ఆస్పత్రులకు క్యూ కడుతున్న అనుమానితులు
ABN , First Publish Date - 2020-04-07T09:20:06+05:30 IST
కరోనా వైరస్ తీవ్రత పెరగుతోంది. రోజు రోజుకూ వైరస్ అనుమానంతో ఆస్పత్రులకు క్యూకట్టే సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం గాంధీ, చెస్ట్, కింగ్‌కోఠి

హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ తీవ్రత పెరగుతోంది. రోజు రోజుకూ వైరస్ అనుమానంతో ఆస్పత్రులకు క్యూకట్టే సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం గాంధీ, చెస్ట్, కింగ్‌కోఠి ఆస్పత్రుల్లో కరోనా వైరస్ చికిత్సలు అందిస్తున్నారు. ఫీవర్ ఆస్పత్రిలో కేవలం అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి నిర్ధారణ చేస్తున్నారు. అందులో ఎవరికైనా పాజిటివ్ అని తెలితే వారిని చెస్ట్, గాంధీ ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
గాంధీ ఆస్పత్రిలో....
గాంధీ ఆస్పత్రిలో సోమవారం అవుట్ పేషంట్ల విభాగంలో 138 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 170 మందిని ఆస్పత్రిలో చేర్చుకొని వారి వద్ద నుంచి నమునాలు సేకరించారు. గాంధీ ఆస్పత్రిని పూర్తిగా కరోనా చికిత్సకే కేటాయించారు. ఇక కింగ్‌కోఠిలో 71 మంది నుంచి నమునాలు సేకరించగా అందులో 50 మందికి నెగిటివ్ నివేదిక వచ్చింది. మరో తొమ్మిది మంది వద్ద నుంచి నమునాలు సేకరించి ఉస్మానియా మెడికల్ కాలేజీలోని ల్యాబ్‌కు తరలించారు. ఇంకా వారి నివేదికలు రావాల్సి ఉంది. ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం 17 మంది పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
ఫీవర్ ఆస్పత్రికి మరో 13 మంది
గోల్నాక: నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి సోమవారం మరో 13 కరోనా వైరస్ అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీరంతా నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు. ఆస్పత్రికి వచ్చిన వీరందరినీ సిబ్బంది ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేర్చుకొని వైద్యుల పర్యవేక్షణ ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఛాతీ ఆస్పత్రిలో 21 మంది పాజిటివ్స్
అమీర్‌పేట: ఛాతీవైద్యశాలలో సోమవారం 21 మందికి కరోనా పాజిటివ్ రాగా, వీరిని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించి ప్రత్యేక చికిత్స చేయిస్తున్నారు. ఆసుపత్రిలో చేరిన మరో 29 మందిని అనుమానితులుగా గుర్తించి వైద్యసేవలు అందజేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ మహబూబ్‌ఖాన్ వెల్లడించారు.
సరోజినీ దేవి ఆస్పత్రిలో ఐసొలేషన్‌లో 127 మంది
మెహిదీపట్నం: సరోజినిదేవి ప్రభుత్వ కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా ఐసొలేషన్ వార్డులో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు 127 మంది ఉన్నట్లు ఇన్‌ఛార్జ్ డాక్టర్ అనురాధ తెలిపారు.
ఐసోలేషన్‌కు సిద్ధమైన హోమియో ఆసుపత్రి
రామంతాపూర్: ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రి, వైద్య కళాశాలలో కరోనా వైరస్ బాధితుల కోసం ఐసోలేషన్ కేంద్రాన్ని సిద్ధం చేశారు. హోమియోపతి ఆస్పత్రితోపాటు వైద్య కళాశాలలోని తరగతి గదులలో 120 పడకల సామర్థ్యం గల ఐసోలేషన్ కేంద్రం అన్ని వసతులతో సిద్ధం చేసినట్లు ఆయుష్ అదనపు డైరెక్టర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.లింగరాజు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీదేవి వెల్లడించారు. ఐసోలేషన్ కేంద్రంలో 24 గంటల పాటు షిఫ్ట్‌ల వారీగా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని, మెరుగైన వైద్య సేవలను అందిస్తారని వారు తెలిపారు.