‘ దళపతి’ 102

ABN , First Publish Date - 2020-05-30T10:15:38+05:30 IST

రోజూ పొద్దున నాలుగు గంటలకే మెలుకువొస్తది. అప్పుడు నిద్రలేచి నేనేం చేస్తా.. మంచం

‘ దళపతి’ 102

‘‘ఆయన తొలితరం తెలంగాణ ఉద్యమ పథికుడు. రైతాంగ సాయుధ పోరాటానికి దళపతి. ఆయనే 102 ఏళ్ల బండ్రు నర్సింహులు. అక్షరం రాయడం రాకున్నా, నిత్యం దినపత్రిక చదవడమే ఆయన కాలక్షేపం. నర్సింహులు దైనందిన జీవితాన్ని చూసి బద్దకం భయపడాల్సిందే. నిస్సత్తువ నేలకొరగాల్సిందే. వృద్ధాప్యం శరీరానికే కానీ, మనసుకు కాదనడానికి ఆయన ఆలోచనా తీరే నిదర్శనం. భవిష్యత్‌పై ఆయన కళ్లల్లో ఎన్ని కలలో.. లాక్‌డౌన్‌ వేళ పోరాటయోధుడు నర్సింహుల్ని ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. ఈ సందర్భంగా ఆయన జీవనశైలి విశేషాలతో పాటు అలనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. 


హైదరాబాద్‌ సిటీ, మే 29 (ఆంధ్రజ్యోతి): రోజూ పొద్దున నాలుగు గంటలకే మెలుకువొస్తది.  అప్పుడు నిద్రలేచి నేనేం చేస్తా.. మంచం మీదే ఇటు అటు పొర్లి ఆరింటిదాంకా పండుకుంటా. ఇదివరకు కాసేపు వాకింగ్‌ చేసేది. ఇప్పుడు చేస్తలేను. అప్పుడు పేపరొస్తది.. మధ్యలో నర్సింహులు కొడుకు ప్రభాకర్‌ కల్పించుకొని ‘‘పేపర్‌ రావడం కాస్త ఆలస్యమైనా, నాయన ఊరుకోడు. పేపర్‌బాయ్‌ మీద అరుస్తడు’’ అన్నారు. నేను చదివేది ‘ఆంధ్రజ్యోతి’ పేపరే. ప్రజల సమస్యల మీద మంచిగ రాస్తరు. నాలుగో పేజీ మొత్తం చదువుతా. ఆదివారం రోజు ‘కొత్తపలుకు’ కంపల్సరీ చదువుతా. అందులో ఇప్పుడు ఆంధ్ర జగన్‌ మీద మంచిగ రాస్తున్నడు. నిజంగా అయితే, జగన్‌ని జైల్లో పెట్టాలి. ఏదో ఒక ఊపొచ్చి, కోట్లుపంచి గెలిచిండు.


కానీ ముఖ్యమంత్రిగా ఆయనకి అర్హతలేదు. నాకు చెవులు ఇనరావు. అందుకే టీవీ చూడను. దినమంతా పేపరుతోనే పొద్దుపోతది. మధ్యాహ్నం రెండు గంట లు పండుకుంటా. మళ్లా నిద్ర పట్టినా, పట్టకపోయినా రాత్రి పదింటికి పండుకుంటా. తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నప్పుడు ‘కిక్‌’మని సప్పుడొచ్చినా మెలుకువొచ్చేది. శత్రువు దాడి చేస్తే కష్టం కదా అని. చిన్నప్పటి నుంచి నాకు నిద్ర తక్కువే. ఇప్పుడు ఒక గంట నిద్రపడితే మహాఎక్కువ. అప్పుడప్పుడు మా ఇంటికి నా బిడ్డ విమలమ్మ(ప్రజా గాయని), అల్లుడు వచ్చిపోతరు. వాళ్లతో రాజకీయాలు మాట్లాడతా. ఎప్పుడన్నా సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి వచ్చిపోతుంటడు. చాన్నాళ్ల నుంచి నేను బయటికెళ్లడం తక్కువైంది. కరోనాతో నాకేం పెద్ద సంబంధం లేదు. ఇంటికొచ్చినోళ్లతో పాటు నా చేతులకూ మనమళ్లు అదేందో మందు(శానిటైజర్‌) రాస్తున్నరు. 


