కట్టడి ప్రాంతాల్లో కఠిన నిఘా
ABN , First Publish Date - 2020-04-21T10:32:15+05:30 IST
కట్టడి ప్రాంతాల్లో అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో రాకపోకలు సాగకుండా

గోల్నాక/రాంనగర్ ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): కట్టడి ప్రాంతాల్లో అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో రాకపోకలు సాగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులను పిచికారీ చేశారు. గోల్నాక డివిజన్‌లోని న్యూగంగానగర్ బస్తీలో నివసిస్తున్న నిమ్స్ నర్సుకు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు ఆ బస్తీలోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కార్పొరేటర్ కాలేరు పద్మావెంకటేష్ టీఆర్‌ఎస్ నేతలతో కలిసి బస్తీవాసులకు భోజనం ప్యాకెట్లను సోమవారం పంపిణీ చేశారు.
రాంనగర్ పోచమ్మ ఆలయ సమీపంలో ఉంటున్న ఓ వ్యక్తికి పాజిటివ్ రావడంతో ఆ ప్రాంతంలోని రహదారులను బారికేడ్లతో మూసివేశారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు. కట్టడి ప్రాంతం నుంచి ప్రజలెవరూ బయటకు వెళ్లకుండా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశామని ముషీరాబాద్ సీఐ మురళీకృష్ణ తెలిపారు. జీహెచ్‌ఎంసీ డీఎంసీ ఉమాప్రకాష్, ఏఎంఓహెచ్ హేమలత పర్యవేక్షణలో పరిసర ప్రాంతాల్లో క్రిమిసంహారక మందు పిచికారీ చేశారు. ఖైరతాబాద్ ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్‌లో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. ఆదివారం వచ్చిన ముగ్గురితో సన్నిహితంగా ఉన్న మరో 31 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ ప్రాంతంలో సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేశారు. క్వార్టర్స్‌లో వీధులన్నీ మూసివేశారు.