చెరువు నిండింది.. పల్లె మురిసింది

ABN , First Publish Date - 2020-08-20T09:49:20+05:30 IST

ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం పెద్దఅంబర్‌పేట్‌ మున్సిపాలిటీ పరిధిలోని

చెరువు నిండింది.. పల్లె మురిసింది

నిండుకుండలా శివారు చెరువులు 

ఆనందంలో ప్రజలు, రైతులు 


అబ్దుల్లాపూర్‌మెట్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం పెద్దఅంబర్‌పేట్‌ మున్సిపాలిటీ పరిధిలోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ప్రస్తుతం చెరువులు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లోని రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగేళ్ల నుంచి అనుకున్న స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయిన విషయం తెలిసిందే. 

 

పెద్దఅంబర్‌పేట్‌లోని ఈదులచెరువు, కార్కానాకుంట పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌ రింగురోడ్డు కత్వా ద్వారా వస్తున్న వరదనీటితో చింతలచెరువు పూర్తిగా నిండింది. దీంతో మత్స్యకారులు అలుగు వద్ద చేపలు బయటకి వెళ్లకుండా వలలు కట్టారు. అదేవిధంగా ఇనాంగూడలోని బైరాన్‌ఖాన్‌ చెరువు కూడా పూర్తిగా నిండి ంది. కట్టకు పగుళ్లు రావడంతో చెరువులోకి వరదనీరు రాకుండా మళ్లించారు. జాఫర్‌గూడ చెరువు సైతం అలుగు పోయనుంది. బాటసింగారంలోని బాటచెరువులోకి వరదనీరు చేరుతుండగా చిన్నకుంటలు ఇప్పటికే నిండిపోయాయి. పిగ్లీపూర్‌లోని బొమ్మలచెరువు పూర్తిగా నిండింది. కవాడిపల్లిలోని పెద్దచెరువు, పాతకుంట నిండి అలుగు పారేందుకు సిద్ధంగా ఉన్నాయి. వరదనీరు ఎక్కువైతే చెరువు కట్టలకు ప్రమాదం పొంచి ఉంది.  


వ్యవసాయ పనులకు స్వీకారం..

చెరువుల కింద ఆయకట్టు రైతులు చాలా ఏండ్ల తర్వాత వ్యవసాయ పనులు చేపట్టేందుకు స్వీకారం చుట్టారు. గ్రామాల్లో రైతులతోపాటు, కులవృత్తుల కుటుంబాలకు చెరువు కింద ఆయకట్టు పొలాలు ఉంటాయి. వారందరు వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు సమాయత్తం అవుతున్నారు. 

Updated Date - 2020-08-20T09:49:20+05:30 IST