రికార్డుల ఆదివారం
ABN , First Publish Date - 2020-03-23T09:29:29+05:30 IST
వైరస్ భయం నగర వాసిని గడపను దాటనివ్వలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కు అన్నివర్గాలూ స్పందించాయి.

బంజారాహిల్స్, మార్చి22 (ఆంధ్రజ్యోతి): వైరస్ భయం నగర వాసిని గడపను దాటనివ్వలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కు అన్నివర్గాలూ స్పందించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఎప్పుడు చూడని, వినని సందర్భాలు ఆవిష్కృతమయ్యాయి. నగర చరిత్రలో చిన్నపాటి యాక్సిడెంట్ కూడా జరగలేదు. అలాగే మర్డర్లు, దొంగతనాలు, దోపిడీలు కూడా రికార్డు కాలేదు. పోలీసు చరిత్రలో ఈ రోజు రికార్డు పుటల్లోకి ఎక్కాల్సిందే. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ల నుంచి ఈ రోజు అతి తక్కువ రైళ్లు నడిచాయి.
గత కొన్ని దశాబ్దాల్లో ఇది రికార్డే. అమీర్‌పేట లాంటి రద్దీ ప్రాంతాల్లో అదీ ఆఫీస్ అవర్స్‌లో కారు లేదా బైకుపై 80-90 కి.మీ వేగంతో వెళ్లగలిగిన సందర్భం అంటూ లేదు. కానీ.. ఆదివారం ఇది సాధ్యమైంది. నగరంలో గృహాలకు సంబంధించి అత్యధిక విద్యుత్ వినియోగంలో కూడా ఈ రోజు రికార్డే. అందరూ ఇంట్లోనే ఉండటంతో విద్యుత్ వినియోగం మునుపెన్నడూ లేని విధంగా పెరిగింది. చిన్న చిన్న గల్లీల్లోనూ దుకాణాలు మూసి ఉంచారు. ఈ నేపథ్యంలో వాణిజ్య అవసరాలకు సంబంధించి అత్యల్ప విద్యుత్ వినియోగంలో కూడా ఈ రోజే రికార్డు. లా అండ్ ఆర్డర్ పోలీసులు.. తమ ఇతర కేసులన్నింటినీ పక్కనపెట్టి కేవలం ఒకే సమస్యపై (కరోనా) దృష్టిసారించారు. ఇలాంటి రికార్డులు ఇంకా ఎన్నెన్నో...