ఆ రాత్రి.. నాకు ‘కాళరాత్రి’.. భార్యకు ఫోన్ చేసి ఇప్పట్లో ఇంటికి రావొద్దన్నా..

ABN , First Publish Date - 2020-07-15T12:15:50+05:30 IST

కరోనా పాజిటివ్‌ అని తెలిసిన రోజు ఏడ్పు వచ్చింది. ఆ రోజు రాత్రి నాకు కాళరాత్రిగా మారింది. ఆక్సిజన్‌ లెవల్స్‌ ప్రమాదకరస్థాయిలో ఉన్నాయన్నారు. ఆక్సిజన్‌ సిలిండర్‌ కోసం ఆ రాత్రి తెలిసిన వారి వద్ద ప్రయత్నించినా దొరకలేదు. ఆ రాత్రి ఎప్పుడో నిద్ర పట్టింది

ఆ రాత్రి.. నాకు ‘కాళరాత్రి’.. భార్యకు ఫోన్ చేసి ఇప్పట్లో ఇంటికి రావొద్దన్నా..

పాజిటివ్‌ అనగానే ఏడ్పు వచ్చింది 

హోం క్వారంటైన్‌లో ఉండి కోలుకున్నా 

ఇప్పుడు ఆరోగ్యం బాగుంది.. 

మరికొన్ని రోజులు ఇంట్లోనే ఉంటా.. 


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి) : కరోనా పాజిటివ్‌ అని తెలిసిన రోజు ఏడ్పు వచ్చింది. ఆ రోజు రాత్రి నాకు కాళరాత్రిగా మారింది. ఆక్సిజన్‌ లెవల్స్‌ ప్రమాదకరస్థాయిలో ఉన్నాయన్నారు. ఆక్సిజన్‌ సిలిండర్‌ కోసం ఆ రాత్రి తెలిసిన వారి వద్ద ప్రయత్నించినా దొరకలేదు. ఆ రాత్రి ఎప్పుడో నిద్ర పట్టింది. తెల్లవారిన తర్వాత కొంత పర్వాలేదనిపించింది. పూర్తిగా హోం క్వారంటైన్‌లోనే ఉన్నా.. ఇప్పుడు కోలుకున్నా.. మరికొన్ని రోజులు హోం క్వారంటైన్‌లోనే ఉండి, అప్పుడు మళ్లీ పరీక్షలు చేయించుకుంటా అంటున్నారు మెహదీపట్నం ప్రాంతానికి చెందిన అఫ్రోజ్‌(పేరు మార్చాం). ఇప్పుడాయనకు ఎలాంటి లక్షణాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ లేవు. కరోనాను జయించిన అఫ్రోజ్‌ ఏమంటున్నాడంటే.. 


నాది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం. లాక్‌డౌన్‌లో బిజినెస్‌ అంతగా లేకపోవడంతో ఇంటి పట్టునే ఉన్నాను. భార్యాపిల్లలు జూన్‌ మొదటి వారంలో అత్తగారింటికి వెళ్లారు. అమ్మతో కలిసి ఇంట్లో ఉండేవాడిని.  పాఠశాలకు సెలవులు కావడంతో చెల్లెలు కూడా పిల్లలతో సహా ఇంటికి వచ్చి ఉంటోంది.  రోజూ కరోనా కథనాలు చూసి ఆందోళన చెందేవాడిని. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా ను. అప్పుడప్పుడూ బంధువులూ వచ్చి పోయే వారు. అయి నా, అకస్మాత్తుగా ఆరోగ్యంలో మార్పు వచ్చింది. అయితే, కరోనా టెస్ట్‌ చేయించుకోవాలన్న ధ్యాసకూడా రాలేదు.  


మొదట్లో నిర్లక్ష్యం..  

జూన్‌ 14న అమ్మతో కలిసి బైకుపై బంధువుల ఇంటికి వెళ్లాను. వెళ్తున్న సమయంలో కొద్దిగా దగ్గు ప్రారంభమైంది. పాతబస్తీలోని వారి ఇంటికి వెళ్లేసరికి కొంత పెరిగింది. అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి, తిరిగి బయలుదేరాం. వర్షం పడటంతో అలాగే తడుస్తూ ఇంటికి వచ్చాను. రెండో రోజు కూడా దగ్గు అలాగే ఉంది. కొంచెం జ్వరం పెరిగింది. స్థానికంగా ఓ డాక్టర్‌ దగ్గరకు వెళ్తే, జ్వరానికి సంబంధించిన మాత్రలు ఇచ్చారు. అవి వాడినా మార్పు రాలేదు. మరో రెండు రోజులు గడిచాయి. దగ్గు పెరిగింది. అప్పుడు అనుమానం వచ్చింది. భార్యకు ఫోన్‌ చేసి ఇప్పట్లో ఇంటికి రావొద్దని చెప్పాను. చెల్లెల్ని కూడా వెళ్లిపోమ్మని చెప్పాల్సి వచ్చింది. ఇంట్లోనే అటాచ్‌ బాత్‌రూం ఉన్న ప్రత్యేక గదిలో క్వారంటైన్‌ అయ్యాను. అయినా, దగ్గు పెరుగుతూనే ఉంది. ఏం తినాలనిపించడం లేదు. జూన్‌ 23న పరిస్థితి కొంచెం ప్రమాదకరంగా అనిపించింది. ఏం తిన్నా.. వెంటనే వాంతులు అయ్యేవి. నాన్‌స్టా్‌పగా దగ్గుతో పాటు టెంపరేచర్‌ 101 చూపించడంతో ఆందోళన పెరిగింది. 