జొన్నగట్క, వ్యాయామం

నాకు పళ్లు లేవు. ఉదయం టిఫిన్‌లో ఇడ్లీ, దోశ, ఉప్మా... ఏమి చేస్తే అది పెరుగులో నానబెట్టి, మెత్తంగ అయినంకే తింటా. మధ్యాహ్నం ఒంటి గంటకి జొన్నగట్క తీసుకుంటా. తాగుడు అలవాటు లేదు. ఛాయ్‌ కూడా తాగను. వయసులో ఉన్నప్పుడు కుండెడు కందులు ఉడకబెట్టుకొని తినేది. చేలల్లో మక్కలు(మొక్కజొన్న కండెలు) కాల్చుకొని తినేది. ఇక పండ్లు, ఫలాలు, ఈతకాయలు, ముంజలు మస్త్‌ తినేది. చిన్నప్పటి సంది జొన్నగట్క, రొట్టె తినడం అలవాటు. ఇప్పుడు రోజూ మామిడి పండ్లు తింటున్నా. అప్పుడప్పుడు బొప్పాయి తింటా. డైలీ రాత్రిపూట ఒక గ్లాసు పాలు తాగుతా. బీపీ, షుగర్‌ ఏమీ లేవు. ఎండకాలం కడుపులో మంటగుంటదని, రెండు పూటలా జొన్నగట్క తింటున్నా. ప్రతిరోజూ సాయంత్రం ఒక గంట కాళ్లు, చేతులు ఆడిస్తూ వ్యాయామం చేస్త. నా భార్య నర్సమ్మ చనిపోయి పదేళ్లు. ఆనాటి సంది నా కోడలు అండాలు నన్ను కన్నతల్లిలాగా చూస్తుంది.

 

జైల్లో చదువుకున్నా..

తెలంగాణ సాయుధ పోరాటం నాటి విషయాలు ఈ మధ్య నాకు బాగా జ్ఞాపకం వస్తున్నాయి. నా సొంతూరు భువనగిరి జిల్లా, ఆలేరు. నేను అస్సలు బడికేపోలేదు. ఇప్పటికీ నాకు రాయరాదు. ఒట్టిగా పేపరు చదువుతానంతే. అక్షరాలు దిద్దడం, చదవడం నల్గొండ జైల్లో నేర్చుకున్నా. అదివరకు నాకు అక్షరం ముక్క రాకపోయేది. జైల్లో చదువొచ్చిన కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు మాకు భూమిమీద, బండమీద మట్టిపోసి అక్షరాలు దిద్దిచ్చేది. అప్పుడు నేర్వబట్టి నాకు చదవడం వచ్చింది. నా జీవితంలో మొత్తం 22ఏళ్లు ఖైదుఖానాలో గడిపినా. 1935 నుంచి ఆంధ్రమహాసభ ఉద్యమంలో ఉన్నా. 1944, భువనగిరి సభ కాన్నించి రావి నారాయణరెడ్డి గ్రూపులో పనిచేశా. ఆ తర్వాత సాయుధ పోరాటంలో ఒక దళానికి నాయకత్వం వహించినా. ఒకసారేమైంది, మా తాన ఆయుధాల్లేవు. యాదగిరిగుట్ట దగ్గర వంగపల్లి రైల్వేస్టేషన్లో ఆయుధాలు కొల్లగొట్టేందుకు మేము ప్లాన్‌ చేసినం. ఎవరికీ అనుమానం రాకూడదు కదా, అందుకని బి. శివారెడ్డి నాయకత్వంలో భద్రారెడ్డి, నేనూ, మరో ముగ్గురం కలిసి అయ్యోరుకుమల్లే గోచీలు కట్టి, నుదుట నామాలు పెట్టి వంగపల్లి పోలీస్టేషన్‌కి పోయినాం. అక్కడ చూస్తే, ఒక్కడు తప్ప, మిగతా పోలీసులంతా కల్లుతాగనీకి పోయిండ్రు. వాడిని ఒక రూమ్‌లో అణగబట్టి, ఐదు తుపాకీలు తీసుకొని పారిపోయినం. అందులో నాలుగు ట్వల్వ్‌బోల్టు తుపాకీలు, ఒక పెద్ద తుపాకీలుండె. 


మూడునెలలు చిత్రహింసలు..

 నల్గొండ జిల్లా, కొండాపురం చెరువు వెనక దొరల భూములున్నాయి. అందులో కుప్పలు పోసున్న పదిహేను పుట్ల వడ్లను ఆ ఊర్లో వెట్టిచాకిరీ చేసేటోళ్లందరికీ లక్ష్మీనర్సింహారెడ్డి దళం, నా దళం కలిసి పంచిపెట్టినం. తర్వాత కొలనుపాకలోని ఆరుట్ల రామచంద్రారెడ్డి బావికాడ పోలీసులు మమ్మల్ని ఘోరావ్‌ చేసిండ్రు. ‘శత్రువుకి ఆయుధాలు దొరకద్దని మా పాలసీ’. మిగతా వాళ్లంతా ఎటోళ్లు అటు ఉరికిండ్రు. నేనేం చేసినా, పోలీసోళ్లు బూట్లతో చేలో అయితే ఉరకలేరని ఆరు వందల తూటాల సంచి భుజానేసుకొని, పది తుపాకీలు చేతపట్టి చేలపొంటి పరిగెత్తినా. అయినా వాళ్లు నన్ను వదల్లె. చివరికి ఆయుధాలన్నీ ఒకతాన దాచి, జొన్నచేలో చొరపడ్డా. అప్పుడు పోలీసోళ్లు చేనంతా తొక్కి, నన్ను పట్టుకొని, పడిపోయేట్టు దెబ్బలు కొట్టిండ్రు.


