కనిపించకుండా పోయారు..వేర్వేరు చోట్ల పిల్లలతో సహా తల్లుల అదృశ్యం
ABN , First Publish Date - 2020-11-03T09:39:32+05:30 IST
మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు పిల్లలతో తల్లి, బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు పిల్లలతో మరో తల్లి కనిపించకుండా పోయారు.
మియాపూర్/ బోయిన్‌పల్లి, నవంబర్ 2 (ఆంధ్రజ్యోతి): మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు పిల్లలతో తల్లి, బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు పిల్లలతో మరో తల్లి కనిపించకుండా పోయారు. కృష్ణాజిల్లాకు చెందిన దీపిక(34), వెంకటేష్ ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి కూతురు శైలజ(14), కుమారుడు చైతన్య(9) ఉన్నారు. కొద్ది రోజుల క్రితం వచ్చి న్యూహఫీజ్‌పేట ప్రేమ్‌నగర్‌లో ఉంటున్నారు. భర్త అమెజాన్‌లో ఉద్యోగి. అక్టోబర్ 2న తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి బయటకు వెళ్లి తిరిగి రాలేదని మియాపూర్ పోలీసులకు భర్త వెంకటేష్ ఫిర్యాదు చేశాడు. కానీ, వాస్తవానికి వీళ్లు ఆగస్టు 31న ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. అయితే, భర్త ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేశారు. అయితే, ప్రేమ వివాహం కావడంతో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఎనిమిదేళ్ల క్రితమే భర్తతో గొడవ పడిన దీపిక బయటకు వెళ్లి కొద్దినెలల తర్వాత తిరిగి వచ్చింది. ఆగస్టు 8న భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరికి కౌన్సెలింగ్ చేసి పంపివేశారు. మియాపూర్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిన్నతోకట్టకు చెందిన వీణ (35) భర్త చనిపోవడంతో అత్తగారి ఇంటి వద్దే ఉంటోంది. కుమారుడు విష్ణువర్ధన్(11), కుమార్తె (9) ఉన్నారు. గత నెల 28న పిల్లలతో కలిసి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సోమవారం బోయన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ యుగేందర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.