాట్లు


అడ్డగుట్ట/హైదరాబాద్‌ సిటీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కొద్దిపాటి జలుబు చేసినా సరే కరోనా భయంతో  ప్రజలంతా నేరుగా గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రులకే వెళ్తున్నారు. ఫలితంగా ఆ ఆస్పత్రుల్లో కరోనా ఓపీ క్యూ విపరీతంగా పెరిగిపోతోంది. గాంధీ ఆస్పత్రిలో మొదట్లో 20 మంది కరోనా అనుమానంతో ఆస్పత్రికి వస్తేఇప్పుడు ఏకంగా 250కి చేరుకుంది. దీంతో రద్దీకి అనుగుణంగా సేవలను అందించడానికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈ ఆస్పత్రుల్లో ఇక నుంచి కరోనా చికిత్సలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గాంధీ, ఫీవర్‌, చెస్ట్‌ ఆస్పత్రుల్లో ఓపీ సేవలను బంద్‌ చేశారు. ఓపీ విభాగాల్లో పనిచేసే సిబ్బంది కేవలం కరోనాకు సంబంధించిన సేవలను మాత్రమే అందించనున్నారు.


గాంధీ ఆస్పత్రిలో 12 వందల నుంచి 18 వందల వరకు, ఫీవర్‌ ఆస్పత్రిలో వెయ్యి వరకు, చెస్ట్‌ ఆస్పత్రిలో 250 నుంచి 350 వరకు ఓపీ ఉంటుంది. వీరందరికీ వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. అయితే ఈ ఆస్పత్రుల్లో అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకమూ ఉండదని వైద్య వర్గాలు తెలిపాయి. ఇక గాంధీలో ఇప్పటికే రెండు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి 50 పడకలను కరోనా అనుమానితులకు కేటాయించారు. ఒక్క సోమవారమే 35మంది అనుమానితులు గాంధీలో అడ్మిట్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో గాంధీలో మరో 100 పడకలను పెంచనున్నారు. చెస్ట్‌ ఆస్పత్రిలో 52 పడకలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. కింగ్‌ కోఠిలోని ప్రభుత్వ ఆస్పత్రిని పూర్తిగా కరోనా చికిత్స ఆస్పత్రిగా మార్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నిమ్స్‌లో ప్రత్యేకంగా ఒక భవనాన్ని కరోనా వైద్య సేవలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. సరోజనీ దేవి కంటి ఆస్పత్రి 150 పడకలతో సిద్ధమవుతోంది. 

Read more