నిద్ర పట్టలేదు.. 

ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ, నేను ఉండే గదులను శానిటైజ్‌ చేసుకున్నాం. అమ్మ ఉప్మా చేస్తే    తినలేకపోయా. పాలు తాగి రాత్రి డోసు మాత్రలు వేసుకున్నాను. ఆక్సిజన్‌ లెవెల్‌ (పరికరం కొనుక్కున్నాను) చూస్తే 90-86 మధ్య ఉంది. డాక్టర్‌ను అడిగితే అది ప్రమాదకరస్థాయి అన్నారు. తెలిసిన వారిని, వివిధ వాట్సాప్‌ గ్రూపుల్లో ఆక్సిజన్‌ సిలిండర్‌ కోసం ఎంతగానో ప్రయత్నించాను. ఎక్కడా దొరకలేదు. మరోపక్క ఆక్సిజన్‌ లెవల్‌ తగ్గుతోంది. ఇంట్లో అమ్మ తప్ప ఎవరూ లేరు. ఆపదొస్తే ఏం చేయాలో తోచలేదు. నిద్ర కూడా పట్టలేదు. నిజంగా ఆ రాత్రి నాకు కాళరాత్రే. తెల్లవారు జాము వరకు ఆక్సిజన్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఎప్పుడో నిద్ర  పట్టింది.


పాజిటివ్‌ అనగానే ఏడ్పు

జూన్‌ 24న ఓ డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు కాల్‌ చేయగా, చాలా మంది క్యూలో ఉన్నారని చెప్పారు. దీంతో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ చేసుకుంటూ దిల్‌సుక్‌నగర్‌లోని ఓ డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు వెళ్లాను. మూడు గంటల పాటు కూర్చుని వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. రిపోర్టు పంపిస్తామని చెప్పడంతో మధ్యాహ్నం ఇంటికి చేరుకుని నా గదిలోకి వెళ్లిపోయాను. సాయంత్రం నాలుగు గంటలకు ఫోన్‌లో రిపోర్టు వచ్చింది.


పాజిటివ్‌ ఉందని తెలియగానే చాలా ఏడ్పొచ్చింది. పాజిటివ్‌ వచ్చిందనే బాధ కన్నా... పది రోజులు నిర్లక్ష్యంగా ఉన్నానని భయం వేసింది. వైరస్‌ ప్రమాదకరస్థాయికి చేరిందేమోనని భయం పెరిగింది. వెంటనే బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో తెలిసిన డాక్టర్‌ను ఫోన్‌లో సంప్రదించాను. ఆయన వెంటనే రావాలని సూచించగా, బైకుపై వెళ్లాను. పరీక్షించి కొన్ని మాత్రలు రాసి... ఆక్సిజన్‌ సిలిండర్‌ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మెడికల్‌ షాపులో మాత్రలు తీసుకున్నప్పటికీ.. ఆక్సిజన్‌ సిలిండర్‌ పేరు చెప్పడంతో వెన్నులో వణుకు ప్రారంభమైంది. 


బలం వచ్చినట్లు అనిపించింది

జూన్‌ 25న ఉదయం 10 గంటలకు లేచాను. ఒంట్లో కాస్త హుషారుగా అనిపించింది. ఆకలి వేస్తోందని పక్క హాల్లో ఉన్న అమ్మకు టిఫిన్‌ కావాలని చెప్పాను. పేపర్‌ ప్లేట్స్‌ తెప్పించుకున్నాను. అమ్మ గిన్నెలో వండి నా గది డోర్‌ వద్ద పెట్టి వెళ్తే.. స్పూన్‌తో పేపర్‌ ప్లేట్‌లో పెట్టుకుని తింటున్నాను. దగ్గు కూడా కొంత తగ్గినట్లు అనిపించింది. ఆక్సిజన్‌ లెవల్‌ చూసుకుంటూ 94 వచ్చింది. పది రోజుల పాటు క్రమం తప్పకూండా మాత్రలు తీసుకున్నాను. మంచి ఆహారం.. ఆకుకూరలు, నాన్‌వెజ్‌ ఎక్కువగా తీసుకున్నాను. పాజిటివ్‌ రిపోర్టు వచ్చి దాదాపు 15 రోజులు అవుతోంది. ఇప్పుడు దగ్గు, జ్వరం తగ్గిపోయాయి. ఆక్సిజన్‌ స్థాయి కూడా పెరిగింది. ఇప్పుడు ఎలాంటి అనారోగ్య లక్షణాలూ లేవు. మరో 15 రోజులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోం క్వారంటైన్‌లోనే ఉంటాను. ఆ తర్వాత టెస్ట్‌ చేయించుకుంటాను. 

Updated Date - 2020-07-15T12:15:50+05:30 IST