వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-14T04:42:21+05:30 IST

నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి ఆత్మహత్య
విక్రమ్‌ మృతదేహం

నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వెస్ట్‌ మారేడుపల్లిలో వ్యాపారి, తుక్కుగూడలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, షాహినాజ్‌గంజ్‌లో గోల్డ్‌ స్మిత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో కేసులు దర్యాప్తులో ఉన్నాయి.

అపార్టుమెంట్‌పై నుంచి దూకి వ్యాపారి...

మారేడుపల్లి డిసెంబర్‌ 13(ఆంధ్రజ్యోతి): మానసిక ఒత్తిడికి గురైన ఓ వ్యాపారి బహుళ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మారేడుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్పై ప్రభాకర్‌ రెడ్డి తెలిపిన ప్రకారం.. వెస్ట్‌ మారేడుపల్లిలోని తేజస్విని ఆర్కెడ్‌ అపార్టుమెంట్‌లోని రెండో అంతస్తులోని ఓఫ్లాట్‌లో వ్యాపారి విక్రమ్‌(30) భార్య గాయత్రి, ఇద్దరు పిల్లలు, తల్లితో కలిసి నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం 10గంటల సమయంలో తాను ఉంటున్న అపార్టుమెంట్‌ 5వ అంతస్తుపైకి వెళ్లి కిందికి దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తులో ఉంది.


అప్పుల బాధ భరించలేక సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌..

పహాడిషరీఫ్‌, డిసెంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యం, అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పహాడిషరీఫ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడకు చెందిన శ్యాం(36) నాగోల్‌లోని హోండా షోరూం లో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం భార్యను శంకర్‌పల్లిలో వదిలి ఉద్యోగానికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వెళ్లి ఉరేసుకున్నాడు. మృతుడు అనారోగ్యంతో బాధ పడుతున్నాడని, అప్పులు కూడా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


కుటుంబ కలహాలతో గోల్డ్‌ స్మిత్‌..

అఫ్జల్‌గంజ్‌, డిసెంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి  ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన షాహినాజ్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. చుడీబజార్‌ జైన్‌ మందిర్‌సమీపంలో నివాసం ఉంటున్న కె.విష్ణు(45) రాధిక దంపతులు, వీరికి ఇద్దరు సంతానం. విష్ణు గోల్డ్‌ స్మిత్‌ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఎనిమిది నెలల నుంచి విష్ణు కుటుంబ కలహాలు, ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్నాడు. 5నెలల క్రితం భార్య రాధిక పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో విష్ణు మూడు రోజులుగా అత్తగారింట్లో ఉండి శనివారం రాత్రి ఇంటికి వచ్చాడు. తాను ఉండే ఇంట్లోని మొదటి అంతస్తులో తన గదిలోకి వెళ్లిన విష్ణు లోపల గడియ పెట్టుకుని టవల్‌తో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం గదితలుపులు తెరవకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి కిటికిలో నుంచి చూడగా విష్ణు ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-14T04:42:21+05:30 IST