నన్ను అరెస్టు చేసి, (1948, ఆగస్ట్‌ 22) ఆలేరు పోలీసుస్టేషన్కి తీసుకుపోయిండ్రు. ఆడ్నించి మూడు నెలలు ఆలేరుకి, జనగామకి నన్ను తిప్పుతూ... స్టేషన్లో రోజూ పోలీసులు లాఠీలతో కొట్టేది. ఆ దెబ్బలకి కాళ్లు, చేతులు ఉబ్బినై.  మా అమ్మ ఇంటికాడ్నించి వేడినీళ్లు తెచ్చి, నా ఒంటిపై దెబ్బలు తగిలిన చోట కాపేది. ఆ తర్వాత భువనగిరి కోర్టుకి హాజరుపరిచిండ్రు. అప్పుడు నాలుగేళ్లు నల్గొండ, చంచల్‌గూడ జైళ్లలో ఖైదుగా ఉంటిని. ఒకపాలి నల్గొండ జైలుకొచ్చిన  కలెక్టరు, ఒట్టి పుణ్యానికి కట్టెతీసుకొని నా కడుపులో పొడవపట్టిండు. దాంతో నేను ‘జై’ అని పెద్దగా అరిచినా, అంతే, అక్కడున్న ఖైదీలంతా ఆయన్ని చుట్టుముట్టిండ్రు.


ఇక చూడు, నేను ఆ కలెక్టరు కాళ్లుపట్టుకొని కిందకిలాగి, తొక్కుడు తొక్కిన. తర్వాత ఇరవై మంది పోలీసులు నన్ను కట్టెలతో అటు కొట్టి, ఇటుకొట్టి చంపుడు చంపిండ్రు. అప్పుడు అంతా నేను చచ్చిపోయిననుకుండ్రు. తర్వాత ఆస్పత్రిలో చేర్పించిండ్రు. అక్కడ డాక్టర్‌ చలపతిరావు అని గుంటూరాయన. చాలా మంచి వ్యక్తి. పోలీసులు మమ్మల్ని మళ్లీ కొట్టనీకి తీసుకెళుతుంటే, ఆ డాక్టరు ఆపిండు. అలా చెప్పుకుంటూపోతే మస్త్‌ జ్ఞాపకమొస్తున్నయ్‌. 


అదే చివరి కోరిక!

‘నేను ఆ సమావేశానికి పోయినట్లు, ఈ సమావేశానికి పోయినట్లు’ ఈ మధ్య ఎక్కువ కలలు పడుతున్నయి. ఒకపాలైతే, చీలికలు, పీలికలైన కమ్యూనిస్టు పార్టీలన్నీ మళ్లీ ఒక్కటిగా కలిసేందుకు సమావేశమైనట్లు కలపడింది. ఈయాల కాకపోతే రేపైనా నా కల నిజమైతది. నాకా ఆశ ఉంది. పేపర్లో వలసకూలీల కష్టాలు చదువుతుంటే, చానా బాఽధైతాంది. సొంత ఊర్లకి పోయేటోళ్లను పోనియ్యాలె. పాపం, చానామంది వందల కిలోమీటర్లు నడిచిపోతుండ్రు.


కొందరు తొవ్వలో సచ్చిపోతుండ్రు (చెమ్మగిల్లిన కళ్లతో...). అదే, కార్మికవర్గం అధికారంలో ఉంటే, ఇలాంటి సమస్యలు ఉండేటివా.! దోపిడీ, దుర్మార్గాలు లేని సమాజం రావాలె. అందుకోసం మంచివాళ్లంతా కలిసి నడవాలె. నా డెడ్‌బాడీని ప్రభుత్వ ఆస్పత్రికి రాసిచ్చిన. నేను సచ్చిన తర్వాత కూడా నా శరీరం సమాజానికి ఉపయోగపడాలె. చివరి వరకూ నేను సమాజానికి అక్కరకి రావాలనేది నా కోరిక. 


Updated Date - 2020-05-30T10:15:38+05:30 IST