కరోనాపై సర్వైలెన్స్‌ బృందాలు..!

ABN , First Publish Date - 2020-03-24T09:31:14+05:30 IST

విదేశాలకు వెళ్లి వచ్చిన వారి నుంచి నగరంలో కరోనా మహమ్మారి విస్తరిస్తోన్న నేపథ్యంలో వారి గుర్తింపు, క్వారంటైన్‌ కేంద్రాలకు తరలింపు ప్రక్రియను మరింత ముమ్మరం చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.

కరోనాపై సర్వైలెన్స్‌ బృందాలు..!

జీహెచ్‌ఎంసీలో ఏర్పాటు

మార్చి 1వ నుంచి వచ్చిన వారి వివరాల పరిశీలన

ఎప్పటికప్పుడు పరిశీలించాలి

ఇన్‌చార్జిగా అదనపు కమిషనర్‌ 


హైదరాబాద్‌ సిటీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):  విదేశాలకు వెళ్లి వచ్చిన వారి నుంచి నగరంలో కరోనా మహమ్మారి విస్తరిస్తోన్న నేపథ్యంలో వారి గుర్తింపు, క్వారంటైన్‌ కేంద్రాలకు తరలింపు ప్రక్రియను మరింత ముమ్మరం చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. పురపాలక శాఖ ఆదేశాల మేరకు వార్డుల వారీగా అధికారులు, సిబ్బందితో అదనపు సర్వైలెన్స్‌ బృందాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగించనుంది. మార్చి 1 నుంచి విదేశాల నుంచి నగరానికి వచ్చిన వారిని గుర్తించి ఏం చేయాలనే విషయాలను జీహెచ్‌ఎంసీకి సూచిస్తూ, తాజాగా పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాలకు వెళ్లి వచ్చిన వారి నుంచి స్థానికులకు మహమ్మారి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. 


ఇందులో భాగంగా విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వారి పరిస్థితి ఎలా ఉంది, హోం క్వారంటైన్‌లో ఉంటున్నారా, లేదా అన్నది పరిశీలించే బాధ్యతలను డివిజన్ల వారీగా ఏర్పాటు చేసే బృందాలకు అప్పగించాలని సూచించారు. 


ఒక్కో బృందంలో ఏఈ/డీఈ, ఏఎన్‌ఎం/హెల్త్‌ ఫంక్షనరీ, ఏఎ్‌సఐ/హెడ్‌ కానిస్టేబుల్‌ ఉండాలి. 


నిర్ణీత ప్రాంతం కేటాయించి, విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వివరాలు అందించి నిత్యం పర్యవేక్షించేలా చూడాలి. 


గ్రేటర్‌లోని అన్ని ఏరియాలు కవరయ్యేలా అవసరమైనన్ని బృందాలు ఏర్పాటు చేయాలి. నిర్ణీత కాలవ్యవధిలో పు వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. 


14 రోజుల పాటు వారు ఇళ్లలో ఉంటున్నారా, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, రోజూ పరిశీలించాలి. 


విదేశాల నుంచి వచ్చిన వారు ఎప్పటి వరకు హోం క్వారంటైన్‌లో ఉండాలనే ముద్ర వారి చేతిపై వేయాలి. 


హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన వారు బయటకు వస్తే సమాచారమివ్వాలని చుట్టు పక్కల ఉండే వారు, రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసొసియేషన్లు, పొదుపు సంఘాల సభ్యులకు సూచించాలి. 


కరోనా మహమ్మారి సోకకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై విస్తృత ప్రచారం చేయాలి. 


 క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి ఇబ్బంది లేకుండా మస్క్‌లు, శానిటైజర్లు అందించాలి. 


లక్షణాలు ఉన్నట్టు అనుమానం వస్తే వారిని నమూనా సేకరణ కోసం బృందాలు ఐసొలేషన్‌ కేంద్రాలకు తర లించాలి. 


పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులు ఎవరెవర్ని కలిశారు, ఎక్కడికి వెళ్లారు, వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉందన్నది ఎప్పటికప్పుడు పరిశీలించాలి. 


సర్వైలెన్స్‌ బృందాలు కరోనా బాధితులు, అనుమానిత వ్యక్తులు, విదేశాల నుంచి వచ్చిన వారి పూర్తి వివరాలు సేకరించాలి. 


సర్వైలెన్స్‌ బృందాల ఇన్‌చార్జిగా అదనపు కమిషనర్‌ను నియమించాలి.   

Updated Date - 2020-03-24T09:31:14+05:30 IST