అత్తింటి వేధింపులతో గృహిణి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-06-22T10:07:16+05:30 IST
అత్తింటి వేధింపులు భరించలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్‌పేట్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

సరూర్‌నగర్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): అత్తింటి వేధింపులు భరించలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్‌పేట్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం, తాండ్ర గ్రామానికి చెందిన ఈదులపల్లి వెంకటయ్య హస్తినాపురంలోని అగ్రికల్చరల్ కాలనీలో నివస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన తన కూతురు శివకుమారిని మీర్‌పేట్ ప్రాంతంలో నివసించే జయరామ్‌కు ఇచ్చి 2010 మే 19న వివాహం జరిపించాడు. అప్పట్లో కట్నం కింద 200 గజాల ప్లాటుతోపాటు ఇతర లాంఛనాలు అందజేశారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు పుట్టారనే నెపంతో భర్త, అత్త తరచుగా ఆమెను వేధించేవారు. ఇటీవల జయరామ్ సదరు ప్లాటును విక్రయించి మీర్‌పేట్‌లోని హనుమాన్‌నగర్‌లో ఓ ఇల్లు కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి భార్య శివకుమారితో మాట్లాడడం మానేశాడు. చీటికీ మాటికీ గొడవ పడుతూ ఆమెను దూరం పెట్టసాగాడు. ఇటీవల వారి మధ్య మనస్పర్థలు మరింత పెరిగాయి.
శనివారం ఇద్దరి మధ్య గొడవ జరుగగా, జయరామ్ ఆవేశంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. అదే సమయంలో శివకుమారి(26) బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఉరేసుకుంది. విషయం తెలిసి భర్త జయరామ్ ఇంటికి వచ్చి ఆమెనున కిందికి దించి, మామకు ఫోన్ చేశాడు. ఆయన వెంటనే వచ్చి స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే శివకుమారి మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. అల్లుడు జయరామ్‌తోపాటు అతడి తల్లి బాలకిష్టమ్మ తన కూతురును వేధించేవారని, ఈ నేపథ్యంలోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని వెంకటయ్య మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మారయ్య చెప్పారు.